మంచుకొండలలో...భక్తిధామాలు

5 Jun, 2014 22:36 IST|Sakshi
మంచుకొండలలో...భక్తిధామాలు

మంచు దుప్పటి కప్పుకున్న హిమగిరులు భానుని కిరణాల స్పర్శతో మేలుకునే వేళ... వడివడిగా ఉరకలెత్తే నదీ నదాలు కొండల మీదుగా దుమికే వేళ... ఆ లోయలలోని సౌందర్యాలను కనుల నిండుగా నింపుకోవాల్సిందే!  భక్తికి, ముక్తికి సోపానమయ్యే హరిహరాదుల ఆలయ సందర్శన వేళ...  అడుగడుగునా ఆధ్యాత్మికత సౌరభాలు ప్రతి మదినీ తాకుతున్న వేళ... ఆ ఆనందాన్ని మది నిండుగా నింపుకోవాల్సిందే!
 
చార్‌ధామ్... జీవిత కాలంలో ఒక్కసారైనా చేసితీరాలని ప్రతి హిందువూ కోరుకునే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బదరీనాథ్‌లను దర్శించుకొని, తరించాలని తపించే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైనదైనా ప్రకృతి సోయగాలలో ప్రశాంతతను  పొందాలని ఆకాక్షించే యాత్ర. మే నెల నుంచి నవంబర్ వరకు అనుమతించే ఈ యాత్రకు కిందటి నెలలోనే సింహద్వారాలను తెరిచింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. వైశాఖమాసం శుక్లపక్షం అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు. మరో రెండు ప్రసిద్ధ దేవస్థానాలైన కేదార్‌నాథ్, బదరీనాథ్‌లను కూడా కిందటి నెల 4, 5 తేదీల్లో తెరిచి, పూజలు నిర్వహించారు. అధికారులు, పోలీసుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
 
నిరుడు ప్రకృతి విపత్తు మూలంగా చార్‌ధామ్ యాత్ర పర్యాటకులకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఆ విషాదం నుంచి తేరుకొని, తిరిగి యథావిధిగా యాత్రకు ముమ్మర ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. స్వచ్ఛంద సంస్థలు సైతం యాత్రికులకు సౌకర్యాల కోసం కృషి చేస్తున్నాయి. గత ఏడాది విపత్తు ఎలా జరిగింది? ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి చర్యలు చేపట్టింది? అనే ఉత్సుకతతోనూ, ప్రకృతి రామణీయకతను ఎద నిండా నింపుకోవడానికి వేల సంఖ్యలో ఈ యాత్రకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ నాలుగు ధామాల గురించిన సమాచారం తప్పక తెలుసుకోవాలి.
 
ఉత్తరకాశీ నుంచి ఈ యాత్ర యమునోత్రితో ప్రారంభమై గంగోత్రి, కేదార్‌నాథ్ మీదుగా వెళ్లి బదరీనాథ్‌తో పూర్తవుతుంది. చాలామంది హరిద్వార్‌తో ఈ యాత్రను ప్రారంభిస్తారు. మన రాష్ట్రం నుంచి చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఢిల్లీ నుంచి లేదా రిషీకేశ్ నుంచి బయల్దేరవచ్చు. ఇందుకు పర్యాటకరంగం ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. ప్రైవేటు టూరిస్టులు కూడా తమ సర్వీసులను నడుపుతున్నారు.
 
ముందుగా యమునోత్రి..

ఉత్తరాఖండ్ గర్హ్వాల్‌లో ఉన్న యమునోత్రికి డెహ్రాడూన్ మీదుగా వెళ్లాలి. యమునోత్రి సముద్రమట్టానికి 3164 మీటర్ల ఎత్తులో ఉంది. ఉత్తరకాశికి 30 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయం మరో 7 కి.మీ దూరంలో ఉందనగా జానకీ చట్టి అనే ప్రాంతం దగ్గర వాహనాలు నిలుపుతారు. ఇక్కడ నుంచి కాలినడకన లేదా గుర్రం మీద లేదా డోలీలో గానీ వెళ్లాల్సి ఉంటుంది. ఉష్ణం, చలితో కూడిన మధ్యస్థమైన వాతావరణం ఇక్కడ ప్రత్యేకత. యమునోత్రి నుంచి 130 కి.మీ ప్రయాణిస్తే గంగోత్రి చేరుకోవచ్చు.
 
తదుపరి గంగోత్రి...

 
గంగోత్రి సముద్రమట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వతాల మధ్యన ఉంటుంది. ఇక్కడ గంగను హిమనీనదంగా పిలుస్తారు. ఇక్కడ గంగమ్మ తల్లి దర్శనం చేసుకొని17 కి.మీ దూరం కాలినడకన వెళ్తే గోముఖం ఉంటుంది. ఇక్కడే గంగామాతను భగీరథిగా పేర్కొంటారు. ఇక్కడ నుంచి అలకనందా నదితో కలిసిన చోటు నుంచి గంగానదిగా పిలుస్తారు.
 
జ్యోతిర్లంగం... కేదార్‌నాథ్

 
ఉత్తరకాశీ నుంచి తెహ్రీ డ్యామ్ మీదుగా గౌరీకుండ్‌కు చేరుకొని, అక్కడి నుంచి 14 కి.మీ దూరం కాలినడకన, గుర్రం లేదా డోలీలో కేదార్‌నాథ్ చేరుకోవచ్చు. శివుడి పన్నెండో జ్యోతిర్లంగం ఉన్న మందిరమే కేదార్‌నాథ్. హిమాలయ పర్వత శ్రేణులలో సముద్రమట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో మూడు కొండల మధ్య వెలసింది ఈ ఆలయం. మూడు కొండల నుంచి మూడు నదులు కిందికి వచ్చి కలిసిపోయి ఒకే నదిగా మారిపోయే దృశ్యం చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది. మందాకినీ నది ఒడ్డున వెలసిన కేదార్‌నాథ్ ఆలయం అత్యంత చీకటిగా ఉంటుంది. దీపం వెలుగులోనే శివుడి దర్శనం లభిస్తుంది. ఈ ఆలయంలో పాండవులతో పాటు ద్రౌపది విగ్రహం కూడా ఉంది. కేదార్‌నాథ్ దగ్గర దాదాపు వెయ్యి మంది యాత్రికులు ఇక్కడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. లించోలిలో హెలిప్యాడ్‌తో పాటు బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. కేదార్‌నాథ్ నుంచి 75 కి.మీ కిందకు దిగి, అక్కడ నుంచి బద్రీనాథ్ ఆలయం చేరుకోవడానికి హిమాలయాల పైకి వెళ్లాలి.
 
రేగుపండు... బదరీనాథ్...
 
కేదార్‌నాథ్ నుంచి బదరీనాథ్ ఆలయానికి 203 కి.మీ దూరం ఉంటుంది. ఆదిశంకరాచార్యులచే స్థాపించబడి అభివృద్ధి చెందిన వైష్ణవ దేవాలయం ఇది. సముద్రమట్టానికి 3,415 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బదరీ అంటే రేగుపండు. నాథ్ అంటే దేవుడు. ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వల్ల ఇక్కడ వెలసిన దేవునికి బదరీనాథుడు అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రంలో అన్ని తీర్థాల సమస్త దేవతలు నివసిస్తారని హిందువుల నమ్మకం. చైనా, టిబెట్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో అలకనందా నది ఒడ్డున, గఢ్వాల్ కొండలలో కేదార్‌నాథ్‌కు రెండు రోజుల ప్రయాణ దూరంలో ఉంది బదరీనాథ్ ఆలయం. హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్‌ధామ్‌లలో ఇది మొదటిది. బదరీనాథ్ మార్గంలో హిమాలయాల మధ్య ఓ అందమైన పూలవనం ఉంది. దీన్నే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. జోషీ మఠ్, అలకనందా నదిపై జలవిద్యుత్ కేంద్రం చూడదగ్గ ప్రదేశాలు.

పటిష్ఠమైన భద్రత మధ్య ప్రయాణం
 
పది డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత హిమాలయపర్వత శ్రేణులలో నమోదవుతుంది. యాత్ర మధ్యలో ఒక్కోసారి కొన్ని గంటల పాటు ప్రయాణానికి వీలుపడదు. అకస్మాత్తుగా అనారోగ్యసమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం ఈసారి పటిష్టమైన చర్యలను చేపట్టింది. ప్రయాణికుల అనారోగ్య సమస్యలను తీర్చడానికి  మార్గమధ్యంలో ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేసింది. బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ద్వారా భక్తుల వివరాలను నమోదు చేస్తున్నారు. వాతావరణ హెచ్చరికలు వారికి ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్ల ద్వారా సమాచారం అందేలా జాగ్రత్తలు తీసుకున్నది. ఇటీవల యాత్ర మొదలైన రెండు రోజులకే మంచు చరియలు విరిగిపడి కొన్ని రోజులు యాత్రను నిలిపివేయాల్సి వచ్చింది. వెంటనే మరిన్ని రక్షణ చర్యలను తీసుకొని యాత్రను పునరుద్ధరించారు.  
 
చార్‌ధామ్ యాత్రను సఫలం చేయడానికి గౌరీకుండ్, కాశీపూర్, రుద్రపూర్, భవాలీ, నైనిటాల్, హల్ద్వానీ డివిజన్లలో వందలాది మంది గాంగ్‌మెన్లు, కూలీలు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. శ్రామికులతో పాటు రోలర్, టిప్పర్ మిషన్లను ఉపయోగిస్తున్నారు. కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లేదారిలో స్వచ్చంద సంస్థలు వెయ్యిమంది యాత్రికులకు సరిపడా భోజనవసతి కల్పించడానికి ముందుకు వచ్చాయి.
 
హిమాలయ ప్రాంతాల్లో వర్షం, మంచు కురియడం వల్ల ఎప్పుడైనా రోడ్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున అధికారులు, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
 
వెంట ఇవి తప్పనిసరి
 యాత్రికులు తమ వెంట అవసరమైన మందులు, బ్లాంకెట్స్, స్వెటర్, మంకీ క్యాప్, మఫ్లర్, శాలువా, రెయిన్‌కోట్, స్పోర్ట్ షూస్, టార్చ్‌లైట్.. తీసుకెళ్లాలి.     
- సాక్షి విహారి
 
టూరు ప్యాకేజీ వివరాలు...

స్వర్గధామంగా పేర్కొనే చార్‌ధామ్ యాత్రకు మన రాష్ట్రం నుంచి వెళ్లే యాత్రికులు ఢిల్లీ, రిషీకేష్ నుంచి బయల్దేరవచ్చు. ఇందుకోసం పర్యాటకరంగం టూర్‌ప్యాకేజీలను అందిస్తోంది. రిషీకేష్ నుంచి యమునోత్రి -గంగోత్రి- కేదార్‌నాథ్ - బద్రీనాథ్ వెళ్లి... తిరిగి రిషీకేష్ చేరుకోవడానికి 10 రోజుల యాత్రకు...
     
మే-జూన్ వరకు గాను ఒక్కొక్కరికి పెద్దలకు
     
రూ.16280/-, పిల్లలకు రూ.15600/-,
     
వృద్ధులకు రూ.15260/- చెల్లించాల్సి ఉంటుంది.
     
జూలై - నవంబర్ యాత్రకు పెద్దలకు రూ.14670/-,
     
పిల్లలకు రూ.14050/-, వృద్ధులకు రూ.13750/- చెల్లించాలి.
 
మరిన్ని వివరాలకు: బాలయోగి పర్యాటక భవన్, బేగంపేట్, హైదరాబాద్, ఫోన్ నెంబర్: 040-23409945, 23400254, మొబైల్ నెం: 09493982645, email: gmvnhyderabad@gmail.com లలో సంప్రదించవచ్చు.
 
 ప్రకృతి రామణీయకత...


వేసవిలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది కనుక వేడికి హిమపాతం తగ్గుముఖం పడుతుంది. దీంతో కొండలు, లోయలు, చెట్లు, నదులు, ప్రవాహాలు.. అడుగడుగునా మనల్ని ఆహ్లాదంలో ముంచెత్తుతాయి. ప్రకృతి ప్రేమికులు ఈ యాత్రను ఎంతగానో ఆనందించవచ్చు. ఇందుకోసమే ఎందరో విదేశీయాత్రికులు ప్రతియేటా చార్‌ధామ్ యాత్రకు వస్తుంటారు.
 

మరిన్ని వార్తలు