మారువేషం వెయ్‌... నీళ్లల్లో దూకెయ్‌...

19 Dec, 2016 23:39 IST|Sakshi
మారువేషం వెయ్‌... నీళ్లల్లో దూకెయ్‌...

క్రిస్మస్‌

పండుగలు లేకపోతే జనం బోరుకొట్టి చస్తారు. పండుగలు బోరు కొట్టినా విసుక్కుని నీరసపడతారు. అందుకే ప్రతి పండుగను ఉత్సాహపూరితంగా నింపడానికి మనుషులు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. యూరప్‌ను చూడండి. అది క్రిస్మస్‌లో వెలిగిపోతుంది. ఏడాదికి ఒకసారి వచ్చే పండుగ. దానిని ఘనంగా జరుపుకోవడానికి ప్రతి అవకాశాన్ని తీసుకుంటారు. స్విట్జర్లాండ్‌వాళ్లయితే ఒక అడుగు ముందుకేసి ఒళ్లు ఒణికించే విశేషాలన్ని ఈ పండుగలో చేస్తారు. ఒణికించే అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే అక్కడ జరిగే పోటీ అలాంటిది. అక్కడి జెనీవాలో జెనీవా లేక్‌ అనేది ఒకటి ఉంది. ఈ సీజన్‌లో దాని ఉష్ణోగ్రత 6 లేదా 7 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. అలాంటి చల్లటి ఝిల్లటి నీళ్లలో వాళ్లు క్రిస్మస్‌ సందర్భంగా ఈత పోటీ పెట్టుకుంటారు.

దాదాపు 126 మీటర్ల పొడవున ఈ నీళ్లలో ఈది గెలిచిన వారు కప్పు అందుకుంటారు. ఆ కప్పు పేరు ‘కిస్మిస్‌ కప్‌’. అయితే ఉత్తినే ఈదడానికి పర్మిషన్‌ లేదు. ప్రతి ఒక్కరూ మారు వేషం వేసుకొని మరీ నీళ్లలో దూకాలి. ఈ పోటీలో పాల్గొనడానికి జనం ఉత్సాహంగా ముందుకు వస్తారు. చాలామంది ఒంటి మీద కేవలం లోదుస్తులు మాత్రమే ఉంచుకుని ముప్పావు వంతు నగ్నంగా నీళ్లలో దిగి ఈదుతారు. ఒళ్లు వణుకుతున్నా అందరితో కలిసి ఈదే ఆ పోటీ చాలా బాగుంటుందనే అందరి ఉవాచ. ఏమిటి వ్లా గొప్ప? మనవాళ్లు కూడా ఈ సీజన్‌లో మాలలు వేసి తెల్లవారే చల్లటి నదీ జలాల్లో స్నానం చేస్తారు కదా... ఉత్తరాదిన గంగా స్నానం చాలా సామాన్యమైనదే కదా అంటారా? మరదే. ఇక్కడి భక్తి ఇక్కడిది అక్కడి థ్రిల్‌ అక్కడిది. మనిషికి థ్రిల్‌ కావాలన్నది మాత్రం వాస్తవం అని ఈ ఫొటోలు చూస్తే తెలుస్తుంది.
 

మరిన్ని వార్తలు