హైటెక్‌ హెల్త్‌ గాడ్జెట్స్‌

15 Jan, 2018 01:18 IST|Sakshi

ఆరోగ్య పరిరక్షణలో టెక్నాలజీ వాడకం కొత్తేమీ కాదు. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త, వినూత్న వైద్య పద్ధతులు అందుబాటులోకి వస్తూండటం విశేషం. అమెరికాలోని లాస్‌వేగస్‌లో ప్రస్తుతం జరుగుతున్న కన్సూ్యమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (సీఈఎస్‌ –2018)లో ఈ ఏడాది కనిపించిన టెక్నాలజీలే ఇందుకు తార్కాణం. ఒత్తిడిని తగ్గించే హెడ్‌బ్యాండ్, వయోవృద్ధులు మందులు సరిగా తీసుకుంటున్నారా? లేదా? అన్నది చెక్‌ చేసేందుకు కాలి సాక్స్‌లో దాగే సెన్సర్లు.. తుంటి ఎముకలకు రక్షణ కల్పించే వినూత్న బ్యాగ్‌ వంటివి మచ్చుకు కొన్నే.. ఒక్కోదాని వివరాలు చూసేద్దాం...

నిద్ర సమస్యలకు హైటెక్‌ కళ్లజోడు!
నిద్ర పట్టకపోయినా.. ఉదయాన్నే నిద్రలేవాలంటే బద్ధకంగా అనిపిస్తున్నా తెల్లవారకముందే మెలకువ వచ్చేస్తున్నా.. ఈ హైటెక్‌ కళ్లద్దాలు వాడేయమంటోంది పెగాసీ గ్లాస్‌ అనే సంస్థ. ఫ్రేమ్‌ లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైట్ల కారణంగా సుఖనిద్రకు కావాల్సిన మెలటోనిన్‌ను నియంత్రించవచ్చునన్నది కంపెనీ అంచనా.  తద్వారా మన శరీరాల్లోని గడియారం సహజస్థితికి చేరుతుందని.. నిద్ర సమస్యలన్నీ దూరమవుతాయని కంపెనీ అంటోంది. ఒక్కో కళ్లజోడు ఖరీదు రూ.12 వేల వరకూ ఉంటుంది!

ఒత్తిడికి విరుగుడు ఈ హెడ్‌బ్యాండ్‌
కెనడాకు చెందిన స్టార్టప్‌ ఇంటరెక్సాన్‌ ‘మ్యూజ్‌’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ హెడ్‌బ్యాండ్‌ మన మెదడులోని నాడుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒత్తిడిని తగ్గిస్తుందట. ధాన్యం చేసేటప్పుడు ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించేందుకు, అథ్లెటిక్స్‌ పోటీల్లో ఒత్తిడిని జయించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. దక్షిణ కొరియాకు చెందిన లూక్సిడ్‌ ల్యాబ్స్‌ కూడా ఇలాంటి పరికరాన్నే ప్రదర్శించినప్పటికీ ప్రస్తుతం తాము పరిశోధన దశలోనే ఉన్నామని కంపెనీ ప్రకటించింది.

వృద్ధుల స్థితిగతులపై కన్నేసేందుకు..

మతిమరపు లేదంటే అయిష్టత కారణంగా వయసు మీదపడిన వారు మందులు తీసుకునేందుకు అంతగా ఇష్టపడరు. ఈ సమస్యకు పరిష్కారంగా వాషింగ్టన్‌ స్టార్టప్‌ కంపెనీ సెన్సోరియా పేరుతో ఓ వినూత్నమైన గాడ్జెట్‌ను సిద్ధం చేసింది. వ్యాయామ సమయంలో శరీర కదలికలను గుర్తించి.. తప్పుఒప్పులను సరిచేసేందుకు కొన్నేళ్ల క్రితం సిద్ధం చేసిన ఓ గాడ్జెట్‌నే ప్రస్తుతం వృద్ధులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. మన దుస్తులకు గానీ, సాక్స్‌కుగానీ ఈ గాడ్జెట్‌ను తగిలించుకుంటే.. వ్యాయామం సరిగా చేస్తున్నారా లేదా?, మందులు సక్రమంగా తీసుకుంటున్నారా? వంటి అంశాలన్నింటినీ వారికి గుర్తు చేస్తూంటుంది ఇది.

తుంటి ఎముకలకు రక్షణ కవచం..

వృద్ధులు పొరబాటున జారిపడితే తుంటి ఎముకలకు నష్టం జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వారి కోసమే ఫ్రాన్స్‌ కంపెనీ హెలైట్‌ తుంటిభాగానికి రక్షణ కల్పించే ఓ హైటెక్‌ సంచిని తయారు చేసింది.  నడుముకు తగిలించుకుని వెళుతూంటే చాలు.. వాటిలోని మోషన్‌ సెన్సర్స్‌ మన కదలికలపై ఓ కన్నేసి ఉంచుతాయి. ప్రమాదవశాత్తూ పడిపోతే.. ఇవి వెంటనే స్పందిస్తాయి. గాలి బుడగలు విచ్చుకునేలా చేస్తాయి. ఫలితంగా సున్నితమైన తుంటి ఎముకలకు రక్షణ ఏర్పడుతుందన్నమాట.

మరిన్ని వార్తలు