మట్టి పడవలో ప్రయాణం...

2 Jan, 2015 00:16 IST|Sakshi
మట్టి పడవలో ప్రయాణం...

దేవదేవుని మహాస్వరం ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు గొంతులో ఈ లోకంలో ప్రతిధ్వనించింది. గొర్రెలు తమ కాపరి స్వరాన్ని గుర్తించినట్టే, విశ్వాసులు కూడా తన స్వరాన్ని గుర్తిస్తారని ప్రభువు చెప్పాడు (యోహాను 10:4). పది నెలల పసిపాప కూడా ఎంతమందిలోనైనా తన తల్లిదండ్రుల స్వరాన్ని గుర్తించి వారివైపు తన చేతులు చాపుతుంది. ప్రతిరోజూ వింటున్న ఆ స్వరాలు ఆమెకు సుపరిచితమవుతాయి. లోకం తాలూకు రణగొణ ధ్వనులు, కీచులాటలు, వాగ్వాదాలు, శబ్దాలహోరులో దేవుని మృదువైన స్వరం మనిషి చెవులకు సోకడం కొంత కష్టమే! అయితే దేవునితో చేసే నిరంతర సహవాసంలో ఆయన స్వరం సుపరిచితమవుతుంది. కాపరి తన గొర్రెలను మేపుతాడు, దారి చూపిస్తాడు. క్రూర మృగాల నుండి వాటిని కాపాడుతాడు.తిరుగుబాటుతత్వం, చపలత్వం, అవిధేయతతో నిండిన మనిషికి కూడా దేవునితో పోటీ, మార్గదర్శకత్వం, భద్రత, క్షమాపణ, దొరుకుతాయి.

 అంతరిక్షాన్నే గెలిచినవారు అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడం, నన్ను నేను సంస్మరించుకోవడం ఒక లెక్కా! అన్నది మనిషి ధీమా. అయితే అది మట్టి పడవలో అవతలి తీరానికి చేరాలనుకోవడమే! తనను తాను కాపాడుకోలేని మట్టి పడవ మనల్ని గమ్యం చేర్చుతుందా? ఎంతసేపు ‘అపరిశుద్ధం’ కావడానికే ఆరాటపడే ఆంతర్యాన్ని శుద్ధిచేసి మార్చగల శక్తి అతని సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే ఉంది. అలా బాహ్య శక్తి మాత్రమే అతన్ని దారికి తేగలదు. దేవున్ని లోతుగా జీవితాల్లో ప్రతిష్టించుకొని ఆయన స్వరం వింటూ విధేయత చూపడమొక్కటే తరుణోపాయం. కనీసం కొత్త ఏడాదిలోనైనా ఆయన స్వరం వినేందుకు అభ్యాసం చేద్దాం. దేవుని ఆశీర్వాదాలకు, శాంతి సమాధానాలకు ఆవిధంగా చేరువవుదాం.
 - రెవ. టి.ఎ. ప్రభుకిరణ్
 
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా