సిగరెట్టుకు గొలుసుకట్టు

4 Oct, 2015 00:15 IST|Sakshi
సిగరెట్టుకు గొలుసుకట్టు

పీఛేముడ్

పొగాకుతో ‘చుట్ట’రికం మనుషులకు శతాబ్దాల కిందటే మొదలైనా, ఇరవయ్యో శతాబ్దంలో ఇది కొత్తపుంతలు తొక్కింది. పొగచుట్టలు నాజూకుదేరి సిగరెట్లుగా రూపాంతరం చెందాయి. ఇవి నవనాగరికతకు నిదర్శనాలుగా మారాయి. మన దేశంలో ఇంకా పొడవాటి లంక పొగాకు చుట్టలు రాజ్యమేలుతున్న కాలంలో పడమటి దేశాల్లో సిగరెట్ల ఫ్యాషన్ మొదలైంది. ఆడా మగా తేడా లేకుండా వాటిని ఊది పారేసేవారు. మరీ విచిత్రంగా అప్పటి వైద్యులు కూడా పొగతాగడం వల్ల చాలా జబ్బులు నయమవుతాయని చెప్పేవారు. సిగరెట్ తయారీ కంపెనీలు డాక్టర్ల సిఫారసులతో కూడిన ప్రకటనలు గుప్పించేవి.

ఫలితంగా ఆ కాలంలో పడమటి ప్రపంచంలో మెజారిటీ జనాభాకు పొగ పీల్చనిదే ఊపిరాడని పరిస్థితి దాపురించింది. కొందరు పొగరాయుళ్లు ఒక సిగరెట్టుతో తృప్తి పడేవారు కాదు. ఒకటి వెంట మరొకటి... వెనువెంటనే ముట్టించేవారు. వాళ్ల శ్వేతకాష్టదహన క్రతువుకు నిద్రపోయే సమయంలో మాత్రమే విరామం దొరికేది. అలాంటి పరిస్థితుల్లో గొలుసుకట్టు పొగరాయుళ్ల కోసం ఒక సాధనం అందుబాటులోకి వచ్చింది. ఒక ప్యాకెట్ సిగరెట్లను ఏకకాలంలో అందులో ఒకటొకటిగా దట్టించి, ముట్టించి ధూమమేఘాలను సృష్టించే పరికరం అరచేతుల్లోకి చేరింది. ఆ పరికరమే ఈ ఫొటోలో కనిపిస్తున్న సిగరెట్ హోల్డర్. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అనే ప్రచారం మొదలవడంతో ఈ పరికరం ప్రాచుర్యం పొందక ముందే అంతరించింది.

 

మరిన్ని వార్తలు