చూడలేడు... చెప్పగలడు!

5 Feb, 2015 22:49 IST|Sakshi
చూడలేడు... చెప్పగలడు!

కామెంటరీ ైబె  కరమ్
 

విరాట్ కొహ్లీ వీర విహారపు బ్యాటింగ్ నెప్పుడూ చూడలేదతను. బౌన్సీ పిచ్‌లపై దూసుకొచ్చే ఇషాంత్ బంతులనూ గమనించలేడు. అసలు క్రికెట్ ఎలా ఆడతారో... జనసందోహంతో నిండిన స్టేడియం ఎలా ఉంటుందో కూడా తెలీదు! ఇంకా చెప్పాలంటే మనిషి రూపురేఖల గురించే తనకు స్పష్టత లేదు. ఎందుకంటే చూపులేదు. జన్మతః అంధుడు. అయితే ఇప్పుడు కరమ్‌వీర్ కుమార్ షెరావత్ చెప్పే క్రికెట్ కామెంటరీ నెట్‌లో హల్‌చ ల్ చేస్తోంది. ఆటపరమైన దృశ్యాన్ని ఊహించుకొని అతడు చేసే విశ్లేషణ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. వరల్డ్‌కప్ మూడ్‌లో ఉన్న జనాలకు ఈ దేశీయ కామెంటేటర్ తెగ నచ్చేశాడు!

 కరమ్‌వీర్ కామెంటరీ చెబుతున్నప్పుడు వింటుంటే, దృశ్యం కళ్ల ముందు కదలాడుతుంది. తన మాటలతో ఆటగాళ్ల వేగంతో పోటీపడినట్టుగా కామెంటరీ చెబుతాడు కరమ్‌వీర్. ఈ విషయంలో దేశీయ ఇంగ్లిష్ కామెంటరేటర్‌లు కూడా కరమ్ ముందు దిగదుడుపే ననిపిస్తుంది. చాలా సంవత్సరాల నుంచి ఢిల్లీ లోని క్యాపిటల్ బ్లైండ్ రిలీఫ్ సొసైటీలో ఆశ్రయం పొందుతున్నాడు కరమ్. వయసు పాతికేళ్లు. సహజంగానే క్రికెట్ అంటే అభిమానించే వాళ్లందరి మధ్య బతుకుతున్నందున కరమ్‌కు కూడా క్రికెట్ తో పరిచయం ఏర్పడింది. రేడియోలో క్రికెట్ కామెంటరీని వింటూ, టీవీలో క్రికెట్ చూసే వాళ్ల పక్కన కూర్చొవడం అలవాటైంది. అలా చెవిన బడే కామెంటరీ మదిలో నాటుకుపోయింది. దీంతో అలవోకగా కామెంటరీ చెప్పేస్తున్నాడు.

కరమ్‌కు ఇంగ్లిష్ రాదు. చదువుకొన్నది కూడా లేదు. అయినా ఊహాత్మకంగా రోమాంచకతను మిళితం చేస్తూ ఇంగ్లిష్ కామెంటరీ చెబుతాడు. కరమ్ కామెంటరీ తీరును ఔత్సాహికులు వీడియోగా తీసి ఇంటర్నెట్‌కు అప్‌లోడ్‌చేశారు. వేలమంది ఫేస్‌బుక్ యూజర్లు ఆ వీడియోను షేర్ చేసుకొంటున్నారు. కరమ్ కేవలం కామెంటరీ మాత్రమే కాదు త్వరలో ప్రారంభం కానున్న వరల్డ్‌కప్ విషయంలో ఆటగురించి విశ్లేషణ కూడా చేస్తాడు. తనకు ఇష్టమైన ఆటగాడు సచిన్ టెండూల్కర్ అని, అయితే సచిన్ వచ్చే ఈసారి వరల్డ్‌కప్‌లో ఆడటం లేదు కాబట్టి.. ప్రస్తుతానికి ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్‌వాట్సన్ తనకు ఫేవరెట్ అని చెబుతాడు. వైకల్యాన్ని పర్సెంటేజీ కొలతల్లో చెప్పే విధానంలో కరమ్‌ను వందశాతం అంధుడిగా ధ్రువీకరించారు. అయితే గ్రాహ్యశక్తి విషయంలో మాత్రం కరమ్ వందకువంద మార్కులు పొందుతాడు!
 - జీవన్
 
 

>
మరిన్ని వార్తలు