ఊగిసలాట వద్దు

24 Sep, 2017 00:13 IST|Sakshi

బౌద్ధవాణి

శుభకరుడిది బాల్యం నుంచి ఊగిసలాడే మనస్తత్వం. ఈ రోజు ఆటలకు పోవాలా? వద్దా? వెళ్తే ఏ ఆటను ఎంపిక చేసుకోవాలి? పొలం పనికి పోవాలా? పంతులుగారి దగ్గరకు పోవాలా... ఇలా ప్రతిపనినీ ఎటూ తేల్చుకోకుండా ఆలోచిస్తూ గడిపేస్తూ ఉండేవాడు. పెద్దవాడయ్యాడు. పెళ్లీడుకొచ్చాడు. పెళ్లి చేసుకోవాలా? వద్దా? పెళ్లి జీవితం సుఖాన్నిస్తుందా? దుఃఖాన్ని కలిగిస్తుందా? చేసుకుంటే ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి– ఇలా రకరకాల ఆలోచనలు చేస్తూ కాలం గడిపేవాడు. ‘వివాహం చేసుకోకపోతే... పోయి సన్యసించు. జ్ఞానం, గౌరవం కలుగుతాయి’’ అన్నారు తల్లిదండ్రులు. సరే, సన్యసించాలి అనుకున్నాడు. ఇక సన్యాస జీవితం సుఖదాయకమా ? కాదా– అని ఆలోచించడం మొదలు పెట్టాడు.

ఒకరోజున శుభకరుణ్ణి బుద్ధుని దగ్గరకు తీసుకుపోయారు అతని మిత్రులు. బుద్ధుడు ఆ రోజు శ్రద్ధ గురించి వివరిస్తూ– ‘‘శ్రద్ధ అనేది మూడు ముఖాలున్న విలువైన వజ్రం. అందులో ఒక ముఖం విశ్వాసం. నమ్మకం. మనం ఏ మార్గాన్ని ఎంచుకున్నామో ముందు దానిమీద మనకి విశ్వాసం ఉండాలి. దాన్ని విశ్వసించాలి. అపనమ్మకంతో ఏ పనీ మొదలు పెట్టకూడదు. ఇక రెండో ముఖం ప్రయత్నం. మనం నమ్మిన మార్గంలో మనం శక్తియుక్తులు దాచుకోకుండా ప్రయత్నం సాగించాలి. విఘ్నాలు ఎదురైనా నిరాశపడక ప్రయత్నం కొనసాగించాలి. మూడోముఖం చిత్తశుద్ధి. మన మార్గంలో, మనం చేసే ప్రయత్నంలో చిత్తశుద్ధి ఉండాలి. మనస్పూర్తిగా చేయాలి. దోషభావంతో, కీడు ఆలోచనలతో పగ, ప్రతీకారాలు తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో చేయకూడదు. ఎదుటి వారిని ఓడించాలనీ, పడగొట్టాలనే దురుద్దే్దశ్యాలు లేకుండా మంచి మనస్సుతో చేయాలి. ఇలా... నమ్మకం, ప్రయత్నం, చిత్తశుద్ది– ఈ మూడూ కలసిందే శ్రద్ధ. శ్రద్ధ వల్ల జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధవల్లే సర్వం ఫలిస్తుంది’’అని చెప్పాడు.  ఆ ప్రబోధం శుభకరుని మీద బాగా పని చేసింది. ఊగిసలాట తొలగిపోయింది. అనంతర కాలంలో మంచి  జ్ఞానిగా, గొప్ప భిక్షువుగా పేరు పొందాడు.
– డా. బొర్రా గోవర్ధన్‌

మరిన్ని వార్తలు