పేదబతుకు పెద్దమనసు

25 Nov, 2013 23:48 IST|Sakshi

అవసరంలో ఉన్నవారికి సాయం చేయడానికి చేతినిండా డబ్బు ఉండాల్సిన పనిలేదు... సహాయపడాలనే గుణం ఉంటే చాలని నిరూపిస్తున్నారు చెప్పులు కుట్టుకుని జీవించే చాట్ల వెంకటరత్నం. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి అతనిది. అయితేనేం... తోటివారికి సాయం అందించడంలో తన పేదరికాన్ని జయించాడు.
 
నెల్లూరు నగరంలోని ప్రధాన రహదారి... ఆ రహదారి పక్కగా విద్యుత్‌భవన్ కార్యాలయం. ఆ ప్రహరీగోడకు ఆనుకుని చిన్న పాక. అందులో చెప్పులు కుడుతున్న ఓ వ్యక్తి... అతడే వెంకటరత్నం. అక్కడ చెప్పులు కుట్టించుకున్న ప్రతిఒక్కరికీ వెంకటరత్నం దయాగుణం ఇట్టే అర్థమైపోతుంది. ఆ పాకకు తగిలించిన చిన్న బోర్డు మీద ‘అనాధ బాలబాలికలకు, వికలాంగులకు, కుష్టువారికి, అంధులకు ఉచితంగా చెప్పులు, గొడుగు లు కుట్టి ఇవ్వబడును’ అని ఉంటుంది.

ఇది బోర్డు మీద ప్రకటించి చేసే సేవ. బోర్డు మీద రాయకుండానే ఇంకా విస్తృతంగా సేవలందిస్తున్నాడు వెంకటరత్నం. సంక్షేమ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా చెప్పులు, బ్యాగులు కుట్టిస్తాడు. సంపన్నులు వాడి వదిలేసిన చెప్పులు, బ్యాగులు, గొడుగులను సేకరించి వాటికి సొంతఖర్చులతో మరమ్మతులు చేసి పేద విద్యార్థులకు ఉచితంగా ఇస్తాడు. చిత్తు కాగితాలు ఏరుకునే వారి దగ్గర నుంచి చెప్పులను ఏదో ఒక ధరకు కొని తనకు చేతనైనంత బాగుచేసి అభాగ్యులకు ఉచితంగా ఇస్తాడు. ‘నీకే తినడానికి దిక్కు లేదు... మీసాలకు సంపెంగనూనె ఎందుకు’ అని ఎవరైనా  మందలించబోతే... అందుకు మౌనమే అతని సమాధానం.

 అనుభవమే దారిచూపింది...

 వెంకటరత్నం తండ్రి వెంకటగిరిలో చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగించేవాడు. వెంకటరత్నం అదే ఊళ్లోని సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో ఉండి పదోతరగతి వరకు చదువుకున్నాడు. తనతో పాటు చదువుకుంటున్న స్నేహితుల బాధలను కళ్లారా చూశాడు. పిల్లల తల్లిదండ్రులు చేతిఖర్చులకు ఇచ్చే రూపాయి, అర్ధరూపాయి ఆ పిల్లలకు ఒక్కరోజుకు కూడా వచ్చేవి కావు. ఈ సమయంలో వారి బ్యాగులు, చెప్పులు తెగిపోతే ‘మా నాన్న దగ్గర కుట్టిస్తాను’ అంటూ వాళ్ల చెప్పులను తన తండ్రి దగ్గర కుట్టించేవాడు. హఠాత్తుగా తండ్రి మరణించడంతో కుటుంబ భారం వెంకటరత్నం మీద పడింది. నెల్లూరు నగరానికి వచ్చి చెప్పులు కుట్టే దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి నుంచి హాస్టల్స్‌లో ఉండే విద్యార్థుల బ్యాగులు, చెప్పులను ఉచితంగా కుట్టి ఇవ్వసాగాడు.
 
పూటగడవడమూ కష్టమే...


 రైల్వేట్రాక్ సమీపంలో ఓ పూరిపాక వెంకటరత్నం నివాసం. ఇతడికి ఆరుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు అబ్బాయిలు. ముగ్గురికి పెళ్లి చేశాడు. పెళ్లి అయిన వారిలో కొడుకు, కూతురు చనిపోయారు. మరో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పెళ్లి వయస్సుకు వచ్చారు. రత్నం భార్య, కూతురు నగర డీఎస్పీ కార్యాలయంలో స్వీపర్లు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి వచ్చే జీతం కుటుంబపోషణకు సరిపోదు. ఈ స్థితిలో కూడా కుటుంబసభ్యులు రత్నానికి సహకారం అందిస్తున్నారు.
 
నలుగురికీ సేవచేయాలనే ఆలోచన, నిండు గా ఉన్న జేబుకి కలిగితే, ఆ సహాయం మెండుగా ఉంటుందేమో! అదేే ఆలోచన మనసులో కలిగితే అది కలకాలం కొనసాగుతుంది. అందుకు వెంకటరత్నం చేస్తున్న సేవే నిదర్శనం.
 - కారణి మురళీకృష్ణపిళై ్ల
 న్యూస్‌లైన్, నెల్లూరు
 ఫొటోలు: ఆవుల కమలాకర్

మరిన్ని వార్తలు