నెత్తుటి పగ నెత్తుటితోనే...

27 Feb, 2019 01:28 IST|Sakshi

సామాన్యుని స్పందన

పెల్లుబికే ప్రేమ వెల్లివిరియాల్సిన రోజది. కరకు మూర్ఖుడి పగ ఆనాడు ఉగ్రరూపం దాల్చింది. ఎర్రటి రోజాపూలు ఇచ్చిపుచ్చుకునే రోజది.కానీ... ఛిద్రమైన జవాన్ల దేహశకలాలు చిదిమి పారేసిన గులాబీ రేకుల్లా చిందరవందరయ్యాయి. సైనికుల వేడి రక్తం రోడ్ల మీద పారింది. ఆ పారిన నెత్తురు చూసి దేశం రక్తం ఉష్ణకాసారంలా ఉడికిపోయింది. ఆవిరయ్యేంతటి అంచుకు చేరేలా సగటు దేశవాసి రక్తం మరిగింది. 
రక్తపు పొంగెప్పుడూ పాలపొంగు కాదు. చిక్కటి రుధిరం అంత తేలిగ్గా చల్లబడదు. అవున్నిజమే ... పడలేదు... శత్రువే పడిపోయేలా దెబ్బతీసింది. దెబ్బకు దెబ్బతీసింది. దొంగ దెబ్బకు ఎదురుదెబ్బ తీసింది. ప్రేమభాష రానివాడికీ, అది అర్థం కానివాడికీ వాడి భాషలో మాట్లాడితేనే కదా భావం తెలిసేది.

 అందుకే వాడి భాషలోనే చరిచి చెప్పాల్సి వచ్చింది. అవును... ఇవ్వాళ మన వైమానిక దళం మాట్లాడింది.శత్రువుకు అర్థమయ్యే భాషలో స్పష్టంగా మాట్లాడింది.  వినబడలేదంటూ గొణగకుండా వాడి చెవిలో హోరు గర్జన చేసింది.ఖాండ్రించి ఉమ్మినట్టుగా గాండ్రించి చెప్పిన జవాబిది. సైనికుల భార్యల కన్నీరు చెంప అంచునుంచి నేల జారక ముందే... తుడిచిన కన్నీటి చెమ్మ చేతిన ఆరక ముందే... తీర్చుకున్న ప్రతీకారం.శత్రువు నెత్తుటి వేడితో దేశమిప్పుడు చలిమంట కాగుతోంది. (‘పుల్వామా ఘటన’తో రగులుతున్న సామాన్యుడు పాక్‌పై మన దేశ ప్రతీకార  దాడిని చూసి ఎలా స్పందిస్తాడు అనేదానికి ఊహాత్మక స్పందన) 

మరిన్ని వార్తలు