మహాచార్య

10 Sep, 2018 01:36 IST|Sakshi

అన్నీ తెలిసిన మనిషి.. ఆవేశపడని మనిషి.. ఆలోచించే మనిషి.. జాగ్రత్త చెప్పే మనిషి... పక్కన ఉంటే భరోసాగా ఉంటుంది. రోశయ్య అలాంటి భరోసా ఇచ్చిన మనిషి. అదుపు తప్పబోయిన పరిస్థితుల్ని బ్యాలెన్స్‌ చేసిన మనిషి. ఈ రాజనీతిజ్ఞత మహా మహా ఆచార్యులకు మాత్రమే ఉంటుంది. అందుకే ఆయన మహాచార్య.   

మహాభారతంలో కురువృద్ధుడు భీష్మపితామహుడు. ఆంధ్ర భారతంలో ఆ పాత్ర కొణిజేటి రోశయ్యగారిది. 85 ఏళ్ల రోశయ్య  జీవితంలో 65 ఏళ్లు రాజకీయరంగంతోనే మమేకమై ఉంది. ఆయన హయాంలో రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని గద్దెనెక్కించారూ అంటే కీలకమైన మంత్రి పదవులకు గుర్తుకొచ్చే నాలుగైదు పేర్లలో రోశయ్య  పేరు తప్పకుండా ఉండేది.

‘రోశయ్యకు మంత్రి పదవి వస్తుందా, రాదా’ అనేది కాదు ప్రశ్న, ఈయనకు ఈ దఫా ఏ శాఖ ఇస్తారనే చర్చలు రాజధాని నుంచి గ్రామాల్లో అరుగుల వరకు జరిగేవి. అసెంబ్లీలో ఆయన ఉంటే చెణుకులతో సభ ఘొల్లుమనేది. సందర్భానుసారం పిట్ట కథలతో వాతావరణాన్ని సర్దుబాటు చేసేవారు. ఆ కథలో ఎత్తిపొడుపు తగలాల్సిన వాళ్లకు సూటిగానే తగిలేది, మళ్లీ నోరెత్తడానికి సందేహించేటంతగా.  ఇలాంటి అస్త్రం మన దగ్గర ఉండబట్టే మన అమ్ములపొది ఇంత పటిష్టంగా ఉందనే భరోసా సొంతపార్టీ వాళ్లకు మళ్లీ మళ్లీ కలిగేది. టీవీలో చూసేవాళ్లకు అది ఓ ఇన్‌ఫోటైన్‌మెంట్‌.

రాష్ట్ర పాలన.. రాజ్యాంగ పరిరక్షణ
రోశయ్య దక్షిణాదిలో కేరళ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రంలోనూ కనిపిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి, టి. అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దన రెడ్డి, వైఎస్‌ రాజశేఖర రెడ్డి.. మొత్తం ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్‌గా రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్, బల్కంపేటలోని స్వగృహంలో విశ్రాంత జీవనాన్ని గడుపుతున్నారు. ఆ ఆం్ర«ధ భీష్మపితామహుడిని సాక్షి పలకరించింది.

దైవం.. గురువు.. మిత్రుడు
సామాన్య, మధ్యతరగతి వారు నివసించే ప్రదేశంలో ఒక విశాలమైన ప్రాంగణం, అందులో అందమైన భవంతి. పోలీస్‌ సెక్యూరిటీ దాటి లోపలికి అడుగుపెడితే వేణుగోపాలుడి విగ్రహం. ముందు గదిలో అడుగుపెట్టగానే ఎదురుగా ఉన్న గోడకు కుడివైపు తొండంతో ఉన్న వినాయకుడి తంజావూర్‌ చిత్రపటం కనిపిస్తుంది. కొంచెం ఎడమ వైపు ఆయన రాజకీయ గురువు ఆచార్య ఎన్‌జీ రంగా ఫొటో, కుడివైపు గోడకు రాజకీయ మిత్రులు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటో ఉన్నాయి. గురువుకి, మిత్రుడికి ఆయన మనసులో ఉన్న మహోన్నతమైన స్థానానికి ప్రతీకల్లా ఉన్నాయవి.

అప్పుడిన్ని కుదుపుల్లేవు
అప్పుడు సమయం సాయంత్రం ఐదుగంటలు. అప్పుడే విచ్చుకుంటున్న మల్లెల్లా ఉన్న స్వచ్ఛమైన తెల్లని దుస్తుల్లో లోపలి నుంచి వచ్చారాయన. ‘‘ఎలా ఉన్నారు?’’ అని పలకరించగానే ‘‘ఇదిగో ఇలా. ఆరోగ్యం బాగుంది, జీర్ణం కావడం లేదు’’ అంటూ నవ్వారు. ఉదయం లేచిన తర్వాత ఏడు గంటలకు ఇంటి ఆవరణలోనే ఓ గంట సేపు వాకింగ్‌ చేయడం. పేపర్లు చదవడం, టీవీలో వార్తలు చూడటం, వేళకు ఆహారం, విశ్రాంతి... ఇదీ ఇప్పుడాయన దినచర్య.

ఇప్పుడేమీ పట్టించుకోవడం లేదంటూనే తన అనుభవంలోని విషయాలను బయటపెట్టారు. తన హయాంలో ఒక నాయకుడు ఉంటే.. అతడి ఆదేశాన్ని పాటించే అనుచరులు ఎక్కువ మంది ఉండేవారని చెప్పారు. ఇప్పటి రాజకీయ రంగం.. నాయకులు ఎక్కువైపోయి ఇబ్బంది పడుతోంది. దాంతో తరచూ కుదుపులకు లోనవుతోందని అన్నారు. ఆచార్య రంగా, గౌతు లచ్చన్నల ప్రభావంతో రాజకీయ రంగంలోకి వచ్చానని, రంగా శిష్యుడినని చెప్పుకోవడంలో సంతోషం ఉంటుందని చెప్పారు.  

కలం పట్టిన చెయ్యి
రోశయ్య గుంటూరు హిందూ కాలేజ్‌లో బీకామ్‌ చదువుతున్న రోజులవి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సొంత పరిపాలనలో తొలి అడుగులు వేస్తోంది దేశం. ఆ అడుగులు సమసమాజ స్థాపన దిశగా పడటం లేదని గళమెత్తిన పథనిర్దేశకులలో ఆచార్య రంగా కూడా ఉన్నారు. ఆయన తన ప్రసంగాలతో యువతలో ఆలోచన రేకెత్తించేవారు. అలా ప్రభావితమైన వారిలో రోశయ్య ఒకరు. సమాజానికి కొత్త పథాన్ని నిర్మించాలంటే ఉన్న దారి ఎటు వెళ్తోందో తెలుసుకోవాలి. ప్రతిరోజూ ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలు చదవడం అలా అలవాటైంది ఆయనకు. అలాగే తాను తెలుసుకున్న సమాచారాన్ని పదిమందికి తెలియచేయాలనే తపన కూడా అప్పుడే మొదలైంది.

వార్తలు రాసి గుంటూరులో ఉన్న ఆంధ్రపత్రిక ఆఫీస్‌కి వెళ్లి ఇచ్చేవారు రోశయ్య. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ‘‘విలేఖరి తాను స్వయంగా చూసిన విషయాన్ని రాస్తే, ఆ కథనంలో సమగ్రత ఉంటుంది. ఆ వార్తకు విశ్వసనీయత వస్తుంది. అప్పట్లో పత్రికలు మేము (విలేఖరులు) రాసుకెళ్లిన విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ప్రచురించేవి. ఇప్పుడు వార్తాప్రసారం వేగవంతమైంది. ఒక సంఘటన జరిగితే, సంఘటన స్థలానికి విలేఖరి వెళ్లి రిపోర్ట్‌ చేసే టైమ్‌ ఇవ్వడం లేనట్లుంది. దాంతో వాళ్లు తాము విన్న మాటల ఆధారంగా వార్తా కథనాన్ని రాసేస్తున్నారు. దాంతో సమగ్రత లోపించి వార్తలో డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ పద్ధతిని మార్చుకోవాలి’’ అని కొత్తతరం విలేఖరులకు సూచించారు.

అప్పట్నుంచి తెల్లదుస్తులే!
రోశయ్య కాలేజ్‌ వదిలిన ఏడాది వరకు మాత్రమే ప్యాంటు, షర్టు వేసుకున్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి రావడమే తడవుగా తెల్ల ధోవతి, తెల్లలాల్చీకి మారిపోయారు. ‘‘రోజూ తెల్లదుస్తులు ధరించడం అలవాటైపోయింది. రోజూ అన్నం తింటాం. బోరు కొడుతుందా’’ అని చమత్కరించారు. చిన్నప్పటి నుంచి తనది అత్యంత నిరాడంబరమైన జీవితం అని చెబుతూ.. తల్లి వండినది తినడమే తప్ప.. అదిష్టం, ఇదిష్టం లేదనడం తెలియదన్నారాయన.

బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ..‘‘మా నాన్నకు వ్యవసాయంతోపాటు వ్యాపారం కూడా ఉండేది. ఒకసారి సేల్స్‌ ట్యాక్స్‌ అధికారి వచ్చి లెక్కలు, పన్నులు అంటూ అధికారం ప్రదర్శించాడు. అప్పుడు ‘దుకాణం పెట్టడానికి పెట్టుబడి మీరివ్వలేదు, వ్యాపార లావాదేవీల్లో సహాయం చేయలేదు. మీకు లెక్కలు చూపిస్తూ, మీ ఆదేశాలు పాటిస్తూ వ్యాపారం చేయాలా’ అని వ్యాపారం మానేసి వ్యవసాయానికే పరిమితమయ్యారు. బ్రిటిష్‌ పెత్తనాన్ని అంతగా నిరసించేవారాయన’’ అని తండ్రి ముక్కుసూటి తనం గురించి చెప్పారు.

అంత కచ్చితమైన భావాలు కలిగిన మనిషి పెంపకంలో జాగ్రత్తగా మెలగడం ఎలాగో నేర్చుకున్నానంటారు రోశయ్య. ‘‘ఒకసారి జారిన తర్వాత ఆ మాట ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను పాటిస్తాను, నా పిల్లలకూ అదే చెప్పాను’’ అని జీవిత సూత్రాన్ని బయటపెట్టారు. ఇంకా.. ‘‘మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులకు ఏదైనా చెప్పాల్సి వస్తే.. ఆ విషయాన్ని అందరిలో చెప్పేవాడిని కాదు, పర్సనల్‌గా చెప్పేవాడిని. అలాగే నా మీద వచ్చిన విమర్శలను ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదు. అవి అభిప్రాయభేదాలంతే, ఎవరికి వారు తమ తమ పార్టీలను పరిరక్షించుకునే ప్రయత్నాలు తప్ప మరేమీ కాదు. విమర్శలను హుందాగా స్వీకరించగలిగితే వ్యక్తిగతంగా శత్రువులు ఏర్పడరు’’ అంటూ తాను అజాత శత్రువుగా ఉండిపోయిన వైనాన్ని చెప్పారాయన.

తొలి ప్రయత్నం విఫలం
రోశయ్య క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి స్వతంత్ర పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆ ప్రయత్నంలో విజయం ఆయనకు దూరంగానే ఉండిపోయింది. అంత చిన్న వయసులో శాసనసభకు పోటీ చేయడం గురించి చెబుతూ.. ‘‘అప్పట్లో యువకుల్నీ, ఉత్సాహవంతుల్నీ.. చురుగ్గా పని చేస్తున్నారు.. అనే అభిప్రాయం కలిగితే ఎన్నికల్లో పోటీ చేయమని పార్టీ నాయకులు ప్రోత్సహించేవారు. ఇప్పటి సమీకరణలుండేవి కాదు. అంతటి ఆరోగ్యకరమైన పరిస్థితులుండబట్టే నాలాంటి సామాన్యుడు ధైర్యంగా రాజకీయాల్లోకి రాగలిగాడు’’ అన్నారు.

వారసుల్లేరు
ఎన్టీఆర్, ఏఎన్నార్, భానుమతి నటనను ఇష్టపడే రోశయ్య.. సంగీతాన్ని కూడా అంతే ఇష్టపడతారు. తమిళనాడులో గవర్నర్‌గా ఉన్నప్పుడు కూడా డైరీలో ఖాళీ దొరికితే త్యాగరాజ కీర్తనల వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లేవారాయన. తన జీవితంలో పుస్తకాలు చదవడం సాధ్యమే కాలేదంటారు. బిజీగా ఉన్న రోజుల్లో మాత్రం పేపర్లలో ఉదయం చదవగా మిగిలిపోయిన పేజీలను రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత పూర్తి చేసేవారట.

ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్‌కి ఫలానా టైమ్‌కి వస్తానంటే కచ్చితంగా ఆ సమయానికి అక్కడ ఉండాలనేది ఆయన సిద్ధాంతం. అలా మాట నిలబెట్టుకున్నప్పుడే మనిషికి విశ్వసనీయత అంటారు. ‘తనకు రాజకీయ వారసులు లేరంటూ.. వారసుల్ని తయారు చేస్తే తయారు కారు.. వారిలో ఆ ఆకాంక్ష ఉంటే ఎదుగుతారు అని అన్నారు. తన కూతురు వైజాగ్‌లో, ఇద్దరబ్బాయిలు హైదరాబాద్‌లో, ఒకబ్బాయి తెనాలిలో వ్యాపారాలలో స్థిరపడ్డారని చెప్పారు. వాళ్ల వ్యాపార వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని, నా రాజకీయ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులను తలదూర్చనివ్వలేదనీ అన్నారాయన.


బంధువులమ్మాయే!
రోశయ్యగారి భార్య శివలక్ష్మి. ఆమెను తొలిసారిగా చూసిందెప్పుడో గుర్తు లేదంటారాయన. ‘‘వాళ్లది తెనాలి, మాది తెనాలి దగ్గర వేమూరు. మొదటిసారి ఎప్పుడు చూశానో తెలియదు. బాగా చిన్నప్పుడే చూసి ఉంటాను. పెళ్లి నాటికి కూడా ఆమెకి పద్నాలుగేళ్లే. నాకంటే ఆరేళ్లు చిన్నది. ఆమెకి ఇల్లు తప్ప మరేమీ పట్టవు. ఆమె అలా ఇంటిని దిద్దుకోవడం వల్లనే నేను పూర్తి సమయం ప్రజాజీవితంలో గడపగలిగాను. ఇంటికి వచ్చిపోయే బంధువులకు జరగాల్సిన గౌరవాలను జాగ్రత్తగా చూసుకోవడం నుంచి నాకు ఎప్పుడు ఏం కావాలో చక్కగా అమర్చడం వరకు ప్రతిదీ స్వయంగా చూసుకున్నదామె. పిల్లల్ని పెద్ద చదువులకు కాలేజీల్లో చేర్చడానికి మా తమ్ముడి సహాయం తీసుకునేది.

ఇంట్లో ఏ పనీ నా కోసం ఎదురు చూసేది కాదు. ఇంటి వాతావరణాన్ని అంత సౌకర్యంగా ఉంచుతుంది. అలాగని ఎప్పుడూ నా మీద కోపం రాలేదని కాదు. ‘అప్పుడప్పుడూ ఇంటిని కూడా పట్టించుకోండి’ అని కోప్పడేది. కానీ ఆ కోపం, అలక ఎంతో సేపు ఉండవు. ఆమె కోప్పడినా నాకు ఆమె మీద నిష్ఠూరం కలగలేదెప్పుడూ. ఆమెకు కోపం రావడంలో అర్థం ఉందిగా మరి. నా మట్టుకు నేను బయటి చిరాకుల్ని ఆమె మీద ప్రదర్శించకుండా జాగ్రత్తపడేవాడిని. ఆమెకు నా రాజకీయ వ్యవహారాలేవీ తెలియదు. నేను మంత్రిగా ఉన్న రోజుల్లో ‘ఆయన ఏ శాఖకు మంత్రి’ అని ఎవరైనా అడిగితే’  సమాధానం కోసం తడుముకునేటంత దూరంగా ఉంటుంది’’ అని నవ్వుతూ చెప్పారు.


– వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు