దేవుని అండతోనే మహా విజయాలు!!

1 Sep, 2019 07:46 IST|Sakshi

సువార్త

కండబలంతోనే బతికేటట్లయితే, దేవుడు సృష్టించిన ఈ విశాల విశ్వంలో ఈగలు, దోమల్లాంటి అల్పజీవులకు అసలు తావుండేది కాదు. ఏలా లోయలో ఫిలిష్తీయులతో భీకరయుద్ధం జరుగుతుంటే, ఇశ్రాయేలీయుల సైనికులైన తన ముగ్గురు అన్నల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి దావీదు యుద్ధభూమికి వెళ్ళా డు. అక్కడ ఫిలిస్తీయుడైన గొల్యాతు అనే మహాబలుడు తన కండలు ప్రదర్శిస్తూ, ధైర్యముంటే వచ్చి తనతో తలపడమంటూ సవాలు చెయ్యడం, ఇశ్రాయేలీయులంతా అతనికి జడిసి గుడారాల్లో దాక్కోవడం దావీదు చూశాడు. గొల్యాతు రూపంలో ‘భయం’ రాజ్యమేలుతున్న యుద్ధభూమిలో, విశ్వాసులుగా నిర్భయంగా జీవించాల్సిన, రోషంతో యుద్ధం గెలవాల్సిన ఇశ్రాయేలీయులు తమ విజయం పైన, ప్రాణాలపైన ఆశలొదిలేశారు, దేవుణ్ణి కూడా వదిలేశారు, వాళ్ళ రాజైన సౌలయితే, అంతా వదిలేసి గడగడలాడుతూ కూర్చున్నాడు.

ఆ స్థితిలో దావీదు గొల్యాతుతో తాను యుద్ధం చేస్తానన్నాడు. బక్కగా, పీలగా, ఇంకా లేత ప్రాయంలో ఉన్న దావీదు ఏ విధంగానూ గొల్యాతుకు సమఉజ్జీ కాదనుకున్నారంతా. అయితే తనతో దేవుడున్నాడన్న కొండంత విశ్వాసంతో, దావీదు అందరి అంచనాలను ముఖ్యంగా శత్రువుల అంచనాలను తలకిందులు చేస్తూ, వడిశెల రాయితో గొల్యాతును మట్టికరిపించి అతని కత్తితోనే అతని శిరచ్ఛేదనం చేశాడు, దేవుని ప్రజలకు గొప్పవిజయాన్ని అనూహ్యంగా సాధించి పెట్టాడు.

దేవుడెంత శక్తిమంతుడో, గొప్పవాడో ఇశ్రాయేలీయులందరికీ తమ పూర్వీకులు చెప్పిన విషయాల ద్వారా తెలిసినా, దేవుని బాహుబలం తమను కూడా నాటి యుద్ధంలో గెలిపిస్తుందన్న ‘ఆచరణాత్మక విశ్వాసం’లోకి వారు ఎదగలేకపోయారు. అయితే దేవుడు తనతో ఉండగా శత్రువుల బలం, మారణాయుధాలు, వీటన్నింటికీ అతీతమైన విజయం తన సొంతమని నమ్మిన ‘ఆచరణాత్మకవిశ్వాసం’తో దావీదు యుద్ధాన్ని గెలిపించాడు. 

నేలలో పడ్డ ఒక ‘ఆవగింజ’ అతి చిన్నదే అయినా, కొన్ని రోజుల్లోనే మట్టిపెళ్ళల్ని, రాతి కుప్పల్ని పెకిలించుకొని పైకొచ్చి వృక్షంగా ఎదుగుతుంది. ప్రతి విశ్వాసిలో కూడా దేవుడు నిక్షిప్తం చేసిన కార్యసాధక మహాశక్తి ఇది. ఆవగింజలోని ఈ శక్తి దేవుడిచ్చే తేమ, సూర్యరశ్మితో వృక్షరూపం దాల్చినట్టే, దేవుని సహవాసం, ప్రేమ, సాయం తోడైన మన విశ్వాసంతో మహాద్భుతాలు జరుగుతాయన్నది బైబిల్‌ చెప్పే గొప్ప సత్యం. మారణాయుధాలతో, కండబలంతో కాక, దేవుని పట్ల గల అచంచల విశ్వాసమనే మహాయుధంతోనే  వాటిపై విజయం సాధించగలమన్నది ఈ దావీదు ఉదంతం తెలిపే వెల లేని ఆత్మీయ పాఠం.
– రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్‌  

మరిన్ని వార్తలు