కాంబినేషన్ కీమోథెరపీతో క్యాన్సర్‌కు చికిత్స!

2 Jun, 2016 23:44 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్
నా వయసు 52 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. మందులు వాడుతున్నంత కాలం బాగానే ఉన్నా అవి ఆపేస్తే మాత్రం మళ్లీ నొప్పి వస్తోంది. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా?  - వీరారెడ్డి, ఖమ్మం

వయసు పెరగడం వల్ల వచ్చే మెడ నొప్పికి పూర్తి పరిష్కారం లభించదని చాలామంది అనుకుంటుంటారు. కానీ హోమియో చికిత్స ద్వారా ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది.

మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దీనినే సర్వైకల్ స్పైనల్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. దాదాపు 85 శాతానికి పైగా ఇది 60 ఏళ్ల వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది. ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది.

కారణాలు:  వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం  క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం  డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం  వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం   ఎక్కువ టైం మెడను అసాధారణ భంగిమలో ఉంచడం  ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్‌లలో మాట్లాడటం ఎత్తై దిండ్లు వాడటం  మెడకు దెబ్బతగలడం మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం  తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.

లక్షణాలు:  సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం మెడ బిగుసుకుపోవడం తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం  నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం  చిన్న బరువునూ ఎత్తలేకపోవడం  నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు.


నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్‌ఆర్, ఎక్స్-రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు.
 హోమియో చికిత్స: జెనెటిక్ కాన్‌స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్  హైదరాబాద్
 
 కేన్సర్ కౌన్సెలింగ్
 
నా వయసు 33 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతుంటే చెన్నై వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాను. క్యాన్సర్ అని తేలింది. వెంటనే కీమోథెరపీ మొదలుపెట్టాలని డాక్టర్లు చెప్పారు. కానీ కొందరు బంధువులు, స్నేహితులు కీమోథెరపీ అంటే భయపెడుతున్నారు. అసలు కీమోథెరపీ అంటే ఏమిటి? క్యాన్సర్ చికిత్సలో దాని ప్రయోజనాలు ఏమిటి? సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి. దయచేసి నా సందేహాలకు సమాధానాలు చెప్పగలరు.   - భానుప్రసాద్, కర్నూలు

మందుల ద్వారా క్యాన్సర్‌కు చేసే చికిత్సనే కీమోథెరపీ లేదా కీమో అంటారు. సర్జరీ లేదా రేడియేషన్ థెరపీ ద్వారా శరీరంలోని కొన్ని ప్రాంతాలలో తిష్టవేసిన క్యాన్సర్ కణజాలాన్ని తొలగించగలుగుతాం లేదా నాశనం చేయగలం. కీమో ద్వారా శరీరంలో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ క్యాన్సర్ కణజాలాన్ని నిర్మూలించవచ్చు. కీమోథెరపీ ద్వారా శరీరంలో ముందుగా ఏర్పడిన క్యాన్సర్ కణితి మొదలుకొని శరీరంలోని అనేక భాగాలకు విస్తరించిన క్యాన్సర్ కణజాలాన్ని సైతం ధ్వసం చేయవచ్చు. కీమోథెరపీలో 100కు పైగా మందులను వివిధ కాంబినేషన్లలో వినియోగిస్తుంటారు. ఒక్కోసారి క్యాన్సర్ చికిత్స కోసం వీటిలో ఒకే మందును సైతం వాడవచ్చు.

అయితే సాధారణంగా వివిధ రకాల మందుల సమ్మేళనంతో ఒక క్రమపద్ధతిని అనుసరించి అందించే విధానాన్ని కాంబినేషన్ కీమోథెరపీ అని వ్యవహరిస్తారు. పలు రకాల మందులు, వాటి ప్రభావాల తీరు వల్ల ఉమ్మడిగా క్యాన్సర్ కణాలపై పోరాడి వాటిని సమూలంగా సంహరించగలుగుతాయి. ఒకే మందు వాడటం వల్ల క్యాన్సర్ కణాలు ఆ మందుకు లొంగకుండా తయారయ్యే ప్రమాదం ఉన్నందున కాంబినేషన్ కీమోథెరపీని వినియోగిస్తారు. మీ విషయంలో ఏ విధానం అవలంబించాలన్నది మీ డాక్టర్ నిర్ణయిస్తారు. అలాగే కీమోథెరపీలో భాగంగా మందులను ఎంత మోతాదులో, ఏవిధంగా, ఎప్పుడెప్పుడు, ఎంతకాలం ఇవ్వాలన్నది కూడా చికిత్సలో భాగమే. ఈ నిర్ణయాలన్నీ కూడా మీరు ఏ రకమైన క్యాన్సర్ కణితితో బాధపడుతున్నారు, శరీరంలో అది ఏ భాగంలో ఉంది, ఎంత పెద్దగా ఉంది, అది మీ శరీర కార్యకలాపాలను, ఆరోగ్యాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తోంది అన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది. కీమోథెరపీలో భాగంగా ఇచ్చే మందులను బట్టి మీ శరీరంలో అనేక విధాలుగా అతివేగంతో విస్తరించే క్యాన్సర్ కణాల విధ్వంసం జరుగుతుంది.

క్యాన్సర్‌లో చాలా రకాలున్నాయి. అవి శరీరంలో ఒక్కో భాగంలో ఒక్కో విధంగా పెరుగుతుంటాయి. కాబట్టి అవి పెరిగే విధానాన్ని అనుసరించి, వాటిని లక్ష్యంగా చేసుకొని అనేక కీమోథెరపీ మందులను రూపొందించడం జరిగింది. దయచేసి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీరు ఎక్కువగా ఆందోళన చెందకండి. కీమోథెరపీ లాంటి అత్యాధునిక వైద్య చికిత్సలతో సైడ్‌ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గించగలిగారు. ఇప్పుడు క్యాన్సర్ ఎంతమాత్రమూ ప్రాణాంతక వ్యాధి కాదు. ఎంత తొందరగా క్యాన్సర్‌ను  గుర్తించగలిగితే అంత సంపూర్ణంగా దాని నుంచి విముక్తి పొందే అవకాశాలున్నాయి. డాక్టర్ జి.వంశీకృష్ణారెడ్డి  సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్
 
 ఆర్ధోపెడిక్ కౌన్సెలింగ్
 
మా అమ్మగారి వయసు 65 ఏళ్లు. ఏడాదిక్రితం మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ) చేయించాం. శస్త్రచికిత్స సమయంలో ఆమె నేల మీద కూడా కూర్చోగలిగేందుకు హై-ఫ్లెక్స్ ఇంప్లాంట్ అమర్చాం. కానీ ఆమె నేల మీద కూర్చోలేకపోతున్నారు. ఒకింత చిన్న స్టూల్స్ వంటి వాటి మీద కూడా కూర్చోవడం సాధ్యం కావడం లేదు. హై-ఫ్లెక్స్ ఇంప్లాంట్స్ అమర్చాక కూడా తాను కోరుకున్నట్లుగా కింద కూర్చోవడం ఎందుకు సాధ్యపడటం లేదు? - యాదగిరి, నల్లగొండ

మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఎంతగా కాళ్లు ముడుచుకుంటున్నాయి అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి శస్త్రచికిత్స టెక్నిక్ ఉపయోగించారు, శస్త్రచికిత్సలో నైపుణ్యం వంటి అంశాలు ఇందులో కీలక భూమిక పోషిస్తాయి. హై-ఫ్లెక్స్ ఇంప్లాంట్స్ అనేది మామూలు కంటే ఎక్కువగా ఒంగుతాయని నిపుణులు పేర్కొంటారు. అంతేగాని ఇవి నేల మీద కూర్చోడానికి మాత్రమే ఉద్దేశించినవి కాదు. ఇందులో మూడు అంశాలను మీరు గమనించాలి. మొదటిది... ఒకరు శస్త్రచికిత్స తర్వాత మోకాళ్లను ఎంతమేరకు వంచగలరు అనే అంశం వారు శస్త్రచికిత్సకు ముందు ఎంతగా వంచారనే అంశంతో పోల్చి చూడాలి. రెండో అంశం... శస్త్రచికిత్సకుల నైపుణ్యం, ఆ సర్జరీలోని క్వాలిటీ, మూడో అంశం శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ ఎంతగా వ్యాయామం చేస్తే ఫలితాలు అంతగా బాగుంటాయి. అందుకే మీ అమ్మగారు తగినంత వ్యాయామం చేసేలా జాగ్రత్తలు తీసుకోండి. దాంతో ఫలితాలు మరింతగా మెరుగుపడతాయి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్

మరిన్ని వార్తలు