జన్యుమార్పిడితో కొలెస్ట్రాల్‌కు కళ్లెం?

13 Jul, 2018 01:17 IST|Sakshi

జన్యుమార్పిడి టెక్నాలజీ ద్వారా కోతుల్లో కొలెస్ట్రాల్‌ మోతాదులను గణనీయంగా తగ్గించడంలో పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో పదేళ్లలో ఇదే పద్ధతిని ఉపయోగించి ఊబకాయంతో పాటు అనేక ఇతర సమస్యలకు చెక్‌ పెట్టవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. మన కాలేయానికి  చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించే శక్తి సహజసిద్ధంగానే ఉన్నప్పటికీ పీసీఎస్‌కే 9 అనే ప్రొటీన్‌ ఈ ప్రక్రియను అడ్డుకుంటూ ఉంటుంది. ఫలితంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువవుతూంటుంది. ఈ ప్రొటీన్‌పై ఇప్పటికే బోలెడన్ని పరిశోధనలు జరిగాయి. ఈ నేపథ్యంలో పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కోతులపై కొని ప్రయోగాలు చేశారు.

పీసీఎస్‌కే 9 ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే జన్యువును పనిచేయకుండా చేసినప్పుడు ఈ కోతుల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ సగానికిపైగా తగ్గినట్లు తెలిసింది. జన్యువును పనిచేయకుండా చేసేందుకు శాస్త్రవేత్తలు ఎంజైమ్‌ ఆధారిత మెగా న్యూక్లియస్‌ ఆధారిత టెక్నాలజీని ఉయోగించడం విశేషం. అయితే ఈ ప్రయోగాల్లో కొన్ని అనుకోని దుష్ప్రభావాలు కనిపించిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు విస్తృత స్థాయి పరిశోధనలకు ప్రయత్నిస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో పదేళ్లలో ఇది సాధ్యం కావచ్చునని, తద్వారా కొన్ని అరుదైన గుండెజబ్బులతో పాటు ఇతర వ్యాధులకు మెరుగైన చికిత్స లభించే అవకాశముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లిలి వాంగ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు