మోసేదీ కాసేదీ అమ్మే

22 Nov, 2019 02:57 IST|Sakshi

పేగు బంధం

‘అమ్మకి అన్నీ తెలుసు’ అని అమ్మ గురించి ఒక మాట చెప్తారు. నిజమే! పిల్లలకు వాళ్ల గురించి వాళ్లకు తెలియని విషయాలు కూడా అమ్మకు  తెలుస్తాయి. పిల్లల ప్రతి విషయాన్ని అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అయితే ఆ తల్లి మనసుకు కూడా చిన్న ఓదార్పు, చిన్న ఆలంబన కావాలి కదా! అమ్మ పడుతున్న కష్టాన్ని గుర్తించి, ప్రేమగా  ఒక్క మాట మాట్లాడినా చాలు, పడిన కష్టమంతా మరచిపోతుంది అమ్మ. ‘కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు’ అన్న భరోసా తల్లికి కలుగుతుంది. ‘అమ్మా! నీ కోసం ఈ పని నేను చేసి పెడతాను’ అంటే చాలు, బాధ్యత గుర్తెరిగిన పిల్లలు ఉన్నందుకు గర్వపడుతుంది.

‘అమ్మా! నువ్వు విశ్రాంతి తీసుకో’ అని అంటే చాలు, రాత్రిపగలు తేడా లేకుండా తనపిల్లల కోసం నిరంతరం శ్రమించే ఆ తల్లి మనసుకు సాంత్వన కలుగుతుంది. ‘అమ్మా! ఇది నీ కోసం చేశాను, రుచి చూడు’ అని స్వయంగా తయారుచేసి పెడితే, ఆ వంటకాన్ని అమృతంలా భావించి, ‘చాలా బావుంది’ అంటూ సంబరంగా తింటుంది. ‘‘అమ్మా! నేను చేసిన తప్పు పనికి సారీ, ఇంకెప్పుడూ అలా చేయనమ్మా’ అని అమ్మని క్షమాపణ అడిగితే, పిల్లలు తమ తప్పు తాము తెలుసుకునేంతగా ఎదిగినందుకు సంతోషపడుతుంది. ఇక ‘‘అమ్మా! నువ్వు బెస్ట్‌’ అని ఒక్కసారి పిల్లలు అంటే ఆమె సంబరం చూడాలి. అమ్మ ఏకాంతంగా దొరికిన రోజున, ఆవిడ పక్కనే కూర్చుని, చేసిన తప్పును అమ్మకు చెబితే, గుండెకు హత్తుకుని పరిష్కారం చెబుతుంది. అమ్మతో మీరు కూడా ఏమైనా చెప్పదలచుకున్నారా? అయితే వెంటనే వెళ్లి చెప్పేయండి.
– రోహిణి

మరిన్ని వార్తలు