కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స... మహిళలతో పోలిస్తే పురుషులకే సులభం!

22 Dec, 2014 23:54 IST|Sakshi
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స... మహిళలతో పోలిస్తే పురుషులకే సులభం!

ఈజీ ‘ప్లానింగ్’

అనాదిగా మనలో చాలా అపోహలున్నాయి. పైగా సామాజికంగా పురుషత్వం ఒక గౌరవ, గర్వ సూచికగానూ ఉంటూ వస్తోంది. అందుకే ఈ అపోహలూ, ఈ వివక్షలూ కలసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ఎక్కువగా స్త్రీలకే పరిమితమయ్యేలాంటి సాంఘిక పరిస్థితులు మన సమాజంలో ఏర్పడ్డాయి.
 
నిజానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మహిళలకు చేయడం కంటే పురుషులకు నిర్వహించడం చాలా సులభం. ట్యూబెక్టమీ అని పిలిచే మహిళలకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌తో పోలిస్తే పురుషులకు చేసే వ్యాసెక్టమీ చాలా చిన్నదీ, సులభమైనది. దీనితో పోలిస్తే మహిళలకు చేసే ట్యూబెక్టమీయే పెద్ద (మేజర్) ఆపరేషన్. ఇందులో ఫెలోపియన్ ట్యూబులను కత్తిరించడమో లేదా క్లిప్ చేయడమో చేసి, యుటెరస్‌లోని అండాలతో పురుషుల వీర్యకణాలు కలవకుండా చేయడమో చేస్తారు. ఫలితంగా ఫలదీకరణ ప్రక్రియ జరగదు. కాబట్టి పిల్లలు పుట్టడం సాధ్యం కాదు.

వ్యాసెక్టమీలో ఏం జరుగుతుంది?

 పురుషుల్లోని వీర్యకణాలు వృషణాల్లో తయారవుతాయి. ఇలా తయారైన ఈ వీర్యకణాలు వ్యాస్ అనే సన్నటి ట్యూబ్స్ ద్వారా ప్రయాణం చేస్తాయి. కాబట్టి వాటిని కత్తిరించి వీర్యకణాలు, వీర్యంతో పాటు బయటకు రాకుండా చేస్తారు. నిజానికి మనం వీర్యంగా భావించే ద్రవం ప్రోస్టేట్ గ్రంథిలో తయారవుతుంది. ఈ ద్రవంలో  వీర్యకణాల పాళ్లు కేవలం ఒక శాతం కంటే తక్కువే.
 
అపోహలు ఎన్నో...
 

వ్యాసెక్టమీ చేయించుకుంటే మగతనం తగ్గిపోతుందనేది ప్రధాన అపోహ. కానీ పురుషత్వానికి కారణమైన ఏ అంశాన్నీ ఈ శస్త్రచికిత్స ప్రక్రియలో ముట్టుకోరు. కేవలం వీర్యకణాలు ప్రయాణం చేసే వ్యాస్ అనే ట్యూబ్‌లను మాత్రమే కత్తిరిస్తారు. కాబట్టి ఈ శస్త్రచికిత్స చేయించుకున్న పురుషుల మగతనానికి వచ్చే లోపమేమీ ఉండదు.
 
ఇక ఈ ఆపరేషన్‌పై ఉండే మరో అపోహ ఏమిటంటే... శస్త్రచికిత్స తర్వాత వీర్యం రాదనేది ఒక దురభిప్రాయం. కానీ ఈ ఆపరేషన్ తర్వాత కూడా పురుషుడు సెక్స్‌లో పాల్గొన్న తర్వాత ముందులాగే వీర్యం విడుదల అవుతుంది. కాకపోతే అందులో వీర్యకణాలు/శుక్రకణాలు ఉండవు కాబట్టి... సెక్స్ తర్వాత గర్భం వచ్చేందుకు ఆస్కారం ఉండదు.

 ‘నో స్కాల్‌పెల్’ ప్రక్రియతో ఇప్పుడు మరింత సులువు
 
మహిళల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మేజర్ శస్త్రచికిత్స కాగా... పురుషుల్లో చేసే వ్యాసెక్టమీ ఇప్పుడు మరింత సులువయ్యింది. ‘నో స్కాల్‌పెల్ వ్యాసెక్టమీ’ (ఎన్‌ఎస్‌బవీ) ప్రక్రియ ద్వారా వృషణాలకు చిన్న గాటు పెట్టడం ద్వారా ఈ వ్యాసెక్టమీ ఇప్పుడు మరింత సులువయ్యింది. ఈ గాటుకు కుట్లు వేయాల్సిన అవసరం కూడా లేదు. కొద్దిరోజుల్లో చిన్నగాయం ఎలా మానిపోతుందో, ఈ గాట్లూ అలాగే మానిపోతాయి.
 
- డాక్టర్ చంద్రమోహన్, యూరో సర్జన్,
 ప్రీతీ యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్
 

మరిన్ని వార్తలు