రొమ్ము క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుందా?

15 Feb, 2016 22:34 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్
నా వయసు 20 సంవత్సరాలు. నేను డిగ్రీ చదువుతున్నాను. నాకు రెండేళ్లుగా విపరీతమైన తలనొప్పి. తలలో ఒకవైపు మొదలై కంటి వరకు తీవ్రమైన నొప్పి ఉంటుంది. డాక్టర్‌గారిని సంప్రదిస్తే మైగ్రేన్ అని చెప్పి, కొన్ని మందులు రాసిచ్చారు. ఆ మందులు వాడినప్పుడు నొప్పి తగ్గుతోంది. మానేస్తే మళ్లీ మామూలే. దీంతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాను. నా సమస్యకి హోమియోలో పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా?
 - టి.విజయ్ కుమార్, నల్గొండ

 
మీరు ఆందోళన చెందకండి. హోమియోలో మైగ్రైన్‌కి పూర్తి చికిత్స లభిస్తుంది. ఈ సమస్య సాధారణంగా 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉంది. పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా చూస్తాం. ఈ పార్శ్వపు నొప్పితో బాధపడుతున్నవారిలో నెలలో ఐదుకంటే ఎక్కువసార్లు తలనొప్పి వస్తుంటుంది. ఒకపక్కే వచ్చే ఈ నొప్పి నాలుగు గంటల నుండి మూడు రోజుల వరకు తీవ్రంగా బాధిస్తుంది. వాంతులు అవడం, శబ్దాలను, వెలుతురును భరించలేకపోవడం వంటి లక్షణాలు తలనొప్పితోబాటు కానీ, ముందుకానీ ఉంటాయి.
 
కారణాలు: ఒత్తిడి, నిద్రలేకపోవడం, ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్. నెలసరి సమయంలో, గర్భిణులలో, మెనోపాజ్ సమయంలో సాధారణంగా ఈ నొప్పి వస్తుంటుంది. స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల కూడా ఈ మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన వాసనలు, పార్శ్వపునొప్పికి కారణాలు కావచ్చు. పొగతాగటం, ఇంట్లో పొగతాగేవారుండటం, మద్యపానం లేదా ఇతర మత్తుపదార్థాలు తీసుకోవడం కూడా కారణాలవుతాయి.
 
పైన పేర్కొన్న అంశాలకు దూరంగా ఉండటం వల్ల కొంతవరకు తలనొప్పిని అదుపులో ఉంచవచ్చు. నొప్పి తగ్గిన తర్వాత కూడా చికాకు ఎక్కువగా ఉండటం, నీరసం, వికారం, వాంతులు, విరేచనాలు కావడం వంటి లక్షణాలుంటాయి.
 
రోగనిర్ధారణ పరీక్షలు: రోగలక్షణాలను బట్టి ఎక్కువసార్లు పార్శ్వపునొప్పిని నిర్ధారించడం జరుగుతుంది. ఈసీజీ, సీటీ బ్రెయిన్, ఎమ్మారై- బ్రెయిన్ వంటి పరీక్షల ద్వారా ఇతరత్రా వ్యాధులు లేవని నిర్ధారించుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పిని నిర్ధారించుకోవచ్చు.
 
హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ వైద్యవిధానం ద్వారా ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన కచ్చితమైన చికిత్స ద్వారా పార్శ్వపునొప్పి తీవ్రతను తగ్గించడమే కాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు.
- డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్,
ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్,
హైదరాబాద్

 
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
నా వయసు 56 ఏళ్లు. నాకు పన్నెండేళ్లుగా షుగర్ ఉంది. ఈమధ్య ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాళ్లలో వాపులు వస్తున్నాయి. రక్తపరీక్ష చేయిస్తే క్రియాటినిన్ 10, యూరియా 28 అని వచ్చింది. యూరిన్ పరీక్ష చేయిస్తే 3 ప్లస్ అన్నారు. నాకు షుగర్ వల్ల సమస్య అవుతోందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
 - దయాసాగర్, శ్రీకాకుళం

 
మీ రిపోర్ట్ ప్రకారం మీకు యూరిన్‌లో ప్రోటీన్ ఎక్కువగా పోతోందని తెలుస్తోంది. ఇది షుగర్ వల్లనా లేక ఏదైనా కిడ్నీ సమస్యల వల్లనా లేదా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. మీరు ఒకసారి కంటి డాక్టర్‌ను కూడా కలవాలి. షుగర్ వల్ల రెటీనా దెబ్బతిన్నదేమోనని (డయాబెటిక్ రెటినోపతీ) అని చూపించుకోవాలి. మీకు మూత్రంలో ఎక్కువగా ప్రోటీన్ పోవడానికి కూడా షుగర్ వల్లే అయి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లకు భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మొదట మీ షుగర్ లెవెల్స్‌ను బాగా నియంత్రించుకోవాలి. తినకముందు బ్లడ్ షుగర్ 110 ఎంజీ/డీఎల్, తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేట్లుగా చూసుకోవాలి. బీపీ 125/75 లోపల ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లడ్ కొలెస్ట్రాల్ 150 ఎంజీ ఉండేలా మందులు వాడాలి. ఇవి కాకుండా ఆహారంలో  ఉప్పు తగ్గించాలి. పొగతాగడం / ఆల్కహాల్ అలవాట్లు ఉంటే వాటిని దూరంగా ఉండాలి. డాక్టర్ సలహా లేకుండా నొప్పి నివారణ మందులు వాడకూడదు.
 
మా అబ్బాయికి ఐదేళ్లు. పొద్దున్నే లేచినప్పుడు కళ్ల మీద రెప్పలు ఉబ్బి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాళ్లలో వాపు కనిపిస్తోంది. యూరిన్ టెస్ట్‌లో ప్రోటీన్ 3 ప్లస్ ఉందని చెప్పారు. ఈ సమస్య ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?
 - రవీంద్రరావు, కొత్తగూడెం

 
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు నెఫ్రొటిక్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారికి మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోతుంటాయి. మొదటగా ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. మీరు ఒకసారి మీ బాబుకు 24 గంటల్లో మూత్రంలో ఎంత ప్రోటీన్ పోతుందో తెలుసుకునే పరీక్ష చేయించండి. దానితో పాటు ఆల్బుమిన్ కొలెస్ట్రాల్ పరీక్ష కూడా చేయించండి. నెఫ్రోటిక్ సిండ్రోమ్‌లో సీరమ్ ఆల్బుమిన్ తక్కువగా ఉండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది.

ఇది చిన్నపిల్లల్లో చాలా సాధారణంగా వచ్చే సమస్య. మొదటిసారి వచ్చినప్పుడు మూడు నెలల పాటు స్టెరాయిడ్స్ వాడాలి. అవి వాడే ముందు మీ బాబుకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని నిర్ధారణ చేసుకోవాలి. ఈ వ్యాధి పదిహేనేళ్ల వయసు వరకు మళ్లీ మళ్లీ వస్తుంటుంది. అయితే మొదటిసారే పూర్తి చికిత్స చేయించుకుంటే మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. ఈ పేషెంట్స్ ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించి వాడాలి. ఇన్ఫెక్షన్ వస్తే వ్యాధి తిరగబెట్టవచ్చు. అలాంటప్పుడు మొదట ఇన్ఫెక్షన్ నియంత్రించుకోవాలి.
- డాక్టర్ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్,
హైదరాబాద్

 
క్యాన్సర్ హెల్త్ కౌన్సెలింగ్
నా వయసు 18 ఏళ్లు. నా చిన్నప్పుడే మా అమ్మ రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయింది. మా అక్కకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఒక రొమ్మును తొలగించాల్సి వచ్చింది. కుటుంబంలో ఇలా చాలామందికి క్యాన్సర్ రావడంతో నాకూ ఈ వ్యాధి వస్తుందేమో అని భయంగా ఉంది. నాకు ఈ ఏడాది లేదా పై ఏడాది పెళ్లి చేస్తామంటున్నారు. నా వైవాహిక జీవితం బాగానే ఉంటుందా? నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? వస్తే తగ్గుతుందా? దీని బారిన పడకూడదంటే నేను తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలు ఏవైనా ఉంటే తెలియజేయండి.
 - ఒక సోదరి, విజయవాడ

 
ఇటీవల చాలామంది మహిళలు రొమ్ము (బ్రెస్ట్) క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం... దీని పట్ల తగిన అవగాహన లేకపోవడం. అంత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా అవగాహన లోపం వల్ల ముందుగానే దీన్ని గుర్తించలేకపోతున్నారు. ఇక మీ విషయానికి వస్తే మీ కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డవారు ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చాలా అరుదుగా జరుగుతుంది.

కానీ మీకు కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉంది కాబట్టి ఒకసారి పరీక్షలు చేయించుకుంటే మీ అనుమానాలు తొలగిపోతాయి. ‘సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ అనే పరీక్ష ద్వారా మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా, లేదా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకవేళ మొదటే గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ ఉన్నా ఇప్పుడున్న వైద్య సదుపాయాలతో దీని నుంచి పూర్తిగా బయటపడవచ్చు.

మీరు ఎలాంటి భయాందోళనలూ పెట్టుకోకుండా ముందుగా మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోండి. ఒకవేళ అవసరమైతే వైద్యులు మీకు నీడిల్ బయాప్సీ అనే మరో పరీక్ష చేస్తారు. ఒకవేళ ఇప్పుడు పరీక్షలో మీకు ఎలాంటి బ్రెస్ట్ క్యాన్సర్ లేదని తేలినప్పటికీ మీకు 30 సంవత్సరాలు వచ్చే వరకూ మూడేళ్లకొకసారి బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
- డాక్టర్ అవినాశ్ పాండే
మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్
సోమాజిగూడ, హైదరాబాద్

మరిన్ని వార్తలు