ఒక్క కన్నీటి బొట్టు

21 May, 2020 04:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరూ ప్రేమించుకున్నారు. బ్రేకప్‌ అయి ‘ఇద్దరు’గా మిగిలారు. అమ్మాయి ఏడ్చింది. అబ్బాయి ఏడ్వలేదనుకుంది. ‘నా కోసం ఒక్క కన్నీటి బొట్టు.. నీ దగ్గర లేదా’ అని అడిగింది. అతడి చేత కన్నీళ్లు పెట్టించడానికి.. ట్రక్కునిండా ప్రేమను పంపింది.

‘‘రెండు కళ్ల నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి’’ అంటాడు క్రిష్‌. (డైరెక్టర్‌ కెవీ రెడ్డి ఆయన).
‘‘ఊ’’ అంటుంది కీర్తి సురేశ్‌. (నటి సావిత్రి ఆమె).
మళ్లీ చెప్తాడు క్రిష్‌.
‘‘రెండు కళ్ల నుంచి కాదమ్మాయ్‌. ఒక కంటి నుంచి మాత్రమే కొన్ని కన్నీటి బొట్లు రావాలి’’
‘‘ఊ’’ అని తల ఊపుతుంది.
పాట మొదలౌతుంది.
‘నీ కోసమే నే జీవించునది, ఈ విరహములో, ఈ నిరాశలో నీ కోసమే నే జీవించునది’.
కీర్తి సురేశ్‌కి ఒక కంటి నుంచి మాత్రమే కన్నీటి బొట్లు వచ్చేస్తాయి! రెండంటే రెండు బొట్లే అడిగి ఉంటాడు క్రిష్‌. రెండంటే రెండు బొట్లే రాలుస్తుంది కీర్తి సురేశ్‌.
‘మహానటి’లోని సన్నివేశం ఇది. (తెలంగాణలో కొత్తగా 27 కేసులు )
∙∙
మిస్‌ ఝావో ఓ కుర్రాడిని ప్రేమించింది. అతడూ ఆమెను ప్రేమించాడు. ఇద్దరిదీ చైనా. జీబో అనే ప్రాంతంలో ఉంటారు. ఉండేది జీబోలోనే అయినా, ప్రేమ మొదలైనప్పట్నుంచీ ఒకరి మనసుల్లో ఒకరు ఉంటున్నారు. ఏడాది క్రితం ప్రేమలో పడ్డారు. ఈమధ్యే విడిపోయారు. బ్రేకప్‌ చెప్పేశాడు ఆ కుర్రాడు. ఝావో తట్టుకోలేకపోయింది. తల్లడిల్లిపోయింది. ‘నీకోసమే నే జీవించునది, ఈ విరహములో, ఈ నిరాశలో నీ కోసమే నే జీవించునది’ అని పాడుకుంది. అతడు పట్టించుకోలేదు. కాల్‌ చేయలేదు. కాల్‌ చేస్తే తియ్యలేదు. ఏడ్చింది. తన లెక్క ప్రకారం అతడూ ఏడుస్తూ ఉండాలి. కానీ అతడు ఏడ్వడం లేదని, హాయిగా ఉన్నాడని ఆమెకు తెలిసింది! అతడు ఏడుస్తూ లేకపోవడం చూసిన వారెవరో వచ్చి ఆమెకు చెప్తే తెలిసింది.
∙∙
ఝావో బాయ్‌ఫ్రెండ్‌ అప్పుడే నిద్ర లేచాడు. కళ్లు నలుముకుంటూ ముందు గదిలోకి వచ్చాడు. గది నిండా ఉల్లి సంచులు! వెయ్యి కిలోల ఉల్లిపాయలు. డెలివరీ బాయ్‌ ట్రక్కులో తీసుకొచ్చి అక్కడి దింపేసి వెళ్లిపోయాడు. సంచుల్లో చిన్న స్లిప్‌ ఉంది. ఆ స్లిప్‌లో ఎవరిదో చేతి రాత! ఎవరిదో ఏంటి.. తన గర్ల్‌ ఫ్రెండ్‌ ఝావోదే! అక్షరాలు పైకే కనిపిస్తున్నాయి. ‘‘నేను మూడు రోజులు ఏడ్చాను. ఇప్పుడు నీ వంతు’’ అని రాసి ఉంది! ‘తిక్క పిల్ల’ అనుకున్నాడు. ఈలోగా, ‘‘ఏంటి  బాబూ, ఇన్ని ఎర్ర ఉల్లిపాయల సంచులూ’’ అని పక్కింటి వాళ్లొచ్చి అడిగారు. అప్పుడు ఏడ్చాడు ఆ కుర్రాడు.
‘‘నా ఫ్రెండే. ప్రతి దానికీ అతి చేస్తుంటుంది. అందుకే విడిపోయాం. విడిపోయినందుకు తను ఏడుస్తోందట. నన్నూ ఏడవమని ఈ ఉల్లిపాయల్ని పంపింది. బ్రేకప్‌ అయినప్పట్నుంచీ నేను ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదని నా ఫ్రెండ్స్‌ అందరితో చెబుతోందట! ఏడ్వనందుకు చెడ్డవాణ్ణి అయ్యాను’’ అని ఫీల్‌ అయ్యాడు. ఈ ఫీలింగేదో ఫోన్‌ చేసి ఆ పిల్ల దగ్గరే ఏడిస్తే హ్యాపీగా ఫీల్‌ అయి ఉండేది కదా పాపం.
బ్రేకప్‌ అవడం అంటే మరింత దగ్గరవడం.

 ఉల్లి సంచుల్ని చూస్తూ తల పట్టుకున్న మిస్‌ ఝావో బాయ్‌ఫ్రెండ్‌


బాయ్‌ఫ్రెండ్‌ ఇంటికి  మిస్‌ ఝావో డెలివరీ చేసిన ఉల్లిపాయలు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు