దాతృత్వం.. ప్రార్థన.. ఉపవాసం..

9 Feb, 2020 08:27 IST|Sakshi

సువార్త

రహస్యంగా సాగాలి!పాత నిబంధన కాలంలో దేవుడు తన న్యాయసంవిధాన సూత్రావళిగా మోషేకిచ్చిన పదాజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రానికి పొడిగింపుగా, కొత్తనిబంధన కాలపు విశ్వాసులకు కరదీపికగా, యేసుప్రభువే స్వయంగా ఆ ధర్మశాస్త్రానికిచ్చిన వినూత్నమైన భాష్యం ఆనాడు యేసుప్రభువు కొండమీది చేసిన ప్రసంగం!! ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అమలుపర్చడమే దేవుని ప్రసన్నుని చేసుకోగలిగిన ఏకైక మార్గమైతే, అది మానవమాత్రులకెంత అసాధ్యమో ధర్మశాస్త్రమే రుజువు చేస్తుంది. అత్యున్నతమైన ధర్మశాస్త్రపు పవిత్రతా స్థాయిని ప్రామాణికం చేసుకుంటే, ఈ లోకంలో అందరూ పాపులే అని నిర్వచిస్తుంది బైబిల్‌ (రోమా 3:23).  అందువల్ల కొత్తనిబంధన కాలపు విశ్వాస జీవితానికి యేసు ప్రభువు వారి కొండమీది ప్రసంగం పునాది లాంటిది. దేవుని మహిమ కోసం విశ్వాసి బాహాటంగా చెయ్యవలసిన అనేక విషయాలతోపాటు, దేవుని మహిమ కోసం, తన మేలుకోసం విశ్వాసి పరమ రహస్యంగా చేయవలసిన మూడు ప్రధానమైన అంశాలను కూడా యేసుప్రభువు తన కొండమీది ప్రసంగంలోనే ప్రకటించాడు.

విశ్వాసి మొదటిగా తన ‘దాన ధర్మాలను’, రెండవదిగా’ ప్రార్థనను’, మూడవదిగా తన ‘ఉపవాస దీక్ష’ను చాలా గుప్తంగా, రహస్యంగా చెయ్యాలని యేసుప్రభువు ఆదేశించాడు. ఇవి సలహాలు కాదు, ప్రభువిచ్చిన చాలా స్పష్టమైన ఆదేశాలు. అది తెలియకే, గోప్యత లోపించిన మన ప్రార్ధనలు, దానధర్మాలు, ఉపవాస దీక్షలు ఈనాడు బహిరంగ ప్రచార వేదికలయ్యాయి, వాటివల్ల బోలెడు పేరుప్రఖ్యాతులైతే వస్తాయేమో కాని వాటి అసలు ఫలాలు, ఆశీర్వాదాలు మాత్రం మనకు, మన కుటుంబాలకూ రావడం లేదు. విశ్వాసి ఇతరులకు ఒక చేతితో చేసే సహాయం మరో చేతికి తెలియకూడదని, అదంతా రహస్యంగా జరగాలని ప్రభువు ఆదేశించాడు. మనం మన పొరుగువారికి, పేదలకు చేసే సహాయం లేదా ధర్మం ఎంత రహస్యంగా ఉంటే దానివల్ల దేవుని ఆశీర్వాదాలు మనకు అంత ధారాళంగా ప్రతిఫలంగా లభిస్తాయి.

చర్చికి కానుకగా బెంచీలిచ్చి, వాటి వెనక తమ పేర్లు రాయించుకుంటే, ఆ పేర్లు ఈ లోకంలోనే ఉండిపోతాయి కానీ పరలోకంలో దేవుని జీవగ్రంథంలో మాత్రం రాయబడవన్నది తెలుసుకోవాలి. పేదలకు చేసే ధర్మం గురించి యేసు ఇలా చెప్పాడు కానీ దేవునికిచ్చే కానుకల గురించి కాదంటూ కొందరు పాస్టర్లు తమ స్వార్థం కోసం దీనికి వక్రభాష్యం చెబుతారు. ఒక పేద విధవరాలు గుప్తంగా ఇచ్చిన చిరుకానుకను ప్రభువెందుకు శ్లాఘించాడో అర్థమైతే, ఈ వాస్తవమేమిటో బోధపడుతుంది. ఇక ప్రార్థనయితే, గది తలుపు లేసుకొని మరీ రహస్యంగా చేయాలన్నది ప్రభువాదేశం.

కానీ ఆనాటి పరిసయ్యుల్లాగే, జీవితం లో ఎన్నడూ రహస్య ప్రార్థన చెయ్యని వారు కూడా మైకుల్లో సుదీర్ఘంగా ప్రార్థన చేసేందుకు ఉబలాట పడుతుంటారు. దేవుని సంబోధిస్తూ, దేవునికే చేసే మన ప్రార్థన అసలు ఇతరులెందుకు వినాలి? చర్చిల్లో ప్రార్థనలకు, కుటుంబ ప్రార్థనలకు అతీతమైనది, ఆశీర్వాదకరమైనది విశ్వాసి తన ప్రభువుతో ఏకాంతంగా చేసే రహస్య ప్రార్ధన. ఇదే బలమైన ప్రార్థనాజీవితమంటే!! పోతే అందరికీ తెలిసేలా ఉపవాస దీక్షలు చెయ్యడానికి కూడా తాను వ్యతిరేకమని, అదంతా వృథా ప్రయాస అని కూడా ప్రభువు స్పష్టం చేశాడు. ఈ మూడూ ఎంత రహస్యంగా చేస్తే అవి మనకంత ఆశీర్వాదకరమవుతాయి. అవెంత బహిరంగంగా చేస్తే, మనమంతటి వేషధారులమవుతాము. దేవుని ఆశీర్వాదాలు కావాలంటే, దేవుడు చెప్పినట్టు చేయాలి కదా... అలా కాకుండా మాకు తోచినట్టే చేస్తాం అంటే, ఎండమావుల్లో నీళ్లు వెదకడమే కాదా??
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌
 

మరిన్ని వార్తలు