అతను సో స్వీట్!

25 Jun, 2015 00:14 IST|Sakshi
అతను సో స్వీట్!

న్యూ టాలెంట్
తెలుగు పరిశ్రమలో ఉత్తరాది భామలదే హవా. ఒక్క చాన్స్, హిట్ వస్తే చాలు.. ఆ తర్వాత ఇక్కడ తిరుగులేని తారలుగా మారిపోతారు.
‘రన్ రాజా రన్’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీతో కథానాయికగా పరిచయమైన సీరత్ కపూర్ కూడా సౌత్‌లో తన కెరీర్ బాగుంటుందనే నమ్మకంతో ఉన్నారు.
ఆమె నటించిన ‘టైగర్’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సీరత్‌తో చిట్ చాట్..

 
♦  ముందు ఓ విషయం చెప్పండి.. హిందీ రంగంలో పెద్ద పేరున్న ‘కపూర్’ కుటుంబానికీ, మీకూ ఏమైనా బంధుత్వం ఉందా?
 ఇంటి పేరు ఒకటే కాబట్టి, అందరూ ఆ కపూర్ కుటుంబానికి బంధువునని అనుకుంటున్నారు. బాలీవుడ్‌లో కూడా చాలామంది విలేకరులు నన్నీ ప్రశ్న అడిగారు. కానీ, ఆ కుటుంబంతో నాకు బంధుత్వం లేదు. నేను ‘ఓన్ సీరత్ కపూర్’ని (నవ్వుతూ).
 
♦  పోనీ.. మీ కుటుంబంలో సినిమా రంగానికి చెందినవారెవరైనా ఉన్నారా?
 ముంబయ్‌లో రోషన్ తనేజా యాక్టింగ్ స్కూల్ ఉంది కదా.. రోషన్ తనేజా మా రెండో తాతగారు.
 
♦  రెండో తాతగారంటే?
 అంటే.. రోషన్ తనేజా కొడుకుని మా పిన్ని పెళ్లి చేసుకుంది. ఆయన యాక్టింగ్ స్కూల్‌లోనే నేను నటన నేర్చుకున్నా.
 
♦  ముందు డ్యాన్స్ మాస్టర్‌గా చేశారు కదా..?
 నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. క్లాసికల్ సింగర్‌ని కూడా. శిక్షణ తీసుకున్నాను. హిందీ సినిమాలకు నృత్యదర్శకురాలిగా చేసే అవకాశం వస్తే, ఒప్పుకున్నాను. ముందు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా, ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్‌గా చేశాను.
 
♦  రణబీర్ కపూర్ నటించిన ‘రాక్‌స్టార్’కి అసిస్టెంట్ డ్యాన్స్ డెరైక్టర్‌గా చేశారు కదా.. రణబీర్ గురించి నాలుగు మాటలు?
 రణబీర్‌కి పెద్ద స్టార్ అనే ఫీలింగే ఉండదు. అందరితో కలిసిపోతాడు. ఏదైనా స్టెప్ అర్థం కాకపోతే, ‘ఎలా చెయ్యాలి’ అని అడిగి, నేర్చుకుని చేసేవాడు. ‘రాక్‌స్టార్’ మ్యూజికల్ బేస్డ్ ఫిలిం కాబట్టి, డ్యాన్సులకు మంచి స్కోప్ ఉండేది. రణబీర్ చాలా బాగా చేశాడు.
 
♦  ఓకే.. తెలుగు చిత్రాల విషయానికొద్దాం... ‘రన్ రాజా రన్’లో కనిపించిన పదకొండు నెలలకు ‘టైగర్’తో వస్తున్నారు.. ఈ సినిమా అంగీకరించడానికి కారణం?
 ఈ చిత్రదర్శకుడు ఆనంద్ ముంబయ్‌కి ఫోన్ చేసి, నాకీ కథ వినిపించారు. చాలా బాగా నచ్చింది. కథతో పాటు నా పాత్ర కూడా బాగుంటుంది. ఇందులో నా పాత్ర పేరు ‘గంగ’. వారణాసిలో నివసించే సంప్రదాయబద్ధమైన కుటుంబానికి చెందిన అమ్మాయిని. ఒకవైపు ట్రెడిషనల్, మరోవైపు మోడర్న్.. రెండు రకాలుగా ఉంటుంది గంగ. నిజజీవితంలో నేను కూడా అంతే. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్‌లతో కలిసి సినిమా చేయడం మంచి అనుభూతినిచ్చింది. మేమంతా మనసు పెట్టి చేశాం. విజయం ఖాయం అని నమ్ముతున్నా.
 
♦  ‘రన్ రాజా రన్’ అప్పుడు మిమ్మల్ని ప్రభాస్ అభినందించారు కదా.. ఏమనిపించింది?
 ప్రభాస్ సో స్వీట్. ఆ సినిమా షూటింగ్ లొకేషన్‌కి వచ్చేవారాయన. బాగా యాక్ట్ చేస్తున్నావని అప్పుడే అభినందించారు. ఆ తర్వాత ఫంక్షన్లో అందరి ముందూ ప్రశంసించారు. అంత పెద్ద స్టార్ నన్ను అభినందించడం మర్చిపోలేని విషయం.
 
♦  క్లాసికల్ సింగర్‌ని అన్నారు.. సినిమాలకు పాడతారా?
 యాక్చువల్‌గా నేనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవాలని కూడా ఉంది. కానీ, తెలుగు భాష తెలియదు కాబట్టి, వేరే దారి లేక డబ్బింగ్ చెప్పించుకోవాల్సి వస్తోంది.
 
♦  మరి.. తెలుగు నేర్చుకుంటున్నారా?
 తెలుగు పదాలు పలకడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. పట్టుదల ఉంటే ఏదీ సాధ్యం కాదు. మొత్తం నేర్చేసుకుని, భవిష్యత్తులో నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా.
 
♦  కొరియోగ్రఫీ, యాక్టింగ్.. దేనికి ప్రాధాన్యం ఇస్తారు?
 ప్రస్తుతానికి నటనపైనే. సినిమాల్లో ఎలాగూ డాన్స్ చేస్తాం కాబట్టి, దానికి దూరమయ్యే అవకాశం లేదు. భవిష్యత్తులో మాత్రం డెరైక్షన్ చేస్తా.
 
♦  తెలుగులో వేరే సినిమా ఏదైనా చేస్తున్నారా?
 సుమంత్ అశ్విన్ సరసన ‘కొలంబస్’లో నటిస్తున్నా.

మరిన్ని వార్తలు