చొరవ చూపండి సమానత్వం వస్తుంది

20 Mar, 2019 00:34 IST|Sakshi

స్త్రీ శక్తి

మహిళలు తమ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకుని లబ్ధి పొందడానికి మాత్రమే పరిమితం కాకుండా, అభివృద్ధిని సాధించడానికీ చొరవ చూపాలని దివ్య దేవరాజన్‌ పిలుపునిస్తున్నారు. 

ఏడాది క్రితం బదిలీపై ఆదిలాబాద్‌ జిల్లాకు వచ్చిన కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ మహిళా సాధికారత, మహిళల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఆదివాసీ – లంబాడాల మధ్య నెలకొన్న వివాదాలను సద్దు మణిగించేందుకు ప్రభుత్వం దివ్యను ఆదిలాబాద్‌కు బదిలీ చేసింది. వివాదాలను తొలగించడమే కాదు, ఇరువర్గాలకున్న సమస్యలను దగ్గరుండి తెలుసుకొని పరిష్కరించడంలో ఆమె సఫలమయ్యారు. దివ్యకు ఆదివాసీలు మాట్లాడే భాష అర్థమైనా, తిరిగి వారికి అదే భాషలో విషయాన్ని వివరించేందుకు మొదట్లో కాస్త ఇబ్బంది పడినమాట వాస్తవమే. అయితే ఆ క్రమంలో గోండు భాష నేర్చుకున్నారు. అలా ఆదివాసీ మహిళలతో వారి భాషలోనే మాట్లాడి అంతర్గతంగా ఉన్న సమస్యలను తెలుసుకోవడంతో మహిళలకున్న సమస్యలను పరిష్కరించేందుకు మార్గం సులువైంది.

మరోవైపు ఈ యేడాది ఏజెన్సీ ఏరియాలో మహిళా సంఘాల ద్వారా కలెక్టర్‌ పత్తి కొనుగోళ్లు జరిపించారు. మహిళలు అన్ని రంగాల్లోనూ  రాణించాలంటే భయాలను పక్కనపెట్టి చొరవగా ముందడుగు వేస్తేనే ఫలితం ఉంటుందని, గౌరవం దక్కుతుందని కలెక్టర్‌ దివ్య అంటున్నారు. ‘‘మహిళల మనసు సున్నితం. కరుణ, జాలి ఎక్కువగా ఉంటాయి. అలాగే మహిళల్లో బిడియం, భయం కూడా ఉంటాయి. వాటిని పక్కనపెట్టి మనోబలంతో ముందడుగు వేయాలి. అప్పుడే సమాజంలో మహిళలకు సమాన గుర్తింపు లభిస్తుంది.

మహిళలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు జీడీపీ (స్థూలజాతీయోత్పత్తి) కూడా పెరుగుతుంది. అలా దేశాభివృద్ధి కూడా జరుగుతుంది. తమ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. జిల్లాలో సగం మంది మహిళలు సర్పంచులుగా ఉన్నారు. భర్త సహకారంతోనో, బంధువుల ద్వారానో కాకుండా స్వయంగా వారే విధులను నిర్వహించాలి. మహిళా సర్పంచులు ఉన్న అనేక గ్రామాలు  ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం చూశాను’’ అని దివ్య దేవరాజన్‌ అన్నారు.   
– సాక్షి, ఆదిలాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు