యువ ముహమ్మద్ వ్యాపార విజయం

2 Apr, 2016 23:18 IST|Sakshi

ప్రవక్త జీవితం

 

వ్యాపార నిమిత్తం మైసరా ప్రతియేటా సిరియాకు రాకపోకలు సాగిస్తుండటం వల్ల బహీరా తరువాత చర్చీ నిర్వహణా బాధ్యతలు చూస్తున్న ప్రఖ్యాత క్రైస్తవ పండితుడు నస్తూరాతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. యువముహమ్మద్‌ను గురించి నస్తూరా మైసరాను చాలా విషయాలు అడిగాడు. స్వయంగా ముహుమ్మద్ వద్దకు వెళ్లి ఆయనతో మాట్లాడాడు. నస్తూరా అడిగిన ప్రతి ప్రశ్నకూ ముహమ్మద్ (స) సూటిగా, స్పష్టంగా, నిర్మొహమాటంగా సమాధానాలు చెప్పారు. యూదు, క్రైస్తవ మతధర్మాలకు సంబంధించిన అనేక ప్రశ్నలకూ ఆయన సంతృప్తికరమైన సమాధానాలు చెబుతూ, తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించారు. ముహమ్మద్ సమాధానాలతో నస్తూరా పూర్తిగా సంతృప్తి చెందాడు. ఆయన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించాడు. ఈ యువకుడు మామూలు వ్యక్తి కాదని, తమ మతగ్రంథాల్లో ప్రవచించబడిన భవిష్యవాణి ప్రకారం ఇతనే కాబోయే మహాప్రవక్త అని  నిర్థారించుకున్నాడు. ఇదే విషయం మైసరాతో కూడా చెప్పాడు. ‘‘మైసరా! ఇంతటి మేధ, ఆధ్యాత్మిక శక్తి, ఇన్ని సుగుణాలు కలిగి, ఈ చెట్టుకింద కూర్చున్న వ్యక్తి కచ్చితంగా దేవుని ప్రవక్త మాత్రమే కాగలడు. ఇది నేను మా మతగ్రంథాల వెలుగులో, ప్రామాణిక ఆధారాలతో చెబుతున్న మాట’’ అన్నాడు దృఢనిశ్చయంతో...

 
కొన్నాళ్ల తర్వాత వ్యాపార బిడారం మక్కాకు తిరుగు ప్రయాణమైంది. మక్కా మరికొన్ని మైళ్లదూరం ఉండగానే, ‘ముహమ్మద్! మీరు ముందుగా వెళ్లండి. వెళ్లి వ్యాపార విజయాన్ని గురించిన శుభవార్తను ఖతీజా గారికి వినిపించండి’అన్నాడు మైసరా ముహమ్మద్ (స)తో.. మైసరా సూచన మేరకు యువ ముహమ్మద్ ఒంటెను అధిరోహించారు. అది మధ్యాహ్నం వేళ. సూర్యుడు తన కర్తవ్య నిర్వహణలో భాగంగా పడమటి దిక్కుకు వాలిపొయ్యాడు. ముహమ్మద్ అధిరోహించిన ఒంటె దుమ్మురేపుతూ, శరవేగంతో మక్కా పొలిమేరలవైపు దూసుకుపోతోంది. మిద్దె పైభాగంలోని వరండాలో పచార్లు చేస్తున్న ఖదీజా దూరం నుండే వాహనాన్ని గమనించినా వస్తున్నదెవరో పోల్చుకోలేకపోయారు. ఆ సమయంలో ఇంత ఆఘమేఘాల మీద వస్తున్నదెవరోననే ఆసక్తి కూడా కలిగింది. అంతలో వాహనం మరికాస్త సమీపించింది. తమ ఇంటివైపే వస్తోంది. తీరా చూస్తే ఎవరో కాదు, ముహమ్మదే. బిరబిరా ఎదురేగి స్వాగతం పలికారామె. ప్రయాణం దిగ్విజయంగా ముగించుకుని క్షేమంగా తిరిగిరావడం పట్ల సంతోషం వెలిబుచ్చారు. కుశల ప్రశ్నలు, క్షేమసమాచారాల తరువాత ముహమ్మద్ (స) ప్రయాణ అనుభవాలూ, వ్యాపార విషయాల గురించి వివరించారు. ఏయే సరుకు ఎంతకు అమ్మిందీ, ఎంతకు కొన్నదీ, ఎంత లాభం వచ్చిందీ అన్నీ పూసగుచ్చినట్లు చెప్పారు. ముహమ్మద్ చెప్పే ప్రతి విషయాన్నీ ఎంతో ఆసక్తిగా విన్నారామె. ఆ మాటలోల్ని స్పష్టత, నిజాయితీ ఆమెను అమితంగా ఆకట్టుకున్నాయి.

  - ఎండీ. ఉస్మాన్ ఖాన్ (వచ్చేవారం మరిన్ని విశేషాలు)

 

 ముహమ్మద్ అధిరోహించిన ఒంటె దుమ్మురేపుతూ, శరవేగంతో మక్కా పొలిమేరలవైపు దూసుకుపోతోంది. మిద్దె పైభాగంలోని వరండాలో పచార్లు చేస్తున్న ఖదీజా దూరం నుండే వాహనాన్ని గమనించినా వస్తున్నదెవరో పోల్చుకోలేక పోయారు. ఆ సమయంలో ఇంత ఆఘమేఘాల మీద వస్తున్నదెవరో ననే ఆసక్తి కూడా కలిగింది.

మరిన్ని వార్తలు