గేట్‌మ్యాన్‌ కొడుకు సినిమా చూపిస్తున్నాడు

22 Sep, 2019 01:37 IST|Sakshi

టిక్‌టాక్‌... ఇటీవల వచ్చిన ఒక పెద్ద ప్రభంజనం. చాలామంది వారి వారి ప్రతిభను ఇందులో పొందుపరుస్తు్తన్నారు. ఐదు నెలల క్రితం టిక్‌టాక్‌లో జోకులు పెట్టడం ప్రారంభించిన భార్గవ్‌ చిప్పాడ ఇప్పుడు ‘సౌత్‌ ఇండియా టిక్‌ టాక్‌’ గా టాప్‌ ర్యాంకులో ఉన్నాడు. 43 లక్షల వ్యూయర్స్‌తో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ర్యాంకులో నిలిచాడు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన భార్గవ్‌ చిప్పాడ సాధించిన ఈ విజయాల గురించి అతడి మాటల్లోనే...

‘‘మా నాన్న (ఆదినారాయణరావు) కొత్తవలస శ్రీలక్ష్మీనరసింహ థియేటర్‌లో గేట్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. మా అమ్మ (లక్ష్మి) ‘జామీ హైస్కూల్‌’లో అటెండర్‌గా పనిచేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఏదో ఒకటి సాధించాలనే కోరిక. అప్పటికప్పుడు జోకులు వేయడం నాకు వచ్చిన విద్య. దీన్నే  ఉపయోగించాలనుకున్నాను. చాన్స్‌ కోసం చూస్తుండగా వైజాగ్‌లో జూనియర్‌ ఆర్టిస్టుగా పని దొరికింది. లెజెండ్, మళ్లీమళ్లీ ఇది రాని రోజు, తమిళంలో ఒక సినిమాలో నటించా. ఆ తరవాత జూనియర్‌ ఆర్టిస్టుల సప్లయర్‌గా పనిచేశాను. అదంతగా నచ్చలేదు. సొంతంగా ఏదో చేయాలనే తపన బలపడింది.

‘మోడీ ఈజ్‌ మై డాడీ’
 2014లో హైదరాబాద్‌ చేరుకున్నాను. అదే సంవత్సరం ‘మోడీ ఈజ్‌ మై డాడీ’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో నటించాను. ఆ చిత్ర నిర్మాత దగ్గరే ఒక  యేడాది ఆఫీసు బాయ్‌గా పనిచేశాను. కాని నా గోల్‌  వేరు కదా. ఒక్క  చాన్స్‌ ఇవ్వమని ఎవరి దగ్గరకు  వెళ్లినా ‘ఇంతకుముందు చేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయా’ అని అడగటం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే ‘సినిమాలోకి దారేది’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చింది. అందులో అన్నిరకాల ఎక్స్‌ప్రెషన్స్‌ ఉంటాయి. ఆ సినిమా తీసుకుని అందరినీ కలిశాను. హర్ష అన్నవరపు అనే అతను నన్ను గుర్తించారు. 2016లో ‘ఫన్‌ బకెట్‌’ పేరుతో మొత్తం 180 ఎపిసోడ్స్‌ చేశాను. ‘దేశముదురు’ ప్రోగ్రామ్‌లో ధనరాజ్‌తో చేశాను. నాకు పేరు వచ్చింది. అక్కడ నుంచి జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది.

అప్పుడు మొదలైంది..
అప్పుడే టిక్‌టాక్‌ ఒక ప్రభంజనంలా వచ్చింది. అందరూ ఆ యాప్‌ను వాడుకుంటూ, వారి వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. నా సొంత జోకులతో నేనూ ఇందులో అప్‌లోడ్‌ చేయొచ్చుగా అనుకున్నాను. స్టార్ట్‌ చేశాను కూడా. 2019, ఏప్రిల్‌ ఒకటో తేదీన ఒక ఏప్రిల్‌ ఫూల్‌ జోకు చేశాను. అది అంతర్జాతీయంగా బాగా వైరల్‌ అయ్యింది.49 లక్షల వ్యూస్‌ వచ్చాయి. దాంతో  నాకు వచ్చిన పేరును  నిలబెట్టుకోవాలనుకున్నాను.  ‘అమ్మాయి – అబ్బాయి’ పేరుతో ఒక సిరీస్‌గా స్టార్ట్‌ చేశాను. ఇది తెలుగులో బాగా వైరల్‌ అయ్యింది.  అందరికీ తెలిసిన పదాలతోనే పంచెస్‌ వేయడం వల్ల నా వీడియోలు బాగా పాపులర్‌ అయ్యాయి.

‘విగో యాప్‌ వాళ్లు పిలిచారు
‘విగో’ ఆప్‌ వాళ్లు పిలిచారు. నెల జీతం ఇవ్వడం ప్రారంభించారు. ‘రేస్‌ గేమ్‌’ వాళ్లకి ప్రకటన చేశాను. కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్‌ నిత్యశ్రీతో   కలిసి ఇంగ్లీషులో చేసిన  టిక్‌టాక్‌ కూడా బాగా  వైరల్‌ అయ్యింది. ఆస్ట్రేలియా, అమెరికాల నుంచి కూడా మెసేజెస్‌ రావడం మొదలైంది.  నన్నిప్పుడు ‘సౌతిండియా టిక్‌టాక్‌ స్టార్‌’ అంటున్నారు.
– వైజయంతి పురాణపండ

నా సినిమాకు నాన్న టికెట్‌ చింపారు
‘నాయుడుతోట’లో ఆఫీస్‌ ఓపెన్‌ చేశాను. రేస్‌ గేమ్, స్విగ్గీ, మిస్టర్‌ రమ్మీలకి ప్రమోషన్‌ యాడ్‌ చేశాను. వీటి వల్ల డౌన్‌లోడ్స్‌ పెరిగి, సర్వర్‌ డౌన్‌ అయిపోవడంతో, సర్వర్‌ నుంచి వాళ్లు ఫోన్‌ చేసి, ‘రెక్టిఫై చేస్తున్నాం, కంగారు పడకండి’ అన్నారు. అంత బాగా చూశారు ఈ ప్రకటనలను. ఒంటరిగా బయలుదేరిన నేను టీమ్‌ భార్గవ్‌గా అయ్యాను.  ‘కిర్రాక్‌ పార్టీ’ సినిమా నాన్నగారు పనిచేస్తున్న థియేటర్‌లో రిలీజ్‌ అయ్యింది. నా సినిమాకు నాన్న టికెట్‌ చింపారు. అదొక అనుభూతి. అలాగే సుబ్రహ్మణ్యపురం, మిస్టర్‌ మజ్ను, హిప్పి సినిమాలు కూడా నాన్న పనిచేస్తున్న థియేటర్‌లోనే విడుదలయ్యాయి.

‘ఫన్‌ బకెట్‌’ భార్గవ్‌ చిప్పాడ టిక్‌టాక్‌ స్టార్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు