చిన్నబాబుకు తరచూ కడుపునొప్పి, వికారం

2 Sep, 2013 23:24 IST|Sakshi
చిన్నబాబుకు తరచూ కడుపునొప్పి, వికారం

 నా మనవడి వయసు ఐదేళ్లు. తరచూ కడుపునొప్పి వస్తోంది. అప్పుడప్పుడూ ఏదైనా తినే ముందు వాంతి కాబోతున్నట్లుగా ఉందంటాడు. పొట్టకు స్కానింగ్, రక్త, మలమూత్ర పరీక్షలు చేసి, అన్నీ నార్మల్‌గానే ఉన్నాయన్నారు. బరువు 22 కిలోలున్నాడు. అతడి సమస్యకు ఆయుర్వేదంలో పరిష్కారం తెలియజేయ ప్రార్థన.
 - చంద్రశేఖర్‌రావు, హైదరాబాద్

 
సాధారణంగా ఈ వయసున్న పిల్లలకు పొట్టలో నులిపురుగులుండటం వల్ల ఈ లక్షణాలు కలగవచ్చు. అమీబియాసిస్, ఇతరత్రా డిసెంటరీ వికారాలుంటే మలంలో బంక, చీము, నెత్తురు వస్తుంటాయి. ఇన్వెస్టిగేషన్ ఫలితాలన్నీ సక్రమంగానే ఉన్నాయంటే, పొట్టలోని అవయవాల రచన, క్రియావిశేషాలన్నీ సక్రమంగా ఉన్నాయని అర్థమవుతోంది. మరో ముఖ్యాంశం ఏమిటంటే ఈ వయసులోనూ పిల్లల్లో మానసిక ఒత్తిడి సాధారణమైపోయింది. ఇల్లు, స్కూలు, ఇతర వాతావరణాలలో పిల్లలు కలిసిమెలిసే సమయాలలో ఎంతో కొంత ఆందోళన సహజం.

ఇటీవలి కాలంలో వీడియోగేమ్స్, హారర్ ఆటల వల్ల కూడా వ్యతిరేక ప్రేరణాప్రభావం పడుతోంది. ఇలాంటి సమయాల్లో తల్లిదండ్రుల లేదా ఇతర సంరక్షకుల మనసును, ప్రేమను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా పిల్లల్లో యాంత్రికంగా  కొన్ని లక్షణాలు ఉత్పన్నమవుతాయి. కడుపునొప్పి, వాంతి భ్రాంతి వంటివి అందులో భాగమే. ఇది పిల్లలు కృత్రిమంగా చేస్తున్న ‘నటన’ అనుకుంటే పొరపాటు. ఈ లక్షణాలను పిల్లలు నిజంగానే ‘ఫీల్’ అవుతుంటారు. కారణాన్ని తొలగించడం చికిత్సలోని ప్రధానాంశం. బాబు బరువు, వయసును బట్టి చూస్తే బరువు సక్రమంగానే ఉంది. కాబట్టి పోషక విలువల లోపమేమీ లేదన్నమాట. అయినప్పటికీ ఈ కింది సూచనలను పాటించండి. రెండుమూడు నెలల్లో చక్కటి ఫలితం కనిపిస్తుంది.
 
 ఆహారం:
బయటి ఆహారం నుంచి అంటే చాకొలేట్లు, ఐస్‌క్రీములు, శీతలపానీయాల నుంచి దూరంగా ఉంచండి. కాలానుగుణంగా పండ్లు, పండ్లరసాలు, ఖర్జూరం, జీడిపప్పు వంటి పోషకాహారం తినేటట్లు చూడండి. పాలు, పెరుగు, మజ్జిగ, పాయసాలు తగు ప్రమాణంలో ఇవ్వండి. మనం అనుకున్న సమయాల్లో మనం ఊహించిన పరిమాణాలలో పిల్లలు ఆహారాన్ని సేవించరు. అంటే వారు ఆహారం లేక నీరసపడిపోతున్నారనుకోవడం పొరపాటు.

వారి శారీరక, మానసిక వికాసాలకు అనుగుణంగా చేష్టలు, బరువు, పొడవు సరిగా ఉంటే పోషకాహార లోపం లేదని భావించాలి. వంటలలో శాకపాకాల్ని రోజురోజూ మారుస్తుంటే అన్నిరకాల పోషకవిలువలూ అవే అందుతాయి. పిల్లలకు కూడా అన్నిరకాలు తినాలనే భావన అలవడుతుంది. బలవంతంగా ఏదీ తినిపించవద్దు. వారికి ఏం చెప్పినా ఆప్యాయతతో వివరించి నచ్చజెప్పాలి. మన సంభాషణలన్నీ పిల్లల చెవిన పడతాయని మరచిపోవద్దు. కాబట్టి నీతిబద్ధమైన, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అంశాలనే వారి దగ్గర సంభాషించుకోవడం మంచిది.
 
విహారం:
విశ్రాంతి, నిద్ర, ఆహారసేవన, వీటితోపాటు సమయపాలన చాలా ముఖ్యం. ఇతర సమవయస్కులతో కలిసి బయట ఆటలు ఆడుకునే అవకాశముంటే దానికి కూడా ప్రాధాన్యతనివ్వాలి. యోగాసనాలు అలవాటు చేయిస్తే, ఇది భవిష్యత్తులో ఆరోగ్యానికి చక్కటి పునాది అవుతుంది.
 
 మందులు :
ఊ విడంగారిష్ట మరియు అరవిందాసవ ద్రావకాల్ని ఒక్కొక్క చెంచా ఒక గ్లాసులో పోసి, సమానంగా నీరు కలిపి రెండుపూటలా తాగించండి.


 ఊ మెంటాట్ (సిరప్) : ఉదయం 1 చెంచా, రాత్రి1 చెంచా.
 
 ఊ గృహవైద్యం: వాము, సోంపు (పచ్చివి) సమానంగా తీసుకొని, పొడిచేసి పెట్టుకోండి. పావుచెంచా (సుమారు రెండు గ్రాముల) పొడిని తేనెతో రోజుకొకసారి తినిపించండి. ఆకలి, అరుగుదల, శోషణ క్రియలు చక్కబడతాయి. ఇది ఎంతకాలమైనా వాడుకోవచ్చు.
 
 డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
 అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
 సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
 హుమయున్ నగర్, హైదరాబాద్

మరిన్ని వార్తలు