చిత్రసీమ

11 Oct, 2019 03:11 IST|Sakshi

మాష్‌ అప్‌

సృజన.. సృష్టిలో చిత్రాలన్నిటినీ పోగేసేదాకా ఊరుకోదు. కన్వాస్, బ్రష్‌ రెస్ట్‌ తీసుకుంటే కంప్యూటర్, ఫొటోషాప్‌ వర్క్‌ మోడ్‌లోకి వెళ్తాయి. సాంస్కృతిక పునరుజ్జీవన కాలానికి, ‘పెరియారుమ్‌ పెరుమాళ్‌’ సినిమా పోస్టర్‌కు ముడి పెడ్తాయి. విన్‌సెంట్‌ వాంగో ప్రపంచ ప్రఖ్యాత పెయింటింగ్‌ ‘‘వీట్‌ ఫీల్డ్‌ విత్‌ సైప్రెసెస్‌’లో  అమాయకమైన చిరునవ్వుతో సిల్క్‌స్మిత ప్రత్యక్షమవుతుంది. ఎడ్వర్డ్‌ మూంక్‌  ‘ది స్క్రీమ్‌’కి  ‘అధే కంగళ్‌’ సినిమా జతకూడుతుంది. కత్సుషిక హొకుసై వేసిన ‘ది గ్రేట్‌ వేవ్‌ ఆఫ్‌ కనగవా’’లోకి  ‘ఉలగమ్‌ సుట్రుమ్‌ వాలిబన్‌’ హీరో ఎమ్‌జీ రాంచంద్రన్‌ దూరిపోతాడు. ఎడ్వర్డ్‌ హోపర్‌ ‘ఆటోమాట్‌’ ముందు వెటరన్‌ నటి కేఆర్‌ విజయ ప్రత్యక్షమవుతారు చేతిలో టీ కప్పుతో.

ఇలా ఆ కాలం చిత్రాలతో బయోస్కోప్‌ బొమ్మలను జత చేసి విచిత్రాలు చేస్తున్న ఆ ఆర్టిస్ట్‌ పేరు చార్ల్స్‌ బ్రిటో. చైన్నై కుర్రాడు.  ఇంజనీరింగ్‌ చదివాడు. సినిమా ఫీల్డ్‌లో కెరీర్‌ వెదుక్కున్నాడు.  ‘రెవలేషన్స్‌’ అనే ఇండీ, తమిళ్‌ సినిమాతోపాటు కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌కీ పనిచేశాడు.  ఆర్ట్‌  మీదున్న  ఆసక్తితో తర్వాత జేఎన్‌యూలోని ది స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఈస్తటిక్స్‌లో మాస్టర్స్‌ చేశాడు.  ఓ వైపు సినిమాలకు పనిచేస్తూనే ఇలా  మాష్‌ అప్‌ ఆర్ట్‌తో మ్యాజిక్స్‌ చేస్తున్నాడు. ‘‘మాష్‌ అప్‌కి నేనేం కొత్తకాదు. హాలీవుడ్, బాలీవుడ్‌ సినిమాలతో చాలా మంది ఆర్టిస్ట్‌లు మాష్‌ అప్‌ చేస్తున్నారు. నేనైతే ‘తబ్రేజ్‌’ వర్క్స్‌తో ఇన్‌స్పైర్‌ అయ్యా. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో  పోస్ట్‌ చేశాను కూడా.  తబ్రేజ్‌  వర్క్స్‌ని బయట కొనుక్కుంటున్నారు కూడా. నాకూ అలాంటి రిక్వెస్ట్‌లు వస్తున్నాయి.

వాళ్ల పర్సనల్‌ ఫొటోగ్రాఫ్స్‌ని ఇలా వరల్డ్‌ ఫేమస్‌ పెయింటింగ్స్‌తో మాష్‌ అప్‌ చేసి ఇవ్వమని. సో.. నేను కూడా ఆ దిశగా  ఆలోచిస్తున్నాను’’ అంటున్నాడు చార్ల్స్‌ . ఒక దర్శకుడైతే ఏకంగా మూడువందల మాష్‌ అప్స్‌ చేసివ్వమని అడిగాడట. ‘‘నా మాష్‌ అప్స్‌కి వచ్చిన డిమాండ్‌ నాకే ఆశ్చర్యంగా ఉంది. అందుకని ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్స్‌ కూడా తెరిచా. ఫొటోగ్రాఫర్స్, సినిమా డైరెక్టర్స్‌ నుంచి ఒకటే కాల్స్‌ వస్తున్నాయి’’ అని చెప్పాడు చార్ల్స్‌ బ్రిటో.  చెప్పినట్టుగానే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ మాష్‌ అప్స్‌ అన్నీ వైరల్‌ అవుతున్నాయట.

మరిన్ని వార్తలు