‘మహిళలు ఏం చేసినా జాగ్రత్తగా చేస్తారు..’

6 Mar, 2018 04:57 IST|Sakshi

‘అరణ్య’కు నారీ శక్తి పురస్కారం!

గ్రామీణాభివృద్ధి, సేంద్రియ వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల్లో మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుంటామని ప్రముఖ శాశ్వత వ్యవసాయ(పర్మాకల్చర్‌) నిపుణురాలు, అరణ్య అగ్రికల్చరల్‌ ఆల్టర్నేటివ్స్‌ సంస్థ సీఈవో కొప్పుల పద్మ అన్నారు. మహిళా సాధికారత సాధనకు చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నారీ శక్తి పురస్కారాని(2017)కి అరణ్య అగ్రికల్చరల్‌ ఆల్టర్నేటివ్స్‌ ఎంపికైంది.

ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ ఈ పురస్కారాన్ని(రూ. లక్ష నగదు, ప్రశంసాపత్రం) అందుకోనున్నారు. ఈ సందర్భంగా పద్మను ‘సాగుబడి’ పలుకరించింది. ఎమ్మే పొలిటికల్‌ సైన్స్‌ చదువుకున్న ఆమె 1989 నుంచి పన్నెండేళ్ల పాటు జహీరాబాద్‌లోని డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీలో దళిత మహిళా రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేశారు. తదనంతరం భర్త కొప్పుల నరసన్నతో కలసి అరణ్య అగ్రికల్చరల్‌ ఆల్టర్నేటివ్స్‌ సంస్థను నెలకొల్పారు.

హైదరాబాద్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్మాకల్చర్‌ సమ్మేళనాలను సమర్థవంతంగా నిర్వహించిన ఘనత పద్మకు దక్కుతుంది. ‘ప్రభుత్వ అవార్డు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ప్రయత్నించనూ లేదు. మాకు తెలిసినది, నచ్చినది చేసుకుంటూ వస్తున్నాం. మేం జిల్లాలో పనిచేసినా మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం మా విధానం. మార్పు మహిళల్లో స్పష్టంగా కళ్లకు కనిపిస్తుంది. ఏం చేసినా మహిళలు జాగ్రత్తగా చేస్తారు. వీరిపై ఉండే ప్రభావం చిన్నదైనా అది కుటుంబానికి చేరుతుంది. మహిళలు నిలదొక్కుకోవాలంటే అన్ని స్థాయిల్లోనూ నిర్ణయాలు తీసుకోవడంలో వారికి తగిన ప్రాతినిధ్యం ఉండాలి..’ అన్నారు పద్మ (99490 62295). కంగ్రాట్స్‌ టు ‘అరణ్య’ టీమ్‌!

మరిన్ని వార్తలు