చూపులు కలవని శుభవేళ

16 Feb, 2020 03:02 IST|Sakshi

అమ్మాయి కాఫీ ఇచ్చింది. అబ్బాయి కాఫీ తాగాడు. కాఫీ ఇస్తున్నప్పుడు.. అమ్మాయి అబ్బాయిని చూళ్లేదు!
కాఫీ తాగుతున్నప్పుడైనా.. అబ్బాయి అమ్మాయిని చూళ్లేదు! ఇంకేం కలుస్తాయి చూపులు!
చూపులు కలవలేదు కానీ... కాఫీ కలుపుతున్నప్పుడు అమృత ఘడియలేవో ఉన్నట్లున్నాయి. నలభై ఏళ్లయింది చిరంజీవి, సురేఖల పెళ్లయి. కలవని ఆ కాఫీ చూపులే.. వీళ్ల పెళ్లికి శుభలేఖలు.

  
► మీ ‘శుభలేఖ రాసుకున్న ఎదలో..’ పాట సూపర్‌ హిట్‌. మరి.. రియల్‌ లైఫ్‌లో శుభలేఖ రాసుకున్న విశేషాల గురించి?
చిరంజీవి: నాకు నేనుగా బలి పశువును అయిన రోజు గురించేగా (నవ్వుతూ). ఓ సాయంత్రం నేను చైౖన్నై కోడంబాకం బ్రిడ్జ్‌ మీద నా కారులో వెళుతుంటే, నా బి.కామ్‌ క్లాస్‌మేట్‌ సత్యనారాయణ కనిపించాడు. ఇక్కడ ఉన్నావేంటి? అని అడిగితే, మా పెదనాన్నగారింటికి వచ్చాను అన్నాడు. నా కారులో దింపేస్తాను రమ్మన్నాను. వాళ్ల పెదనాన్న ఎవరో కాదు... అల్లు రామలింగయ్యగారు. అప్పటికే నేను నటించిన ఓ మూడు సినిమాలు విడుదలయ్యాయి. ‘రామలింగయ్యగారు నీతో పాటు ‘మనవూరి పాండవులు’లో యాక్ట్‌ చేశారుగా.. ఇంట్లోకి రా’ అన్నాడు. అయితే రామలింగయ్యగారు లేరు. కాఫీ తాగి వెళుదువు గాని అన్నాడు. అదే నేను లాక్‌ అయిన మొదటి స్టెప్‌.

► ఎలా లాక్‌ అయ్యారు?
చిరంజీవి: ఆ కాఫీ పెట్టింది సురేఖ. తను నన్ను చూళ్లేదు, నేను తనని చూళ్లేదు (భార్యని చూస్తూ.. ‘ఆ కాఫీలో ఏం వశీకరణ మంత్రం కలిపావు’). ఆ తర్వాత ఆ అబ్బాయి ఎవరు? అని తను అతన్ని అడిగితే ‘మా క్లాస్‌మేట్‌. ‘మనవూరి పాండవులు’ లో నటించాడు’ అని చెప్పాడు. ‘వాళ్లు ఏమిట్లట. మనిట్లేనట’ (ఇద్దరూ పెద్దగా నవ్వుతూ) అంది. తర్వాత అల్లు అరవింద్‌ గారు, ఇతర కుటుంబ సభ్యులు నా గురించి డిస్కషన్‌ మొదలుపెట్టారు. అల్లు రామలింగయ్యగారికేమో వాళ్లమ్మాయిని ఓ ఐ.ఏ.ఎస్‌ ఆఫీసర్‌కిచ్చి చెయ్యాలనుండేది. కానీ, ఎందుకు ప్రయత్నం చేయకూడదని అరవింద్‌గారు నా గురించి ఎంక్వయిరీ ప్రారంభించారు. ‘తను ఆంజనేయస్వామి భక్తుడు, బ్యాడ్‌ హ్యాబిట్స్‌ లేవు, బాగా చదువుకున్నాడు, చాలా కష్టపడతాడు.

అతని చేతిలో మంచి సినిమాలు కూడా ఉన్నాయి’ అని నా గురించి గుడ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చాడు నా ఫ్రెండ్‌. నాకు ఇప్పుడు పెళ్లేంటి? అన్నాను నేను. మేకప్‌మేన్‌ జయకృష్ణ ‘మన వూరి పాండవులు’ నిర్మాత. రామలింగయ్యగారి ఫ్యామిలీకి చాలా దగ్గరివారు. ఆయన రామలింగయ్యగారిని కన్విన్స్‌ చేశారు. ఓకే అనడానికి ముందు ఓ పదిమంది నిర్మాతలను నా గురించి అడిగి సలహా తీసుకున్నారట రామలింగయ్యగారు. అందరూ నా గురించి మంచి ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారు. దాంతో నన్ను లాగి బుట్టలో పడేశారు. నాది పెళ్లి వయసు కాదని కరాఖండీగా చెప్పాను. కానీ, జయకృష్ణగారు మా నాన్నగారితో ‘అబ్బాయి వేరే ఆకర్షణలకి లోనవుతాడేమో’ అని చెప్పారేమో నాన్న భయపడిపోయి ‘నేను అబ్బాయిని ఒప్పిస్తా’ అన్నారు. పెళ్లి చూపులకు రానన్నాను. బలవంతంగా తీసుకెళ్లారు.

► సురేఖగారూ.. మీ నాన్న చెప్పారని మీరు చిరంజీవిగారిని పెళ్లి చేసుకున్నారా?
సురేఖ: ‘మన వూరి పాండవులు’ చూసి ‘ఈ కళ్లబ్బాయి ఎవరో బావున్నాడు’ అనుకున్నాను. కళ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి కదా. మా అమ్మ యాక్టర్‌ను చేసుకుంది. నేనూ యాక్టర్‌ను చేసుకుం టే బాగుంటుందనుకున్నా. అందుకే సరే అన్నాను.

► మీ ‘అందరివాడు’ సినిమాలో పెళ్లిచూపుల సీన్‌ చాలా బావుంటుంది. మీ పెళ్లి చూపుల సీన్‌?
చిరంజీవి: మమ్మల్ని మాట్లాడుకోమని పెద్దవాళ్లందరూ బయటకు వెళ్లారు. తను బీఏ చదువుకుందని తెలిసినా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని ఏం చదువుకున్నారు? అని అడిగాను. ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. అంతకుముందు నాకు అమ్మాయిలతో పెద్దగా పరిచయాలు కూడా లేవు. సురేఖ పొందిక చూసి ‘ఈ అమ్మాయినే చేసుకోవాలి’ అనుకున్నాను. మా అమ్మకి కూడా తను నచ్చింది. నాన్నగారైతే ‘ఏం కళరా ఆ అమ్మాయిది. పెళ్లి చేసుకో’ అన్నారు.
 

సురేఖ: మామయ్యగారు చనిపోయేంతవరకు నన్నెప్పుడూ పేరు పెట్టి పిలవలేదు. ‘అమ్మా’ అనేవారు. నన్ను ఒక్క మాట కూడా పడనిచ్చేవారు కాదు. అంత బాగా చూసేవారు.

► అవునూ... మీ పెళ్లి చూపులకు, పెళ్లికి ఎంత గ్యాప్‌ వచ్చింది?
సురేఖ: మూడు నెలలు.

► ఆ మూడు నెలల్లో కలుసుకున్నారా? ఫోన్లు మాట్లాడుకోవడం?
చిరంజీవి: పెళ్లి కాకముందు మాట్లాడటం, తిరగటం తప్పని మనసులో పడిపోయింది. తనదీ అలాంటి ఫీలింగే. అయితే ఒకసారి మాట్లాడాలనిపించింది. అప్పుడు ల్యాండ్‌ ఫోన్లే కదా. ఫోన్‌ చేస్తే తనే తీసింది. ‘హలో.. నేను చిరంజీవి’ అన్నాను. ‘నేను సురేఖనండీ. ఫోన్‌ ఎవరికివ్వమంటారు’ అంది. అంతే... నాతో కనీసం రెండు మాటలు కూడా మాట్లాడకుండా ఎవరికివ్వమంటారు అందని నా అహం దెబ్బతింది. ‘మీ అన్నయ్య ఉన్నాడా’ అన్నాను. ‘లేరండీ’ అంది. ‘వచ్చాక నేను ఫోన్‌ చేశానని చెప్పు’ అని పెట్టేశాను.

సురేఖ: అప్పుడప్పుడూ అన్నయ్యతో పెళ్లి తేదీ గురించి మాట్లాడేవాళ్లు. అందుకని అన్నయ్యతో మాట్లాడటం కోసమే ఫోన్‌ చేశారనుకున్నాను. నా గురించి చేశారనుకోలేదు (నవ్వుతూ).

► సరే.. హనీమూన్‌ విశేషాలు?
చిరంజీవి: హనీమూన్‌ పక్కన పెట్టండి. పెళ్లికే టైమ్‌ దొరకలేదు. పెళ్లికి ఫిబ్రవరిలో మంచి ముహూర్తాలున్నాయంటే సరే అనుకున్నాం. అప్పుడు ‘తాతయ్య ప్రేమ లీలలు’ అనే సినిమా చేస్తున్నాను. ఆ చిత్రానికి యం.ఎస్‌ రెడ్డిగారు నిర్మాత. అందులో నూతన్‌ప్రసాద్‌ కాంబినేషన్‌లో నా సీన్లు ఉన్నాయి. ‘ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్, డేట్స్‌ దొరకవు.. మీరు మే నెలలో పెళ్లి చేసుకోండి’ అని రెడ్డిగారు అన్నారు. ‘మీరు ఓకే అంటే ఫిబ్రవరిలో, లేదంటే తర్వాత చేసుకుంటాను’ అన్నాను. అరవింద్‌ ఏమో ‘ఓ మూడు రోజులు ఇవ్వండి’ అని పట్టుబట్టాడు. నా సినిమా టైమ్‌లో మా హీరో పెళ్లి చేసుకున్నాడులే అనుకొని ఏ నిర్మాత అయినా ఆనందంగా ఒప్పుకుంటారు. కానీ, రెడ్డిగారు ఒప్పుకోలేదు. అప్పుడు అల్లు అరవింద్‌ ‘మీ డేట్లు మళ్లీ మీకు ఇప్పిస్తాను. కాంబినేషన్‌ గురించి మీకేం భయం లేదు. నేనూ ఇండస్ట్రీలోనే ఉన్నాను కదా. మేం చిరంజీవిని తీసుకెళ్లిపోతున్నాం’ అన్నారు. అలా అనుకున్న ముహూర్తానికే పెళ్లయింది.

► మరి పెళ్లి బట్టల షాపింగ్‌కి టైమ్‌ దొరికిందా?
చిరంజీవి: పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు చొక్కా చిరిగిపోయింది. సురేఖ మార్చుకోమంటే ‘ఏం.. బట్టలు చిరిగితే తాళి కట్టలేనా’ అని, అలాగే కట్టేశాను. అయితే అప్పటికే నాకు ఏడెనిమిది పెళ్లిళ్లు చేసుకున్న అనుభవం ఉంది (ఇద్దరూ పెద్దగా నవ్వుతూ). అంటే సినిమాల్లో..

► పెళ్లయ్యే నాటికే మీకు వంట వచ్చా?
సురేఖ: రాదండీ. ఒకరోజు ఉప్మా చేస్తే ఉండలు, ఉండలుగా వచ్చింది. అప్పుడు ఆయనే ఉప్మా చేయడం నేర్పించారు. ఆయన మేనత్త, అమ్మమ్మ మాతోనే ఉండేవారు. వాళ్లు వండేవారు.

► భర్త మేనత్త, అమ్మమ్మ, అమ్మానాన్న, తమ్ముళ్లు (నాగబాబు, పవన్‌ కల్యాణ్‌) ఇంతమందితో ఉండాలంటే ప్రైవసీ ఉండదేమో అనిపించిందా?
సురేఖ: మా ఇంట్లో ఎప్పుడూ చుట్టాలుండేవారు. అదే సందడి ఈ ఇంట్లోనూ ఉండేది. లేకపోతే ఒంటరితనం అనిపించేది. ఈయన ఉండేవారు కాదు. అందరూ కలిసి ఉండటంతో నాకు సెక్యూరిటీ ఉండేది. వాళ్లే వంటలు చేసి, నాకు, ఆయనకి, అందరికీ పెట్టేవారు. పిల్లలందరూ ఉండటంతో బావుండేది.
 

చిరంజీవి: సురేఖ తమ్ముడు ఉండేవారు. అతను చనిపోయారు. నా తమ్ముళ్లిద్దరిదీ వాళ్ల తమ్ముడి వయసు. వీళ్ల మీద సురేఖకు ఆ ఎఫెక్షన్‌ ఉండటానికి కారణం అదే. మనం ఎలా ఉంటే అవతలివాళ్లు మనతో అలా ఉంటారు. సురేఖ అందరితో బాగుంటుంది.

సురేఖ: వాళ్లు కూడా చాలా బాగుంటారు. ఏ రిలేషనయినా రెండువైపులా ఉండాలి. ఈయన లేకపోయినా కల్యాణ్‌ (పవన్‌ కల్యాణ్‌) ఎప్పుడూ పిల్లలతో ఉండేవాడు. బాగా సరదాగా ఉండేవాడు. అందుకే కల్యాణ్‌ పిల్లలతోపాటు పెరిగాడు, పిల్లలు కల్యాణ్‌తో పాటు పెరిగారు అంటాం. కల్యాణ్‌తో పాటు, వీళ్ల చెల్లెలు మాతోపాటు ఉండి చదువుకుంది.  

► త్రీ షిఫ్ట్స్‌ చేస్తూ షూటింగ్స్‌తో చిరంజీవిగారు బిజీగా ఉండేవారట. పెళ్లయిన కొత్తలో ఆ బిజీని ఎలా తీసుకున్నారు?
సురేఖ: నాన్నగారిని చూస్తూ పెరిగాను కదా. నైట్‌ షూటింగ్‌లని ఆయన లేటుగా రావటం అన్నీ తెలుసు. మా పెళ్లయిన కొత్తల్లో ఈయన పొద్దున్నే షూటింగ్‌కి వెళ్లి సాయంత్రం 6 గంటలకు వచ్చేవారు. మళ్లీ ఫ్రెష్‌ అయి నైట్‌ షూటింగ్‌కి వెళ్లేవారు. ‘పున్నమినాగు’ షూటింగ్‌ జరుగుతోంది అప్పుడు. నా లైఫ్‌ అంతా ఇలానే ఉంటుందని ప్రిపేర్‌ అయిపోయాను కాబట్టి ఏమీ అనిపించలేదు.  

► ప్యారిస్‌లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు మీ పేరు బదులు ‘జయ’ అని జయప్రదగారి పేరుతో మిమ్మల్ని పిలిచారట?
సురేఖ: ఓ రోజు కాదు, రోజూ జరిగేది. నెల రోజులు జయప్రదతో షూటింగ్‌ చేస్తే ఆ నెల రోజులూ జయ, జయ అని పిలిచేవారు. మా పెళ్లయిన కొత్తల్లో అప్పటికి నన్ను సురేఖా అని పిలవడానికి అలవాటుపడలేదు. అందుకని ఒక్కోసారి జయ అని పిలిచేవారు. ‘ఏమండీ.. నేను రేఖ’ అనేదాన్ని. ‘ఓ.. సారీ, సారీ రేఖ’ అనేవారు.

చిరంజీవి: సురేఖలో ఉండే ఆ స్పోర్టివ్‌నెస్‌ పరాకాష్ట అని చెప్పాలి. మరో గమ్మల్తైన విషయం చెబుతా. మా పెళ్లైన రెండు నెలలకి ప్యారిస్‌ వెళ్లాం. హోటల్‌లో రూమ్‌ తీసుకున్నాం. దానికోసం రిసెప్షన్‌లో ఫామ్స్‌ అన్నీ కంప్లీట్‌ చేసి ఇవ్వాలి కదా. అక్కడ అన్నీ ఫిల్‌ చేస్తూ భార్య అనే చోట ఆగిపోయాను. వెంటనే పేరు గుర్తు రాలేదు (నవ్వులు). ‘సురేఖ’ అని చెప్పి.. ‘అల్లు అని రాసేరు, కొణిదెల అని రాయండి’ అంది.

► మీరు ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. వాళ్లతో సురేఖగారు ఎలా ఉంటారు?
చిరంజీవి: సురేఖ వెరీ ఫ్రెండ్లీ. సుహాసిని, సుమలత, విజయశాంతి, రాధ, రాధిక.. అందరితో ఓ ఫ్యామిలీలా ఉంటుంది. మొన్న నవంబర్‌లో మా 80స్‌ క్లబ్‌ (1980లకు చెందిన నటీనటులు) రీయూనియన్‌ పార్టీ మా ఇంట్లోనే జరిగింది. అన్నీ తనే ఎరేంజ్‌ చేసింది. వాళ్లందరూ ‘ఇంత ఎరేంజ్‌ చేశారు, మీరూ పార్టీలో ఉండండి’ అంటే ‘మీరంతా ఫ్రెండ్స్‌. ఎంజాయ్‌ చేయండి’ అంది.

సురేఖ: ఎరేంజ్‌ చేశాం కదా అని ఫ్రెండ్స్‌ మధ్యలో దూరిపోకూడదు (నవ్వుతూ).

► జనరల్‌గా చిరంజీవిగారి బర్త్‌డే అంటే ఫ్యాన్స్‌ మరచిపోనివ్వరు. మరి.. మ్యారేజ్‌ డే, మీ బర్త్‌డేని ఆయన గుర్తుపెట్టుకుంటారా?
చిరంజీవి: గుర్తుండేది కాదు, గుర్తు లేకనే ఈ సంవత్సరం ఫైట్‌ సీక్వెన్స్‌ కోసం పోలవరం వెళ్లడానికి రెడీ అయ్యాను. ఈ 18న సురేఖ పుట్టినరోజు. 20న మా పెళ్లిరోజు. అది గుర్తు లేక 16 నుండి పోలవరంలో షూటింగ్‌ ప్లాన్‌ చేసుకున్నాం. మా అబ్బాయికి (రామ్‌చరణ్‌) గుర్తుకొచ్చింది. వాళ్లమ్మ దగ్గరికెళ్లి ‘18 నీ పుట్టినరోజు, 20 మీ పెళ్లిరోజు, డాడీ షూటింగ్‌కి ఎలా ఒప్పుకున్నారు?’ అంటే, ‘పోనీలే డాడీకి గుర్తులేదేమో’ అందట. ‘లేదమ్మా, అది మన షూటింగే కదా, వాళ్లతో మాట్లాడి మారుస్తాను’ అని మార్చేశాడు.   

సురేఖ: మా మ్యారేజ్‌ డే అయినా, నా బర్త్‌డే అయినా హడావిడి ఏమీ ఉండదు.

► గిఫ్ట్‌లు ఇస్తుంటారా?
సురేఖ: రెండేళ్ల క్రితం నా బర్త్‌డేకి వాచ్‌ ఇచ్చారు. కరెక్ట్‌గా రాత్రి 12 గంటలకు నన్ను నిద్ర లేపి మరీ ఇచ్చారు. ఆ గిఫ్ట్‌ నాకివ్వటం కోసం ఎంత కష్టపడ్డారో తర్వాత తెలిసి ఆనందపడ్డాను.
చిరంజీవి: ఆ బ్రాండ్‌ వాచ్‌ ఇక్కడ దొరకలేదు. బెంగళూర్‌లో ఉంది. ఆ కంపెనీవాళ్లను అడిగితే, ‘మీరు మా ప్రివిలేజ్డ్‌ కస్టమర్‌’ అని ఫ్లయిట్‌కి వచ్చి ఇచ్చి వెళ్లారు.  

► కలిసి షాపింగ్స్‌కి వెళతారా?
చిరంజీవి: షాపింగ్‌ అంటే ఇద్దరికీ ఇష్టం. ఇక్కడ కష్టం కాబట్టి విదేశాలు వెళ్లినప్పుడు బాగా తిరుగుతాం. లండన్‌ వెళితే ఓ అపార్ట్‌మెంట్‌ అద్దెకి తీసుకుని కొన్ని వారాల పాటు అక్కడే ఉంటాం. నాకు, తనకి కుకింగ్‌ అంటే సరదా. కుక్‌ చేసుకుని షాపింగ్‌కి వెళ్లిపోతాం.

► పండగలు బాగా చేస్తుంటారని విన్నాం. ప్లానింగ్‌ అంతా సురేఖ గారిదేనా?
చిరంజీవి: నాగబాబు, పవన్‌కల్యాణ్, అల్లు అరవింద్‌ ఫ్యామిలీ... ఇలా అన్ని క్లోజ్‌ ఫ్యామిలీలు మొన్న దీపావళి పండగకి కలిశాం. దాదాపు మేమే ఓ వందమంది దాకా ఉంటాం. అందరికీ తనే మెసేజ్‌ పెడుతుంది. ఆ మెసేజ్‌కే  చిన్న పిల్లల దగ్గరనుండి, పెద్దవాళ్లదాకా అందరూ తూచా తప్పకుండా హాజరవుతారు. సంక్రాంతి పండగను  మూడు రోజులు చాలా ఘనంగా చేసింది. అప్పుడు పంక్తి భోజనాలు పెట్టి, పెద్ద భోగి మంట ఏర్పాటు చేయించింది. పండగ అనేది వంకే తప్ప, అందరూ కలవాలనుకుంటుంది. అందుకే అందరితోనూ తనకు మంచి బాండింగ్‌ ఉంటుంది.

సురేఖ: ఈయన మొదట్నుంచి వాళ్ల పిల్లలు, వీళ్ల పిల్లలు అని కాదు.. అందరి పిల్లలతో బాగుంటారు. చిన్నప్పుడు అందరి పిల్లలు ఓ పదిహేనుమంది దాకా అయ్యేవారు. అందరినీ షూటింగ్‌లకు తీసుకెళ్లేవారు. మాల్దీవ్స్‌ వెళ్లినా, స్విస్‌ వెళ్లినా హాలిడే ఉందంటే చాలు.. అల్లు వెంకటేశ్, బన్నీ, శిరీష్‌ ఇలా అందరి పిల్లల్ని ఫారిన్‌ తీసుకెళ్లేవారు.
చిరంజీవి: పిల్లలందరికీ వండర్‌ఫుల్‌ మెమొరీస్‌ నాతోనే ఉంటాయి. నేనెన్ని చేసినా దాన్ని ఆర్గనైజ్‌ చేసి, మేనేజ్‌ చేసేవాళ్లు కావాలి. అది సురేఖ చేస్తుంది.

► పండగలవీ శ్రద్ధగా చేస్తున్నారంటే పూజలు బాగా చేస్తారా?
సురేఖ: మరీ అంత ఎక్కువ కాదు. రోజూ మామూలుగా చేస్తా. స్పెషల్‌ అకేషన్‌ అంటే కచ్చితంగా బాగా చేస్తాను. మనం చేస్తుంటేనే పిల్లలు కూడా ఫాలో అవుతారు. మన నెక్ట్స్‌ జనరేషన్‌కు తెలుస్తుంది. మనం వదిలేస్తే వాళ్లూ వదిలేస్తారు. మా సుస్మిత, శ్రీజ పెళ్లి చేసుకుని వెళ్లిపాయినా ఇక్కడ పూజలు చేసినట్లే అత్తగారింట్లో చేస్తారు.

► మనవళ్లు, మనవరాళ్ల గురించి ?
సురేఖ: అదొక లవ్లీ లైఫ్‌. ఈయనకి అప్పట్లో తీరిక లేక మా పిల్లల ఎదుగుదలను చూడలేదు. ఇప్పుడు చిన్నపిల్లలతో టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారు. అందరికీ ఆయనంటే పిచ్చి ఇష్టం. వాళ్లతో ఆయన ఎన్ని ఆటలు ఆడతారో చెప్పలేం.

► మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయా?
చిరంజీవి: ఎందుకు జరగవు? తిట్టుకుంటానే ఉంటాం
సురేఖ: అలా జరగబట్టే ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాం. ఎప్పుడూ స్వీట్‌ స్వీట్‌గా ఉంటే బోర్‌.

► ఇద్దరిలో ఎవరు సీరియస్‌? ఎవరు కామెడీ?
చిరంజీవి: నేను కామెడీగా ఉండను. అలాగని పెద్ద సీరియస్‌గా కూడా ఉండను. కామెడీ అంటే సురేఖనే ఎక్కువ. ఆమె పంచ్‌లను తట్టుకోవటం చాలా కష్టం. ఒక్కోసారి ఆ పంచ్‌లకు గుక్క తిప్పుకోలేం.

► ఫైనల్లీ.. మళ్లీ జన్మంటూ ఉంటే మీరే కపుల్‌గా ఉండాలనుకుంటున్నారా?
చిరంజీవి: నేను ఆ మద్రాస్‌ కోడంబాకం బ్రిడ్జి మీదకి మాత్రం వెళ్లను (పెద్దగా నవ్వుతూ). ఐయామ్‌ జస్ట్‌ కిడింగ్‌. డెఫ్‌నెట్‌లీ మేమే ఉండాలనుకుంటున్నాం.

సురేఖ: అంతే...

► మీరు కట్టుకునే చీరలు బాగుంటాయి. మీవారు కాంప్లిమెంట్స్‌ ఇస్తుంటారా?
సురేఖ: థ్యాంక్యూ. నాకు అప్‌డేటెడ్‌గా ఉండటం ఇష్టం. దానికి కారణం చిరంజీవిగారే. ఆయనకు ఫ్యాషన్‌ గురించి, కలర్స్‌ గురించి చాలా అవగాహన ఉంది. ఇంకో విషయం ఏంటంటే.. ఆయన చీర చూడగానే రేటు చెప్పేస్తారు. అది ఏ చీర అయినా కానివ్వండి.. బట్టల గురించి అంత ఐడియా ఉంది. నేను కట్టే చీరలు బాగుంటాయని అందరూ అంటుంటే బాగానే ఉంటుంది. కానీ అదే విషయాన్ని ఆయన నోటి నుంచి వింటే ఆ ఆనందమే వేరు. అంతేకదా.. మనం శ్రద్ధగా డ్రెస్‌ చేసుకున్నప్పుడు భర్త నుంచి ఓ చిన్ని కాంప్లిమెంట్‌ వస్తే ఆ ఫీలింగే స్పెషల్‌. ఆ విషయంలో ఆయన హండ్రెడ్‌ పర్సంట్‌ బెస్ట్‌. అన్నీ పట్టించుకుంటారు. కాంప్లిమెంట్స్‌ ఇస్తారు.

► సో.. మీ కళ్లబ్బాయి పక్కా ఫ్యామిలీ మ్యాన్‌ అన్నమాట?
సురేఖ: డౌట్‌ ఏముంది? హండ్రడ్‌ పర్సంట్‌ పక్కా ఫ్యామిలీ మ్యాన్‌.

► 30 ఏళ్లు నటించి ఓ పదేళ్లు పాలిటిక్స్‌కి దగ్గరగా ఉండటంవల్ల సినిమాలకు దూరమయ్యారు. ఆ గ్యాప్‌ గురించి?
సురేఖ: అప్పుడు పీస్‌ఫుల్‌గా ఉండేవారు కాదు. మాకూ అలానే ఉండేది. ఆయనకి మేకప్‌ వేసుకోగానే హుషారు వస్తుంది.

చిరంజీవి: పనులన్నీ ముగించుకుని ఇంటికొచ్చాక కూడా మరుసటి రోజు ఏం మాట్లాడాలి? అనేదాని చుట్టూనే ఆలోచనలు ఉండేవి. ‘సినిమాలు చేయడం మొదలుపెట్టాక మళ్లీ మిమ్మల్ని మా మనిషిలా చూస్తున్నాం’ అంటున్నారు.

సురేఖ: ఇప్పుడు ఫుల్‌ హుషారు. ఉదయం 9కి వెళ్లాలంటే ముందే రెడీ అయి కూర్చుంటారు. షూటింగ్‌ ఉంటే.. హీ ఈజ్‌ ఫుల్‌ యాక్టివ్‌.

చిరంజీవి: ‘సైరా’ సినిమాకి 4.30కి లేచి వర్కవుట్‌ చేసుకొని 5.30గంటలకల్లా రెడీ అయ్యి 6 గంటలకు లొకేషన్‌కి వెళ్లి 7 గంటలకల్లా మేకప్‌తో రెడీగా ఉండేవాణ్ణి. ఇప్పుడు కొరటాల శివతో చేస్తున్న సినిమా షూటింగ్‌ షార్ప్‌ 7కల్లా స్టార్ట్‌ చేస్తున్నాం. జనవరి 2న షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. అప్పుడే ఓ సాంగ్, మూడు ఫైట్స్‌ కంప్లీట్‌ అయ్యాయి.

► మీ పెళ్లప్పటికే చిరంజీవిగారు కెరీర్‌వైజ్‌గా మంచి ఫామ్‌లోకొచ్చారు.. ఆ బిజీని ఎలా తీసుకునేవారు?
సురేఖ: ఆయన కనబడటమే అపురూపంగా ఉండేది. ఎప్పుడూ షూటింగ్‌లతో దూరం, దూరంగా ఉండటంతో కళ్లారా ఎప్పుడు చూస్తానా అనిపించేది.

చిరంజీవి: నేను ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడే అవకాశాలు మొదలయ్యాయి. ఆల్బమ్‌ పట్టుకుని అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాలేదు. అందుకే పెళ్లినాటికే ఫామ్‌లో ఉన్నా. అప్పుడేమో నేను కనబడితే రేఖకి అపురూపం. మనవరాళ్లు వచ్చాక ఎఫెక్షన్‌ తగ్గింది. పలకరిస్తే ‘ఆ వస్తున్నా’ అంటుంది. వచ్చి చూడదు. అందుకేనేమో లేటు వయసులో చాలామంది సెకండ్‌  కోసం చూస్తుంటారు (కొంటెగా నవ్వుతూ). అయినా నేనా ధైర్యం చేయలేను.

► చిరంజీవిగారు, చరణ్‌ కలిసి ఫుల్‌ లెంగ్త్‌ సినిమా చేయాలని ఉందా?
సురేఖ: ఇద్దరినీ ఓ సినిమాలో చూడాలని ఉంది. ‘ఖైదీ నంబర్‌–150’లో ‘అమ్మడూ లెట్స్‌ డూ కుమ్ముడు’ పాట మధ్యలో చరణ్‌ వచ్చి డ్యాన్స్‌ చేస్తాడు. వాళ్లిద్దరూ కలిసి డ్యాన్స్‌ చేస్తుంటే ఈయన్ని చూడాలా, చరణ్‌ని చూడాలా అనుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో ఆ సినిమా చూస్తూ ఒకసారి ఈయన్ని, మళ్లీ ఆ పాట పెట్టుకుని ఒకసారి చరణ్‌ని చూశాను.

► నటుడిగా చిరంజీవిగారు రిస్కీ ఫైట్స్‌ చేస్తుంటారు. మీకెలా అనిపిస్తుంది?
సురేఖ: లొకేషన్‌లో ఏం చేసేవారో తెలిసేది కాదు కానీ, చేసొచ్చిన తర్వాత చెబుతుంటే ‘బాబోయ్‌’ అనిపించేది. ఎప్పుడో పొద్దున వెళితే సాయంత్రానికి వచ్చేవారు. అలా కాకుండా ఏ పదకొండింటికో ఆయన ఇంటికి వచ్చేస్తున్నారు అని ఎవరైనా చెబితే మాత్రం, ఏదో దెబ్బతగిలే ఉంటుందనుకునేదాన్ని. అలాగే ఫైట్‌ సీన్స్‌ అంటే మధ్యలో లొకేషన్‌ నుంచి ఫోన్‌ రాకూడదని కోరుకుంటా. ఫోన్‌ వస్తే ఆయనకు ఏదైనా దెబ్బ తగలిందని చెబుతారేమోనని భయం. ఇప్పుడు ఫర్వాలేదు కానీ అప్పట్లో ఇంత కంఫర్టబుల్‌ షూస్‌ కానీ, సేఫ్టీ ప్రికాషన్స్‌ కానీ లేవు కదా. ఈయనేమో డూప్‌ కూడా వద్దంటారు.

– డి.జి. భవాని

మరిన్ని వార్తలు