బొమ్మ కొనివ్వు నాన్నా 

2 Aug, 2018 01:10 IST|Sakshi

చెట్టు నీడ

ఒకరోజు ఒక పిల్లాడు తన తండ్రితో కలిసి జాతరకు వెళ్లాడు. కొడుకును జాతరంతా తిప్పి చూపించి సంతోషపరచాలని తండ్రి తపన. జాతరలో బోల్డన్ని బొమ్మలు, వస్తువులు కొనుక్కుని తన స్నేహితులకు చూపించుకుని మురిసిపోవాలని కొడుకు ఆలోచన. పిల్లవాడికి కబుర్లు చెబుతూ మెల్లగా నడుస్తున్నాడు తండ్రి. ఇంకా తనకి బొమ్మలేమీ కొనిపెట్టలేదని ఆందోళన పడుతున్నాడు పిల్లాడు.  ఇంతలో పిల్లాడికి ఒక బొమ్మ నచ్చింది. ఆ బొమ్మ కొనిమ్మన్నాడు.  ఆ బొమ్మవంకా, దాని పైన ఉన్న ధర వంకా చూశాడు తండ్రి. ఆ తర్వాత జేబులో ఉన్న డబ్బును చూసుకున్నాడు.‘‘ఇది వద్దులే’’ అంటూ ముందుకు నడిపించాడు కొడుకుని. డబ్బంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో భార్య తీసుకుని రమ్మని చెప్పిన సరుకుల మాటేమిటి అని ఆలోచిస్తూనే, ఏదైనా బొమ్మ కొని కొడుకును సంతోషపెట్టాలనుకున్నాడు తండ్రి. ఇంతలో ఎవరో తండ్రిని పలకరించారు. కొడుకు చేయి వదిలి వారితో మాట్లాడుతున్నాడు. జాతరలో జనం పెరిగారు. పిల్లాడు తండ్రిని గమనించకుండా ముందుకెళ్లిపోయాడు. కాసేపయ్యాక వెనక్కి తిరిగి చూస్తే తండ్రి కనిపించలేదు. భయమేసింది. దిగులుతో ఏడుపు మొదలైంది. 

ఏడుస్తున్న ఆ పిల్లాణ్ణి చూసి అందరూ పోగయ్యారు. ‘‘నీకు బోలెడన్ని బొమ్మలిస్తాము. ఏడవకు’’ అన్నారెవరో.‘‘నాకు నాన్న కావాలి’’ అన్నాడు పిల్లాడు వెక్కుతూ. ఇంకెవరో రకరకాల తినుబండారాలు తీసుకొచ్చి పిల్లాడి చేతిలో పెట్టారు. ‘‘నాకు నాన్న కావాలి’’ అని వెక్కిళ్లు పెట్టాడు.  ఆశ్చర్యం! ఆ పిల్లాడికిప్పుడు బొమ్మల గురించిన ఆలోచనే లేదు. ‘నాన్న కావాలి’ అంతే! ఇంతలో కొడుకును వెదుక్కుంటూ అక్కడికొచ్చాడు నాన్న. వెలిగిపోతున్న ముఖంతో తండ్రిని అతుక్కుపోయాడు ఆ పిల్లాడు.తెలిసిన వాళ్లెవరో కనిపిస్తే చేబదులు తీసుకొచ్చిన తండ్రి ‘‘బొమ్మలు కొందాం పద’’ అన్నాడు.‘‘నాకు బొమ్మలేమీ వద్దు. ఇంటికెళదాం’’ అన్నాడు కొడుకు! దేవుణ్ణి అవి కావాలి, ఇవి కావాలి అని కోరుకుంటాం. అడిగిందల్లా ఇవ్వలేదని బాధపడతాం. ఇంతలో ఏదో జరుగుతుంది. అప్పుడు మనమే వేడుకుంటాం దేవుణ్ణి.. కనీసం ఇలాగైనా ఉంచు స్వామీ’’ అని.  దేవుడు గీసిన పెద్దగీత ముందు మన కోరికలనే చిన్న గీతలు చిన్నబోతాయన్నమాట.
– డి.వి.ఆర్‌. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా