ఆర్థరైటిస్‌ నివారణకు తేలిక మార్గాలు

23 Sep, 2019 03:04 IST|Sakshi

ఒక వయసు దాటాక ఎముకలు అరిగిపోవడం సహజం. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆర్థరైటిస్‌ వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. ఇలా ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చే ఆర్థరైటిస్‌ సమస్యను కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా నివారించుకోవచ్చు. అవేమిటో తెలుసుకోండి. చాలాకాలం పాటు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

►స్థూలకాయం వల్ల మీ ఒంటి బరువు ఎముకలపై పడి ఆర్థరైటిస్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి.

►మన శరీర కదలికలు చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. కూర్చుని చేసే వృత్తుల్లో ఉండేవారు వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ 30 నిమిషాలు వేగంగా నడవడం వంటి వ్యాయామాలు చేయాలి.

►మరీ ఎక్కువగా కీళ్లు అరిగే అవకాశం ఉన్నవారు కీళ్లకు తగినంత విశ్రాంతి కల్పించాలి. వేగంగా పరుగెత్తే తరహా వ్యాయామాలు చేసేవారు తమ స్పోర్టింగ్‌ యాక్టివిటీస్‌ను తగ్గించాలి. దానికి బదులు వేగంగా నడవడం మంచిది. తమ ఒంటి బరువును గణనీయంగా తగ్గించే ఈదడం (స్విమ్మింగ్‌ ఎక్సర్‌సైజ్‌) ఇంకా మంచిది.

►కాళ్లు మడిచి, బాసిపట్లు వేసి కూర్చోవడం (స్క్వాటింగ్‌) మంచిది కాదు. వీలైనంత వరకు కుర్చీ లేదా బల్ల వంటి వాటి మీద కూర్చోవాలి.

►పాల వంటి క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

►మెనోపాజ్‌ వచ్చిన మహిళల్లో ఆర్థరైటిస్‌ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

►కీళ్లలో నొప్పి కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.

మరిన్ని వార్తలు