తెలుగువారి కీర్తిపతాక... పానగల్...

14 Feb, 2015 22:55 IST|Sakshi
తెలుగువారి కీర్తిపతాక... పానగల్...

చెన్నై సెంట్రల్ తెలుగువారి కబుర్లు
 
ఆ పార్క్ పేరు చెప్పడమంటే తెలుగు సినీపరిశ్రమ గురించి చెప్పడమే. తెలుగు ప్రముఖులకు అదొక సమావేశ వేదిక. సాహితీ చర్చలకు ఆలయం. ఎందరికో నీడనిచ్చి, సేదతీర్చిన చలువరాతి మేడ. ఎందరినో సంపన్నులను చేసిన అపర లక్ష్మీదేవి. ఎందరో ఆర్టిస్టులకు అన్నపూర్ణ నిలయం ఆ పార్కు. ఎందరినో తన చల్లని ఒడిలో సేదతీర్చిన అచ్చ తెలుగు అమ్మ. మద్రాసు చలనచిత్ర పరిశ్రమకు వచ్చిన వారంతా పానగల్ పార్కులో అడుగుపెట్టి, ఆ చెట్టుతల్లుల ఆశీర్వాదాలందుకుని అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఆరుద్ర, శ్రీశ్రీ, ఆత్రేయ... ఒకరేమిటి సాహితీ ఉద్దండులందరికీ అదే చర్చా వేదిక. అదే సమావేశ మందిరం. ఆ పార్కు వల్ల ప్రముఖులయ్యారా, ప్రముఖుల వల్ల ఆ పార్కు ప్రముఖం అయ్యిందా... అంటే ‘గుడ్డు ముందా! కోడి ముందా!’ అన్న చందాన ఉంటుంది.

పానగ ల్ పార్కులోని చిగురాకు మొదలు చిటారుకొమ్మల వరకు ఒకే మాట పలుకుతాయి.. ‘చలనచిత్ర పరిశ్రమకు గురుకులం వంటి వారు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు’ అని. పానగల్ పార్కులో రామకృష్ణశాస్త్రిగారి బెంచికి దక్కిన గౌరవం మరెవరికీ లేదు. పార్కుకి ఏ కొత్త సందర్శకులు వచ్చినా ముందుగా ప్రశ్నించే మాట, ‘‘మల్లాది వారి బెంచీ ఎక్కడ’’ అని. ఎందుకంటే మల్లాది వారికి పానగల్ పార్కే తల్లి, తండ్రి, దైవం. మల్లాదివారు నిత్య సందర్శకులు. ఆయనకు ఆసనం ఇచ్చి, ఆయనను గౌరవించి, తనను తాను ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చేసుకుంది పానగల్ పార్కు. ఒక్కరోజు ఆయన కనిపించకపోయినా అక్కడి చెట్లన్నీ దిగాలుపడి పోయేవి. ఆకులు రాలుస్తూ కన్నీరు విడిచేవి.

చలనచిత్రాలలో చేరాలనుకునే ఎందరో ఔత్సాహికులకు ఈ పార్కే వరాలిచ్చే దేవాలయం అయ్యింది. ప్రతి సినీ ప్రముఖులు, సాహితీవేత్తలు పానగల్ పార్కుకి నిత్య అతిథులే. మూడు పైసలతో టీ తాగి మూడు పైసలు గేటు దగ్గర ఉండే వ్యక్తికి ఇచ్చి కాళ్లు కడుపులో ముడుచుకుని నిద్రించినవారు ఎందరో! బెంచి మీద నుంచి బెంజి కారు వరకు ఎదిగిన ఎందరో నటులకు పానగల్ పార్కు ప్రత్యక్షసాక్షి. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు ఎందరో మహానుభావుల పాదస్పర్శతో పులకాంకితం అయ్యింది. మల్లాదివారు ‘భువనవిజయం’ అని ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసి, కొత్త సినీ రచయితలతో చర్చలు నిర్వహించి, సినిమాలకు మంచి స్క్రిప్ట్ రాయాలంటే ఆంగ్లనవలలు చదవాలని సూచించిన శిక్షణాలయం పానగల్ పార్కు.

పానగల్ పార్క్ బయట పేవ్‌మెంట్ బెంచీల మీద సైతం సాహిత్య సమాలోచనలు, సాహిత్యసభలు రసికులైన వారి మధ్యనిత్యం జరుగుతుండేది. మల్లాది రామకృష్ణశాస్త్రి, సముద్రాల, ఆత్రేయ, పాలగుమ్మి, గోవిందరాజుల సుబ్బారావు, ఎంఎస్. చలపతి, వేదాంతం రాఘవయ్య, వెంపటి చినసత్యం... వీరంతా సాయంత్రమయ్యేసరికి కొలువు తీరేవారు. రాత్రి ఏడు గంటలకు పన్యాల రంగనాథరావు గొంతులో కార్పొరేషన్ లౌడ్‌స్పీకర్లలో ప్రసారమయ్యే వార్తలు విని 7.15 నిమిషాలకు ‘ఇక చాలు ఇళ్లకు వెళ్లిపోదామా’ అని పార్కుని విడిచి ఇళ్లకు బయలుదేరేవారు. చలనచిత్రాలలో ఎన్నో పాటలకు ఈ పార్క్ చెట్లే అందం తీసుకువచ్చాయి. చలనచిత్ర ప్రముఖులంతా పానగల్ పార్క్ చెట్ల కింద నిద్ర చేసినవారే. సాహితీ ప్రముఖులు, నటులే కాకుండా మదరాసులోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి కూడా దేశంలో ఏ సమాచారం జరుగుతోందో తెలియచెప్పింది పానగల్ పార్కే. దీనిపక్కనే ‘లండన్ మార్కెట్’ అని ముద్దుగా పిలువబడే మార్కెట్‌లో కూరగాయలు కొనడానికి వస్తుండేవారు. ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు, అక్కడ ఉన్న సుమారు యాభై దుకాణాలలో రకరకాల స్వదేశీ విదేశీ కూరలు అమ్ముతుండేవారు. వచ్చినవారు వాటిని కొంటూనే, వార్తలు కూడా తెలుసుకుని ఇళ్లకు వెళ్లేవారు.

పానగల్ పార్కులో ఎన్నో సంగీత సాహిత్య చర్చలు జరిగేవి. ముఖ్యంగా పింగళివారు ఎన్నో విషయాలు అందరితో ముచ్చటించేవారు. మద్రాసులో ఉన్నప్పుడు ఎక్కువ రోజులు నాగయ్య గడిపినది ఈ పార్కులోనే. ఆయన గౌరవార్థం ఆయన శిలావిగ్రహాన్ని పానగల్ పార్కులో ఒక మూల ఉంచారు.

పానగల్‌పార్క్‌లో ప్రస్తుతం నాగయ్య గారి విగ్రహం ఓ మూల దుమ్ము కొట్టుకుని పోయి దీనంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత శుష్కించినా తల్లి తల్లే అవుతుంది. నాటి ఠీవి, నాటి ఆదరణ, నాటి గౌరవం, నాటి దర్జా దర్పం నేడు పానగల్‌పార్కుకి పూర్తిగా లోపించినా, సుమారు పాతిక సంవత్సరాల అనంతరం చెన్నై నగరాన్ని దర్శించుకున్నవారు ఒకసారి ఆ పార్కులోకి అడుగుపెడితే  గతం తాలూకు మధురస్మృతులు ఎద వీణలను ఒకసారి సుతారంగా మీటుతాయి.
 - ఫోటోలు, కథనం:  డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై
 
తెలుగు వారి కోసం తెలుగు జమీందారు అయిన పానగల్‌రాజు వెంకటరాయనింగారుఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో కట్టించినదే ఈ పార్కు. శ్రీరాజా సర్ పానగంటి రామరాయనింగారు, పానగల్ సంస్థానానికి జమీందారు.  కాళహస్తిలో జన్మించిన ఈయన పేదల వకీలుగా, అణగారిన వర్గాలను ఉద్ధరించే వ్యక్తిగా నిలిచారు. 1921 నుంచి 1926 వరకు ముఖ్యమంత్రిగా మద్రాసు ప్రావిన్సీకి పనిచేసి, ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. వైద్యపరంగా ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ఆయన పేరు మీద ఆయన గౌరవార్థం ఈ పార్కుకి ‘పానగల్ పార్కు’ అని పేరు పెట్టారు. గణేశ్ అయ్యర్ డిజైన్ చేసిన ఈ పార్కు చెన్నై నగరానికే శోభాయమానం.
 
 (ఇన్‌పుట్స్: భువనచంద్ర, సినీ గేయ రచయిత)
 

మరిన్ని వార్తలు