గర్భవతికి చికెన్‌పాక్స్ సోకితే..?

3 Oct, 2013 23:38 IST|Sakshi
గర్భవతికి చికెన్‌పాక్స్ సోకితే..?

సాధారణంగా గర్భవతులకు చికెన్‌పాక్స్ సోకినా దాని కారణంగా గర్భస్రావం కావడం అన్నది చాలా అరుదు. అయితే చికెన్‌పాక్స్ ప్రభావం కడపులోని బిడ్డపై ఎలా ఉంటుందన్నది గర్భవతికి ఏ నెల అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. అయితే చికెన్‌పాక్స్ సోకిన గర్భవతులు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. గర్భవతులకు చికెన్‌పాక్స్ సోకినట్లయితే వారి ప్రెగ్నెన్సీలోని 12వ వారం, 16వ వారం, 20వ వారం, 24వ వారాల్లో నిపుణుల చేత పరీక్ష చేయించుకుని, బిడ్డపై ఎలాంటి ప్రభావాలు లేవని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండవచ్చు. ఏడు నెలల గర్భంతో(అంటే 28 వారాల ప్రెగ్నెన్సీ) ఉన్నవారికి చికెన్‌పాక్స్ సోకితే దాని ప్రభావం కడుపులోని బిడ్డపైనా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ. చికెన్‌పాక్స్ కారణంగా బిడ్డలో కళ్లు, కాళ్లు, భుజాలు (ఆర్మ్స్), మెదడు, బ్లాడర్, ెపేగులు (బవెల్) వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అయితే ఇలాంటి అవకాశం చాలా అరుదు. దాదాపు నూరు కేసుల్లో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంది.
 
 ఒకవేళ గర్భవతికి 7వ నెల నుంచి 9వ నెల మధ్యకాలంలో చికెన్‌పాక్స్ సోకితే అప్పుడు పుట్టబోయే బిడ్డలో కూడా చికెన్‌పాక్స్ వైరస్ ఉంటుంది. కానీ ఆ వైరస్ తాలూకు ఎలాంటి ప్రభావాలూ బిడ్డపై పడవు. కాకపోతే బిడ్డ కాస్త బరువు తక్కువగా పుట్టవచ్చు. ఇక 36 వారాల ప్రెగ్నెన్సీలో (అంటే... 9 నెలలు నిండాక, ప్రసవానికి దగ్గరగా) గర్భవతికి చికెన్‌పాక్స్ సోకితే... పుట్టిన తర్వాత బిడ్డకూ సోకిందేమోనంటూ దాదాపు 28 రోజుల వరకు పరిశీలించాలి. ఒకవేళ సోకి ఉంటే బిడ్డకు కూడా చికెన్‌పాక్స్ చికిత్స అందించాలి. అయితే బిడ్డకు తల్లిపాలు పట్టడానికి ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు ఉండవు. నిర్భయంగా పట్టవచ్చు.
 
 ఇక చికెన్‌పాక్స్ వచ్చిన తల్లికి జ్వరం, నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఆ సమయంలో తల్లికి యాంటీవైరల్ మందులను ఇస్తారు. అయితే చికెన్‌పాక్స్ అన్నది ఒకరి నుంచి మరొకరికి తేలిగ్గా సంక్రమించే వ్యాధి కాబట్టి ఒకవేళ ఇది సోకినప్పుడు మనమే స్వచ్ఛందంగా మిగతా గర్భవతులు, బిడ్డ తల్లుల వంటి వారి దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవడం అన్నది మనందరి సామాజిక బాధ్యత.  
 
 డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
 ఫెర్నాండజ్ హాస్పిటల్,  హైదరాబాద్

 

మరిన్ని వార్తలు