కాంటాక్ట్ లెన్స్‌లు వాడేవారూ... కాస్త జాగ్రత్త!

9 Jul, 2015 23:33 IST|Sakshi
కాంటాక్ట్ లెన్స్‌లు వాడేవారూ... కాస్త జాగ్రత్త!

కొత్త పరిశోధన
 
స్వాభావికంగా కంటిలో ఉండే బ్యాక్టీరియాతో పోలిస్తే... కాంటాక్ట్‌లెన్స్‌లు వాడేవారి కళ్లలో ఉండే బ్యాక్టీరియా కాస్త మారిపోయి వేరుగా ఉంటుందట. అందుకే మిగతావారితో పోలిస్తే కాంటాక్ట్‌లెన్స్‌లు వాడేవారిలో కంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువని అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ నిర్వహించిన వార్షిక సదస్సులో పరిశోధకులు వెల్లడించారు. వీరు తమ పరిశోధనల్లో కాంటాక్ట్‌లెన్స్‌లను ధరించేవారినీ, వాటిని ధరించని వారితో పోల్చిచూస్తూ తమ అధ్యయనాలను కొనసాగించారు.

 సాధారణంగా కంటిలో ఇన్ఫెక్షన్లతో పోరాడే బ్యాక్టీరియా ఉంటుంది. కానీ కొంతకాలంపాటు కాంటాక్ట్‌లెన్స్‌లు ధరించేవారిలో ఆ బ్యాక్టీరియా మారిపోయి, కనురెప్పల వద్ద ఉండే బ్యాక్టీరియాతో పోలినదానిలా మారుతుందట. కాంటాక్ట్‌లెన్స్‌లను ధరించని వారి కంటిలో ఉండే బ్యాక్టీరియాతో పోల్చినప్పుడు అది కాస్త భిన్నంగానూ ఉంటోందట. అయితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలను పెంచడం మినహా, కళ్లకు జరిగే హాని కాంటాక్ట్‌లెన్స్ వంటి ఫారిన్‌బాడీ వల్ల జరుగుతోందా లేక అది అమర్చుకుంటున్నప్పుడు మన వేళ్ల ఒత్తిడి వల్ల జరుగుతందా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదంటున్నారు వారు. అయితే కాంటాక్ట్ లెన్స్‌లు ధరించేవారు తమ చేతులు, కనురెప్పల శుభ్రత విషయంలో మరింత జాగ్రత్త ఉండాలని మాత్రం సూచనలు చేస్తున్నారు ఈ పరిశోధకులు.
 
 

మరిన్ని వార్తలు