చిల్లరే దేవుడు...

12 Dec, 2016 14:49 IST|Sakshi
ముంబై స్ట్రీట్ ఆర్ట్‌లో తీగపై వేలాడుతున్న నోటు జ్ఞాపకాలు

పెద్దనోట్లు రద్దయ్యాయి. ఐదు వందలు, వెయ్యి నోట్లు తమ అవతారాన్ని చాలించి ఆర్.బి.ఐ అను తమ ధనమాత పొరలను చీల్చుకుని విలీనమయ్యే దృశ్యాలు దేశమంతా కనిపిస్తు న్నాయి. వంద వద్దు, యాభై వద్దు, ఇరవైలా వద్దే వద్దు అని ఐదు వందలు, వెయ్యి మాత్రమే ఇళ్లలో దాచుకునే ప్రజలు ఇప్పుడు ‘చిల్లర నోట్లకు మొక్కుదమయ్యా... దోవ చూపరా గురుడా’ అని పాడుకుంటూ ఆ ఏటిఎం, ఈ ఏటిఎం చుట్టూ తిరుగుతున్నారు. ఏమైనా పాత పద్ధతులే మెరుగైనవని ఆ రోజులు తలుచుకుని బాధ పడుతున్నారు.

పూర్వం పెద్దిళ్లల్లో ఇనప్పెట్టెలు ఉండేవి. చిన్న ఇళ్లలో హుండీలు ఉండేవి. ఇంటి పెద్ద ఇంటి పిల్లలకు అలవాటు చేయడానికి తలా ఒక హుండీ ఇచ్చి, చిల్లర డబ్బులు దాచుకోమని చెప్పేవాడు. పిల్లలు కూడా కొత్త బట్టలకు, పుస్తకాలకు, ఆట వస్తువులకు, బంధువుల ఊళ్లకు వెళ్లడానికి సంవత్సరమంతా నాణేలు సేకరిస్తూ ఉండేవాళ్లు. ఆడవాళ్లు దేవుళ్లకు తీర్థయాత్రలకు ముడుపు కట్టి, ఇత్తడి చెంబులకు వాసం కట్టి తోచిన చిల్లరంతా దానిలో వేస్తూ ఆ సమయానికి తీసి ఉపయోగించేవారు. బంధువులు ఇళ్లకొస్తే ఇప్పటిలా బర్గర్‌లు తెచ్చిపెట్టకుండా, పిల్లలకు చిల్లర కానుకగా ఇచ్చేవారు. ముఖ్యంగా రోజువారీ లావాదేవీల్లో కొత్త నాణేలు, కొత్త నోట్లు కనిపిస్తే పొరపాటున కూడా ఖర్చు పెట్టకుండా వాటిని అపురూపంగా దాచుకునే అలవాటు మధ్యతరగతి ఇళ్లల్లో ఉండేది. ముసలాళ్ల కొంగులో ఏ క్షణాన్నయినా ఒకటి రెండు కాసులు మూట గట్టి ఉండేవి. ఇప్పుడు అవన్నీ బాగా తగ్గాయి. అందువల్ల పెద్ద నోట్లు రద్దు కాగానే అందరూ తెల్లముఖాలు వేయాల్సి వచ్చింది. ఇంట్లో చిల్లర ఉండే సంస్కృతి ఉండి ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా అని కుయ్యోమంటున్నవాళ్లు ఉన్నారు. బ్యాంకులో విత్‌డ్రాయల్‌కు వెళ్లినప్పుడు, వేలు అడిగి తెచ్చుకున్నవాళ్లు బాధ పడుతున్నారు.

>
మరిన్ని వార్తలు