స్వర్గప్రాయం

25 Apr, 2019 05:27 IST|Sakshi

పక్షులు లేని చెట్టుకు నిండా పూలున్నా ఆ పరిమళంలోంచి ప్రాణనాదం ఎలా వీస్తుంది? పిల్లలు నరకం చూపించనిచోట ఈ భువనవనం జీవన రుతువుల్ని ఎలా విరగ కాస్తుంది?

మాధవ్‌ శింగరాజు
పిల్లలు నరకం చూపిస్తారు. పిల్లలు చూపించే నరకం ఎలా ఉంటుందో తల్లులకు బాగా తెలుసు. తల్లులకు పిల్లలు నరకం చూపిస్తున్న సమయంలో.. తండ్రులు అక్కడ ఆఫీసులో పైవారు తమకు చూపించే నరకం చూడ్డానికో, లేక వాళ్లే తమ కిందివారికి నరకం చూపించడానికో వెళ్లి ఉంటారు కనుక.. ఇంట్లో పిల్లలు చూపించే నరకం ఎలా ఉంటుందో తండ్రులకు తెలిసే అవకాశాలు తక్కువ. 
పిల్లలు చూపించే నరకం ఎలా ఉంటుందో స్కూల్‌ టీచర్లకు కూడా బాగా తెలిసే ఉంటుంది. పిల్లల్ని కాసేపలా పార్కులో తిప్పుకొచ్చే ఆయాలను, ఎక్స్‌కర్షన్‌లకు ‘ట్రిప్పు’కొచ్చే టీమ్‌ లీడర్‌లను చెప్పమన్నా చెప్తారు.. పిల్లలు చూపించే నరకం ఏ విధంగా స్వర్గప్రాప్తిని కలిగిస్తుందో! తల ప్రాణాన్ని తోకకి బట్వాడా చెయ్యడంలో నిపుణులు పిల్లలు. 

పిల్లలు నిజానికి ఎవరికీ నరకం చూపించరు. తమ స్వర్గంలో తాము ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. అదే పెద్దలకు నరకం అవుతుంటుంది. అరవడం, గెంతడం, గోడకు గుద్దుకోవడం, సైకిలెక్కి పడడం, తలుపు సందులో వేళ్లు పడేసుకోవడం, పెట్టింది తినకుండా మూతి తిప్పేసుకోవడం, తింటూ బట్టలకు పూసుకోవడం, కుక్కపిల్ల నోట్లో చేతులు పెట్టడం, ఆ చేతుల్తోనే మళ్లీ ఏదో ఒకటి తినడం.. వాళ్లిలా చూపెట్టే నరకాలతో పోలిస్తే, మహాభాగవతంలోని ఇరవై ఎనిమిది నరకాలేం లెక్కలోకి వస్తాయి! క్రైస్తవంలో కూడా గొప్ప నరకాలున్నాయి.  ముస్లింలలో ఏడు రకాల నరకాలు ఉంటాయి. ఈ భాగవత క్రైస్తవ ముస్లిం నరకాలన్నీ కూడా పిల్లలు చూపెట్టే నరకం ముందు పిల్ల రేణువులే.

అయితే నరకం అనేది  పెద్దమాట. పిల్లల విషయంలో వాడకూడదు.  పిల్లల్నేమైనా అంటే ఆరుద్రగారి ఆత్మ అసలే ఒప్పుకోదు. ‘పిల్లలు, దేవుడు చల్లని వారే.. కల్లకపటమెరుగని కరుణామయులే’ అని రాశారు ఆరుద్ర ‘లేత మనసులు’ సినిమా కోసం! కరుణామయుడైన దేవుడే ఒక్కో పాపానికి ఒక్కో నరకం సిద్ధం చేసి ఉంచినప్పుడు.. పాపం, కరుణామయులైన పిల్లలు పెద్దవాళ్లకు నరకం చూపించడాన్ని ఎలా తప్పు పట్టగలం? అదీగాక.. పెద్దలకు విధించాలని వాళ్లేమీ రెడీమేడ్‌ నరకాల పీనల్‌ కోడ్‌ బుక్కేమీ పట్టుకుని కూర్చోరు. వాళ్ల అల్లరిని మనమూ ఎంజాయ్‌ చేస్తే హెవెన్‌. ఎంజాయ్‌ చెయ్యలేకపోతే హెల్‌. అయితే.. యాపిల్టన్‌ సిటీ (యు.ఎస్‌.)లోని ‘టామ్స్‌ డ్రైవ్‌ ఇన్‌’ రెస్టారెంట్‌ అలా అనుకోలేకపోయింది.

రోజూ స్కూల్‌ అయ్యాక, అక్కడికి వస్తుండే మిడిల్‌స్కూల్‌ పిల్లలు (9–14 ఏళ్ల వాళ్లు) ఇటీవల ఆ రెస్టారెంట్‌ ఓనర్‌కు, సిబ్బందికి, కస్టమర్‌లకు నరకం చూపించారు. ఖరీదైన గాజు బల్లలపై గీతలు గీశారు. ఒకరి మీద ఒకరు తినే పదార్థాలను విసురుకున్నారు. అక్కడికి వచ్చిన కొందరు పెద్దవాళ్లకు కూడా అవి తగిలాయి. కనీసం వారికి ‘సారీ’ కూడా చెప్పలేదు. పైపెచ్చు మూతికి చెయ్యి అడ్డుపెట్టుకుని దొంగచాటుగా నవ్వుకున్నారు. వెయిటర్‌లను అవి తెమ్మనీ ఇవి తెమ్మనీ, అవి తెమ్మంటే ఇవి తెచ్చారేమిటనీ వేధించారు. ఈ చేష్టలన్నిటికీ విసిగిపోయిన రెస్టారెంట్‌ యాజమాన్యం... ఇక మీదట బడి పిల్లలకు ‘నో ఎంట్రీ’ అని బోర్డు పెట్టేసింది. పక్కన అమ్మానాన్న ఉంటేనే అనుమతి.

‘మరి బుద్ధిమంతులైన పిల్లలకి కూడా ఈ ఎఫెక్ట్‌ పడుతుంది కదా ఎలా’ అంటే.. ‘పిల్లల్లో బుద్ధిమంతులేమిటండీ..’ అన్నట్లు వింతగా, విస్మయంగా చూసి, అదే బోర్డు కింద.. ‘బుద్ధిమంతులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని కూడా రాయించింది. గతంలో కూడా యు.ఎస్‌., బ్రిటన్‌లలోని కొన్ని రెస్టారెంట్స్‌లు ఇలాగే పిల్లల ఎంట్రీని నిషేధించాయి. మరికొన్ని  రెస్టారెంట్‌లు పిల్లలకు సపరేట్‌ సెక్షన్‌ పెట్టి ఆ సెక్షన్‌లోంచి పిల్లలు కనిపించేలా గాజు గ్లాస్‌ అడ్డుగా పెట్టి పెద్దల సెక్షన్‌ను ఏర్పాటు చేశాయి. పిల్లల డబడబలు కనిపిస్తుంటాయి కానీ వినిపించవు. ఏవైనా పగలగొడితే ఆ బిల్లు ఎలాగూ పెద్దల ప్లేట్ల దగ్గరికి వచ్చేస్తుంది.

 పిల్లలు చూపించే నరకాన్ని ఇలా పెద్దపెద్ద రెస్టారెంట్‌లే భరించలేక వైరాగ్యంతో కైవల్య మార్గాలను వెతుక్కుంటుంటే ఇంట్లో తల్లి ఒక్కరి వల్ల అంత నరకాన్ని పట్టడం సాధ్యమయ్యే పనేనా! అదీ ఒక రోజు నరకం, ఒక గంట నరకం, ఒక నిముషం నరకం కాదు. నిరంతరం.  లక్కీగా (ఈ మాటను తప్పుగా అర్థం చేసుకోకండి) ఉద్యోగాలు చేసే కొందరు తల్లులకు తల్లులుంటారు. ఉద్యోగాలు చేయడం లక్కీ కాదు. పిల్లల్ని చూసుకునే తల్లులుండడం లక్కీ. అన్‌లక్కీగా (ఈ మాటను కూడా) కొందరు తల్లులకు యాభై ఎనిమిదేళ్లు వచ్చాక ‘మీరిక అలసిపోవచ్చు’ అని ఆఫీస్‌లు చివరి శాలరీ స్లిప్పు, కొంచెం డబ్బు  ఇచ్చి వీడ్కోలు పలికాక.. ఫ్రెష్‌గా, ఫస్ట్‌ అపాయింట్‌మెంట్‌గా ఇంట్లో ముద్దు మురిపాలు ఒలికే మనవల కేరెంటింగ్‌ ఉద్యోగం ఉంటుంది.

రోజంతా వాళ్లతో ఐపీఎల్‌ ఆడి, వాళ్లతో పాడుతా తియ్యగా అని పాడి, వద్దంటున్నా తినిపించి, వద్దన్నవి తింటే నోట్లో వేలుపెట్టి తీసి.. సాయంత్రం పేరెంట్స్‌ ఉద్యోగాల నుంచి తిరిగొచ్చి ఆ పిల్లల్ని చేతుల్లోకి తీసుకునే వరకు స్వర్గతుల్యమైన నరకప్రాయమే.అయినా.. పెద్దవాళ్లం అవుతూ, ఒంట్లో ఓపిక నశిస్తూ ఉండడం వల్ల ఇలా పిల్లల అల్లరిని భరించలేకపోతాం కానీ.. ఊరికే కాలింగ్‌ బెల్లు కొడుతూ ఉండే కాళ్లందని వేళ్లు లేకుండా మనింట్లో మనం ఎంతసేపు ఉండగలం? డైనింగ్‌ టేబుల్‌ మీదకు ఎక్కి కూర్చుని, రెండు చేతుల్తో ప్లేటుపై తపతపమని కొడుతూ తినే పిల్లలు కనిపించని రెస్టారెంట్‌కు మళ్లీ మళ్లీ ఎలా వెళ్లగలం?      

మరిన్ని వార్తలు