జలుబు మంచిదే...

23 Mar, 2018 00:34 IST|Sakshi

జలుబు చేసి తుమ్మితే.. ‘‘శతమానం భవతి’’ అని పెద్దవాళ్లు దీవించేవారు గుర్తుందా? ఏదో పెద్దల చాదస్తం అని అనుకునేవారు. అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగ్‌హామ్‌ శాస్త్రవేత్తలు. జలుబు చేసినప్పుడు శరీరం లోపల ఉష్ణోగ్రతలు తగ్గిపోయి కణస్థాయిలో మంచి కొవ్వు ఉత్పత్తి వేగం అందుకుంటుందని వీరు అంటున్నారు. శరీరంలో కొవ్వు తయారీ ముందుగా నిర్దేశించిన ప్రకారం కాకుండా పరిస్థితికి తగ్గట్టుగా జరుగుతుందని తమ అధ్యయనం చెబుతోందని, మధుమేహం తదితర వ్యాధులను మరింత మెరుగ్గా నియంత్రించేందుకు ఇది ఉపయోగపడుతుందని డాక్టర్‌ వర్జినీ సొటిల్‌ తెలిపారు.

ఏ రకమైన కొవ్వు ఉత్పత్తి చేయాలో శరీరం ఎలా నిర్ణయిస్తుందో తెలుసుకునేందుకు తాము అధ్యయనం చేపట్టామని చెప్పారు. ఎముక మజ్జ తాలూకూ మూల కణాలతో తాము ప్రయోగాలు చేయగా.. పరిసరాల్లోని ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల కంటే తక్కువైనప్పుడు మంచి కొవ్వు ఉత్పత్తి మొదలైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కణాల్లో ఉష్ణోగ్రతలకు స్పందించే వ్యవస్థ ఏమిటో గుర్తించగలిగితే దాని ఆధారంగా భవిష్యత్తులో మధుమేహానికి సరికొత్త మందులు తయారు చేయడం వీలవుతుందని సొటిల్‌ తెలిపారు. ఈ మందులు వేసుకుంటే మంచి కొలెస్ట్రాల్‌ ఎక్కువవుతుందని, తద్వారా రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులను కూడా నియంత్రించవచ్చునని సొటిల్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు