ఒకరికోసం మరొకరు ఆ ఇద్దరి కోసం ఊరు!

27 Sep, 2016 23:27 IST|Sakshi
ఒకరికోసం మరొకరు ఆ ఇద్దరి కోసం ఊరు!

మానవత్వం
కళ్ల ముందే రెండు ప్రాణాలు పోబోతున్నాయని తెలుసు.  ఆ ప్రాంతానికి వె ళ్తే తమ ప్రాణం కూడా పోతుందనీ తెలుసు. చుట్టూ పరవళ్లు తొక్కుతున్న వరద! కళ్ల ముందే జలప్రళయ ఘోష. ఆఖరికి... శిక్షణ పొందిన ఎన్‌ఆర్‌డీఎఫ్ సిబ్బంది సైతం ప్రాణభయంతో ఒక్క అడుగు వెనక్కు వేశారు. వెనుక నుంచే తిరిగి వెళ్లిపోయారు. ఆ తరుణంలో ఎటువంటి శిక్షణ లేకుండా... వరదలో చిక్కుకున్న ఆ ఇద్దరు యువకులను రక్షించాలన్న ఏకైక లక్ష్యంతో గ్రామయువకులు ముందడుగు వేశారు! ఇందుకు ఎంతటి తెగింపు కావాలి! ఎంతటి గుండె ధైర్యం కావాలి!! ఇవేవీ అవసరం లేదు. మానవత్వం ఉంటే చాలు.
 
అసలేం జరిగింది?
ఈ నెల 21 తేదీ అర్ధరాత్రి నుంచి గుంటూరు జిల్లాలో ఎడతెరపిలేకుండా భారీవర్షాలు కురిసాయి. పల్నాడు ప్రాంతాలను అతి భారీవర్షాలు ముంచెత్తాయి. ఆ ప్రభావంతో చిలకలూరిపేట ప్రాంతంలోని వాగులు వంకలు ఉప్పొంగి ఉద్ధృతంగా ప్రవహించాయి.
 
22వ తేదీ.
ఉదయం 8.30 గం.

ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కుప్పగంజి వాగు ఒరవడి పెరిగింది. నిమిషాల వ్యవధిలోనే పంటపొలాలను ముంచేసింది. రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. చిలకలూరిపేట మండలం గంగన్నపాలెంలో కుప్పగంజి వాగు సమీపంలో ఉన్న ఎత్తిపోతల పథకంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న చేవూరి ఏడుకొండలు... భార్య సుబ్బాయమ్మ, కుమారుడు వెంకటేష్ (20), సోదరుడి కుమార్తె అయిన పదేళ్ల వనజతో కలసి అక్కడి నుంచి బయటకు రావటానికి ప్రయత్నించాడు. వాళ్లంతా లిఫ్ట్‌నుంచి బయటకు వచ్చే సమయానికి  క్షణక్షణానికి వరదనీరు పెరిగిపోయింది. చూస్తుండగానే ఆ కుటుంబం వాగులో కొట్టుకుపోయింది. వెంకటేష్ కూడా వాగులో కొట్టుకుపోతూ తాడిచెట్టును అసరాగా పట్టుకోగలిగాడు. ఒడ్డున నిలబడి ఇదంతా గమనిస్తున్న వెంకటేష్ సమీప బంధువు పోలయ్య అత డిని రక్షించటానికి వాగులో దిగాడు.
 
మధ్యాహ్నం 2.30 గంటలు
చెట్టు దగ్గరికి చేరుకొని వెంకటేష్‌ను బయటకు తెచ్చేందుకు పోలయ్య విఫలయత్నం చేశాడు. వరద మరింతగా పెరగటంతో అతను కూడా అక్కడే చిక్కుకుపోయాడు. స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈలోగా మీడియా ద్వారా ఈ వార్త ప్రసారమైంది. అధికారులు స్పందించి ఎన్‌ఆర్‌డీఎఫ్ బలగాలను పంపుతున్నట్లు ప్రకటించారు.
 
సమయం గడుస్తోంది..!
ఎన్‌ఆర్‌డీఎఫ్ ఇంకా అక్కడికి చేరుకోలేదు. వెంకటేష్, పోలయ్య ఆ చెట్టుదగ్గరే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఒకవైపు మబ్బులు కమ్ముకోవటంతో చీకట్లు ముసురుకుంటున్నాయి. హెలీకాప్టర్ వస్తుందని, ఎన్‌ఆర్‌డీఎఫ్ బలగాలు వస్తున్నాయని చూసిన వారికి అసహనం పెరిగిపోతోంది. గంటల సేపు చెట్టును ఆసరా చేసుకొని ఉన్న ఆ ఇద్దరిలోనూ ప్రాణాలపై ఆశ సన్నగిల్లుతోంది. ఇదంతా గమనించిన చిలకలూరిపేట మండలం గోవిందపురానికి చెందిన 30 మంది యువకులు వారిని రక్షించటానికి ముందుకు కదిలారు.
 
సాయంత్రం 3.30 గంటలు
అధికారులు ఎంతగా వారించినా గోవిందపురం యువకులు వినిపించుకోలేదు. వారికి తెలుసు.. మరికొంత సమయం గడిస్తే పరిస్థితి చేజారుతుందని. ఆ ఇద్దరు యువకులను కాపాడే ప్రయత్నంలో చిన్న తేడా వచ్చినా తమ ప్రాణాలూ నీట మునుగుతాయనీ, తమ కుటుంబాలకు విషాదం మిగిలుస్తామని కూడా వారికి తెలుసు. అయితే ఇలాంటి సంశయాలకు వారు లోను కాలేదు. ఆ సమయంలో వారి లక్ష్యం ఒకటే. ఆపదలో ఉన్న ఆ ఇద్దరినీ కాపాడాలి. అంతే. ఒక్కసారిగా సమష్టిగా కదిలారు. సరిగ్గా అదే సమయంలో సుమారు నాలుగు గంటల సయయంలో హెలికాప్టర్ ఆ చెట్టుదగ్గర చిక్కుకున్న వారిద్దరినీ రక్షించటానికి వచ్చింది. కాని రెండు మూడుసార్లు పైపైన చక్కర్లు కొట్టి తమ వల్ల కాదంటూ వెనుదిరిగారు హెలికాప్టర్‌లో ఉన్నవారు.
 
ఇక మిగిలిన ఏకైక అశ వాగులో దిగిన గోవిందపురం యువకులే. ఆ యువకులే ఎట్టకేలకు.. వేలాదిమంది గ్రామస్థులు ఉత్కంతతో ఎదురుచూస్తున్న సమయంలో వెంకటేష్‌ని, పోలయ్యను తాడు సహాయంతో రక్షించి బయటకు తెచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డు పొడవునా నిలబడి ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రజలు ఈ హీరోలకు మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. రెండు ప్రాణాల కోసం వేలాది గుండెలు పరితపించాయి. ఈ సంఘటన మనసున్న ప్రతి ఒక్కరికీ ఒక స్ఫూర్తి. (విషాదం ఏమిటంటే గల్లంతైన సుబ్బాయమ్మ, వనజల మృతదేహాలు దొరికాయి కానీ, వెంకటేష్ తండ్రి ఏడుకొండలు మృతదేహం ఈ స్టోరీ రాసే సమయానికింకా లభ్యం కాలేదు).
- పోతుకూచి లీలానంద్, సాక్షి, చిలకలూరిపేట

>
మరిన్ని వార్తలు