కదలని బాధ కాన్‌స్టిపేషన్

16 Nov, 2016 22:52 IST|Sakshi
కదలని బాధ కాన్‌స్టిపేషన్

మలబద్ధకం

ప్రతి ఉదయం మలవిసర్జన సాఫీగా అయితే... ఆ రోజంతా ప్రశాంతంగా గడిచిపోయినట్టే. కానీ ఆ వేళ ‘ఆ ఒక్క పనీ’ జరగకుండా పేగులు మొరాయిస్తే అది నరకం. ఆ బాధ తగ్గించుకుని, ప్రశాంతత పొందేందుకు వివరాలివిగో... మనిషికి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో! మలవిసర్జన చేయడమూ అంతే అవసరం. ఆకలవుతోంది, భోజనానికి వెళ్తున్నానని చెప్పినంత సులువుగా వాష్‌రూమ్‌కెళ్లాలని చెప్పలేరు. కొంచెం బిడియం. మరికొంచెం సిగ్గు.

దానికి తోడు ఇల్లు దాటి బయటకు వచ్చిన తర్వాత ఆ అవసరం తీరడానికి తగినన్ని సౌకర్యాలుండవు. దాంతో వాయిదా వేయక తప్పని పరిస్థితి. మోడరన్ లైఫ్‌స్టయిల్‌లో సౌకర్యాలు పెరిగాయి. దేహానికి వ్యాయామం లేకుండా గారంగా చూసుకోవడమూ ఎక్కువైంది. దేహం మీద ముద్దు ముదరడంతో మనిషిలో బద్ధకం పెరుగుతోంది. అది జీర్ణవ్యవస్థ, దాని అనుబంధ ప్రక్రియలు బద్ధకించేటట్లు చేస్తోంది. అది మలబద్ధకం రూపంలో బయటపడుతోంది. మరి... ఈ మలబద్ధకం నుంచి బయటపడేదెలాగ?

మలబద్ధకం లక్షణాలు
పెద్ద పేగు కదలికలు తగ్గడం, మలమూత్ర విసర్జనలో ఇబ్బందులు
మలం గట్టి పడడం, పరిమాణం తక్కువగా ఉండడం
మలవిసర్జన చేయాల్సినట్లు అనిపిస్తున్నా విసర్జించలేకపోవడం
పొట్ట ఉబ్బిపోవడం, నొప్పి
విసర్జన మందగించడంతో చిన్న పేగు, జీర్ణాశయం కదలికలు తగ్గడం, ఆహారం తినాలనిపించకపోవడం

మలబద్ధకానికి కారణాలు!
చిన్న పేగు, పెద్ద పేగు సమస్యలు, మలద్వారంలో ఇబ్బందులు మలబద్దకానికి ప్రధాన కారణాలవుతుంటాయి. అలాగే లైఫ్‌స్టయిల్ మారినందువల్ల దేహ కదలికలు, జీవక్రియలు మందగించి మలబద్ధకానికి దారి తీస్తోంది.

లైఫ్‌స్టయిల్ మార్పు: ఆహారంలో తగినంత పీచు, ద్రవాలను తీసుకోకపోవడం. టైమ్ చూసుకుంటూ పరుగులు తీసే క్రమంలో దేహం మలవిసర్జన చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసినప్పుడు వెళ్లకుండా వాయిదా వేయడమూ కారణమే. ఎక్కువమందికి పేగుల కదలికలకు అవసరమైనంత వ్యాయామం దేహానికి లేకపోవడం వల్ల ఇటీవల కాన్‌స్టిపేషన్ ఎక్కువగా కనిపిస్తోంది.

మందులు: హైబీపీ, డిప్రెషన్, గుండెవ్యాధులకు మందులు వాడుతున్నప్పుడు దేహం కొద్దిపాటి సైడ్‌ఎఫెక్ట్స్‌కు లోనవుతుంది. ఆ మందులే కాకుండా బలం కోసం ఐరన్ మాత్రలు తీసుకుంటున్న వారిలోనూ మలబద్ధకం కనిపిస్తుంటుంది.

క్రానిక్ ఇడియోపతిక్ కాన్‌స్టిపేషన్: కొందరికి ఏ ఇతర కారణాలూ లేకనే పేగు కదలికలు తక్కువగా ఉంటాయి.

గర్భిణుల్లో: గర్భిణిగా ఉన్నప్పుడు దేహంలో వచ్చే అనేక మార్పుల్లో హార్మోన్ స్థాయుల హెచ్చుతగ్గులు ప్రధానమైనవి. ఈ మార్పు కొందరిలో పేగు కదలికలను మందగింప చేస్తుంది. దీనికి ఐరన్‌మాత్రల వాడకం తోడవుతుంటుంది.

జీవక్రియల సమతుల్యత లోపించడం: హైపో థైరాయిడిజమ్, డయాబెటిక్ మెలిటస్ వంటి సమస్యలు కూడా కాన్‌స్టిపేషన్‌కు కారణమవుతుంటాయి.

అనాటమికల్ ప్రాబ్లమ్: పైన చెప్పుకున్న కారణాలన్నీ చాలా చిన్నవి, పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేకుండా తగ్గించుకోవడానికి అవకాశం ఉన్నవి. కాగా అనాటమికల్ ప్రాబ్లమ్ మాత్రం పూర్తి స్థాయి చికిత్స అవసరమైన పరిస్థితి. ఇందులో రెక్టో కోయిల్, మెగా కోలన్ లేదా మెగా రెక్టమ్, నరాల సంబంధ వ్యాధులు, గాయాలవడం, కోలన్ క్యాన్సర్, కోలన్ స్ట్రిక్చర్ వంటి అనేక కారణాలుంటాయి. పెద్దపేగు మీద బుడిపెలాగ వచ్చి మలం అందులో ఆగిపోవడం, పెద్దపేగు సాగిపోవడం, పెద్దపేగు క్యాన్సర్ వంటివన్న మాట.కాన్‌ష్టిపేషన్ రావడానికి కారణాలు ఏమైనప్పటికీ గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకోకపోతే నరాల వ్యవస్థ మీద దుష్ర్పభావం పడుతుంది. పైల్స్ వంటి అనుబంధ సమస్యలు కూడా ఎదురవుతుంటాయి.

నిర్ధారణ ఎలా!
కాన్‌స్టిపేషన్ రావడానికి కారణాల అన్వేషణ చాలా కీలకం. ప్రాథమికంగా లైఫ్‌స్టయిల్, మందుల వాడకంతో వచ్చిన సైడ్‌ఎఫెక్ట్స్ అనే కోణంలో విశ్లేషిస్తారు. అవి కాదనిపించినప్పుడు పూర్తిస్థాయి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అవి... హిమోగ్లోబిన్ లెవెల్స్, ఎరిత్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, బయోకెమికల్ స్క్రీనింగ్, ధైరాయిడ్, సీరమ్ క్యాల్షియమ్, కొలనోస్కోపీ, ఫిజియోలాజికల్ టెస్ట్, మెజర్‌మెంట్ ఆఫ్ కొలోనిక్ ట్రాన్సిట్ టైమ్, యానోరెక్టల్ మానోమెట్రీ, బెలూన్ ఎక్స్‌పల్షన్ టెస్ట్‌లు అవసరమవుతాయి.

చికిత్స
మలబద్ధకం తగ్గడానికి మొదటగా లైఫ్‌స్టయిల్ మార్చుకోవాల్సి ఉంటుంది. దేహాన్ని క్రమబద్ధంగా అలవాటు చేయాలి. మలవిసర్జన కోసం రోజూ ఒకే టైమ్‌లో కొంత సమయం కేటాయించాలి.  ఆటలు, ఇతర వ్యాయామాలు పేగు కదలికలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి కనీసం అరగంట అయినా వ్యాయామం ఉండాలి. డ్రైవింగ్, కంప్యూటర్‌తో పని చేసే వారికి, ఇలాంటి కొన్ని రకాల వృత్తుల్లో ఎక్కువ సేపు కూర్చుని, దేహాన్ని పెద్దగా కదిలించే అవసరం ఉండదు. అలాంటి వారు తప్పని సరిగా వ్యాయామం కోసం సమయాన్ని కేటాయించాలి  ఆహారంలో ద్రవాల మోతాదు పెంచుకోవాలి. రోజుకు కనీసం పది గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఆల్కహాల్, శీతలపానీయాలు, కాఫీ, టీ ఎక్కువగా తీసుకునే వారు వాటిని గణనీయంగా తగ్గించాలి మందుల వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్‌గా కాన్‌స్టిపేషన్‌కు గురైన వాళ్లు ఆ సంగతిని డాక్టర్‌కి తెలియచేసి మందులు మార్చుకోవాలి. అలా మార్చడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఆ మందులతోపాటు మలబద్ధకం తగ్గడానికి లాక్సేటివ్ మందులను సూచిస్తారు. ఈ లాక్సేటివ్‌లలో బల్క్ ఫార్మింగ్ లాక్సేటివ్, స్టిములెంట్ లాక్సేటివ్, ఆస్మోటిక్ లాక్సేటివ్స్ అని మూడు రకాలుంటాయి. రోగి పరిస్థితిని బట్టి ఏ రకమైన లాక్సేటివ్స్ అవసరమనేది డాక్టర్ నిర్ణయిస్తారు  పై ఏ పద్ధతిలోనూ సమస్య పరిష్కారం కానప్పుడు బయో ఫీడ్‌బ్యాక్ విధానంలో చికిత్స చేస్తారు.

హెల్త్ టిప్స్
బ్యాండెయిడ్ తొలగించండిలా!

పిల్లలకు దెబ్బ తగిలిన వెంటనే ఫస్ట్ ఎయిడ్‌బాక్స్ తెరిచి బాండ్ ఎయిడ్ వేస్తారు. మరుసటి రోజుకి గాయం తగ్గుముఖం పడుతుంది. మూడో రోజుకి మానిపోతుంది. ఇక దానిని తీసేయాలి? అదే పెద్ద బాధ. గాయం నొప్పి రేగుతుంది, పిల్లలు గాయం నొప్పి కంటే ఈ నొప్పికే ఎక్కువ విలవిలలాడతారు. దానికి పరిష్కారం చాలా సులభం... బ్యాండ్ ఎయిడ్‌ను ఒక్కసారిగా లాగినట్లు తీయరాదు. బ్యాండ్ ఎయిడ్ చివరలో బేబీ ఆయిల్, కొబ్బరి నూనె రాయాలి. పది నిమిషాలకు నూనె పీల్చుకుంటూ అంచులు మెల్లగా చర్మాన్ని వదులుతాయి. అప్పుడు మరికొంత నూనె చర్మానికి రాస్తూ, బ్యాండ్ ఎయిడ్‌ని మెల్లగా కొద్ది కొద్దిగా వదులు చేస్తూ తీసేయాలి.

లైఫ్‌స్టయిల్ కీళ్లనొప్పి
ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కీళ్లవ్యాధి లక్షణాల్లో కీళ్ల నొప్పి. మోకాళ్లు, మడమల కీళ్లు, ఒళ్లంతా పట్టేసినట్లు కదలనివ్వకపోవడం (స్టిఫ్‌నెస్) వంటివి ఉంటాయి. వాటితోపాటు ఈ వ్యాధి లక్షణాలలో వేళ్ల కీళ్ల నొప్పి కూడా ఒకటి. వేళ్ల కీళ్ల నొప్పి అనిపించగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని తమకు తాము నిర్ధారణకు రావడానికి వీల్లేదు. టైప్, కంప్యూటర్ కీబోర్డు విపరీతంగా ఉపయోగించేవారికి, పిండివంటలు, కుట్లు, అల్లికలు చేసేవారికి, బోర్డు మీద ఎక్కువగా రాసేవారికి కూడా వేళ్ల కీళ్లు నొప్పి పెట్టవచ్చు. ఇవన్నీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు కావు.  పైన చెప్పిన అలవాటు ఏదీ లేకుండా కూడా వేళ్ల కీళ్లు నొప్పెడుతుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రమాదాన్ని ఊహించాల్సిందే. అప్రమత్తం కావాల్సిందే. ఎందుకంటే ఇది ఆ వ్యాధి తొలిలక్షణం... ముందస్తు హెచ్చరిక.

మరిన్ని వార్తలు