పిల్లలు అదేపనిగా ఏడుస్తుంటే...?

5 Dec, 2013 00:39 IST|Sakshi
పిల్లలు అదేపనిగా ఏడుస్తుంటే...?

మా పాప వయసు మూడు నెలలు. ఈ మధ్య ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటోంది.  డాక్టర్‌గారికి చూపిస్తే ‘ఈ వయసు పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంటుంది,  మరేం భయం లేదు’ అని కొన్ని మందులు రాశారు. మందులు వాడినప్పుడు కొద్దిరోజులు తగ్గినా ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. దయచేసి మా పాప సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి.
 - ఎస్. దిల్‌షాద్ బేగం, కర్నూలు


 పిల్లలు ఇలా అదేపనిగా ఏడవడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా ఎలాంటి ప్రమాదం లేని చిన్న సమస్య మొదలుకొని, చాలా ప్రమాదకరమైన సమస్య వరకూ అన్నింటినీ వారు ఏడుపు ద్వారానే తెలియజేస్తారు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు.
 
 పిల్లలు అదేపనిగా ఏడ్వటానికి కొన్ని కారణాలు:
 ఆకలి వేయడం, భయపడటం, దాహం, మూత్ర విసర్జన తర్వాత డయాపర్ తడి కావడం, బయటి వాతావరణం మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండి వారికి అసౌకర్యంగా ఉండటం, భయపెట్టే పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడం (దీపావళి లేదా ఏదైనా సెలబ్రేషన్ సందర్భంగా బాణాసంచా కాల్చినప్పుడు పిల్లలు ఉలిక్కిపడి ఏడ్వటం సాధారణం), వారున్న గదిలో కాంతి మరీ ఎక్కువగా ఉండటం, పొగ వస్తూ ఊపిరి తీసుకోడానికి ఇబ్బందిగా పరిణమించడం, వారికి ఏవైనా నొప్పులు ఉండటం, దంతాలు వస్తుండటం, ఇన్‌ఫెక్షన్‌లు ఉండటం, కడుపునొప్పి (ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్) రావడం, జ్వరం, జలుబు, చెవినొప్పి, మెదడువాపు జ్వరం, గుండె సమస్యలు, కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలను పిల్లలు ఏడుపు ద్వారానే తెలియచేస్తారు.
 
 ఒకటి నుంచి ఆర్నెల్ల వయసులో ఉన్న పిల్లలు అదేపనిగా ఏడుస్తున్నారంటే దానికి కారణం ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటి సమస్యలు ఉండటం. మీ పాప విషయంలోనూ ఏడుపునకు మీ డాక్టర్‌గారు చెప్పినట్లుగా బహుశా కడుపునొప్పి (ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్) కారణం కావచ్చని అనిపిస్తోంది. ఈ సమస్య సాధారణంగా ఆరువారాల నుంచి మూడు నెలలలోపు పిల్లల్లో వస్తుంటుంది. ఈ వయసు పిల్లలు ఎక్కువగా కడుపునొప్పితో ఏడుస్తుండటం తరచూ చూస్తుంటాం. ఇది ముఖ్యంగా పేగులకు సంబంధించిన నొప్పి. ఇలాంటి పిల్లల్లో ఏడుపు నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేక పోయినప్పటికీ... ఆకలి, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు.

 

ఇటువంటి పిల్లలను సరిగా ఎత్తుకోవడం (అప్ రైట్ పొజిషన్), కొద్దిసేపటి కోసం వాళ్ల పొట్టమీద వాళ్లను పడుకోబెట్టడం (ప్రోన్ పొజిషన్), తేన్పు వచ్చేలా చేయడం (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు. కొందరికి యాంటీస్పాస్మోడిక్‌తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే తప్పకుండా మీ పిల్లల డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం.
 
 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
 స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు