బాబుకు ఆటిజమ్‌... తగ్గుతుందా?

10 Oct, 2019 02:07 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

మా బాబుకు నాలుగేళ్లు. వయసుకు తగినట్లుగా ఎదుగుదలగానీ, వికాసం గానీ  కనిపించలేదు. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే ఆటిజమ్‌ అంటున్నారు. హోమియోలో చికిత్స సాధ్యమేనా?  

ఆటిజమ్‌ అనే రుగ్మత ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీని తీవ్రతలో చాలా తేడాలతో పాటు, ఎన్నో లక్షణాలు, వాటిల్లో తేడాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. ఆటిస్టిక్‌ డిజార్డర్‌ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్‌ డిజార్డర్‌ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్‌ డిసింటిగ్రేటెడ్‌ డిజార్డర్‌ అనేది ఆటిజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్‌ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది.

ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడుతుండవచ్చు.  మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్‌ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు...

►అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం
►నలుగురిలో కలవడలేకపోవడం
►ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం
►వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్‌ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది.

మాటలు సరిగా రానివారిని స్పీచ్‌ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్‌ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్‌ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు నార్మల్‌ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

యానల్‌ ఫిషర్‌కు చికిత్స ఉందా?

నా వయసు 65 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్‌  ఫిషర్‌ అని చెప్పి ఆపరేషన్‌ చేయాలన్నారు. నాకు ఆపరేషన్‌ అంటేనే నాకు వణుకు వచేస్తోంది. హోమియోలో ఆపరేషన్‌ లేకుండా చికిత్స ఉందా?

మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్‌ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాలపాళ్లు తగ్గడంవల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్‌ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్‌ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్‌ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది.

కారణాలు
►దీర్ఘకాలిక మలబద్దకం
►ఎక్కువకాలం విరేచనాలు
►వంశపారంపర్యం
►అతిగా మద్యం తీసుకోవడం
►ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం
►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్‌ సమస్య వస్తుంది.

లక్షణాలు
►తీవ్రమైన నొప్పి, మంట
►చురుకుగా ఉండలేరు
►చిరాకు, కోపం
►విరేచనంలో రక్తం పడుతుంటుంది
►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు  నొప్పి, మంట.

చికిత్స
ఫిషర్‌ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్‌ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది.

డాక్టర్‌ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్,
పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

రాత్రంతా గురక... మర్నాడంతా మగత
పల్మునాలజి కౌన్సెలింగ్స్‌

నా వయసు 52 ఏళ్లు. ఒక్కోసారి శ్వాస అందనట్లుగా అనిపించి రాత్రిళ్లు అకస్మాత్తుగా నిద్రలోంచి లేస్తున్నాను,. నోరు ఎండిపోయి ఉంటోంది.  మళ్లీ నిద్రపట్టడం కష్టమవుతోంది. నిద్రలో పెద్ద శబ్దంలో గురక పెడుతున్నట్లు ఇంట్లోవాళ్లు చెబుతున్నారు. ఇక మర్నాడు పగలంతా బాగా అలసటగా ఉంటోంది. నా సమస్య ఏమిటి? ఇదేమైనా ప్రమాదమా? గురక రాకుండా చేయలేమా?

స్లీప్‌ ఆప్నియా అనేది నిద్రకు సంబంధించిన సమస్య. స్లీప్‌ ఆప్నియా సమస్య ఉన్నవారిలో నిద్రలో కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం తాత్కాలికంగా ఆగిపోయి ఒంటికి... అందునా ప్రధానంగా మెదడు, గుండె వంటి కీలక అవయవాలకు అందాల్సిన ఆక్సిజన్‌ అందదు. దాంతో రాత్రంతా సరైన, నాణ్యమైన నిద్రలేక మర్నాడంతా  మగతగా ఉంటుంది. ఇక రాత్రి నిద్రపోతున్న సమయంలో కూడా ఆక్సిజన్‌లేమి కారణంగా శరీరంలో జరగాల్సిన జీవక్రియలు సక్రమంగా జరగకపోవచ్చు. దాంతో  ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే శ్వాస తీసుకోవడం మందగించిపోయి, కొన్ని క్షణాల పాటు ఊపిరి నిలిచిపోవడం ఆప్పియాలో సంభవించే చాలా ప్రమాదకరమైన పరిణామం అన్నమాట.

కారణాలు, పరిణామాలు : టాన్సిల్స్, సైనసైటిస్‌ వంటి సమస్యలు గురకకు ప్రధాన కారణమవుతుంటాయి. ఈ ఆప్నియా కారణంగా కోపం, అసహనం కలుగుతుంటాయి. స్లీప్‌ ఆప్నియాతో బాధపడేవారికి అధిక రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను క్లాసికల్‌ అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా సిండ్రోమ్‌ అని కూడా అంటారు. కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు బలహీనంగా ఉండటం, గండెజబ్బులు ఉన్నవారికి స్లీప్‌ఆప్నియా కూడా ఉంటే అది ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదం ఉంటుంది.

పరిష్కారం / చికిత్స : ఇది పరిష్కారం లేని సమస్యేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, వైద్యనిపుణులను సంప్రదించి వారి సహాయం తీసుకోవడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. స్లీప్‌ ఆప్నియాకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా ఒంటికి తగిన ఆక్సిజన్‌ అందేలా చూసుకోడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మద్యం తీసుకునే అలవాటు ఉంటే పూర్తిగా మానేయాలి. ప్రత్యేకించి రాత్రిపూట భోజనం పరిమితంగానే తీసుకునేలా జాగ్రత్త పడాలి.ఆహారంలో కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. చికిత్స విషయానికి వస్తే స్లీప్‌ ఆప్నియాకు సాధారణంగా రెండు రకాల మార్గాలను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు.

అవి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం. రెండోది వైద్యపరమైన చికిత్సలు తీసుకోవడం. అంటే ఇందులో సమస్య తీవ్రతను బట్టి మందులను సిఫార్సు చేయడం, మరికొంతమందికి ‘సీ–ప్యాప్‌’ (కంటిన్యువస్‌ పాజిటివ్‌ ఎయిర్‌ ప్రెషర్‌) అనే సాధనాన్ని అమర్చడం వంటివి సూచించడం జరుగుతుంటుంది.దీన్ని నిద్రపోయే ముందు ముక్కు మీద లేదా ముఖం మీద అమర్చుకుంటే రాత్రంతా గాలి ఆగిపోకుండా పంప్‌ చేస్తుంటుంది. నాలుక గొంతుకు అడ్డుపడకుండా చూస్తుంది. ఫలితంగా చాలా ఉపశమనం లభిస్తుంది. సమస్య మరీ తీవ్రంగా ఉండి, దశాబ్దాల తరబడి బాధపడుతున్నవాళ్లయితే వారికి శస్త్రచికిత్స చేయాల్సిరావచ్చు. మీరు ఆలస్యం చేయకుండా స్పెషలిస్ట్‌ డాక్టరుకు చూపించుకోండి.

డాక్టర్‌ జి. హరికిషన్,
సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌ అండ్‌ చెస్ట్‌ ఫిజీషియన్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

మరిన్ని వార్తలు