తేనెతుట్టె స్ఫూర్తితో కాలుష్య నియంత్రణ

14 May, 2018 23:37 IST|Sakshi

తేనెతుట్టెలో ఆరు భుజాలతో ఉండే చిన్న చిన్న రంధ్రాలను ఎప్పుడైనా చూశారా? ఎంతో చక్కగా ఒక పద్ధతిగా అమరి ఉంటాయి ఇవి. అచ్చం ఇలాంటి ఆకారం, నిర్మాణాలతో ఏదైనా పదార్థాన్ని తయారుచేయగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ.. నానో స్థాయిలో ఇలాంటివి నిర్మించడం ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. సౌదీ అరేబియా యూనివర్శిటీ ఈ సమస్యను అధిగమిస్తూ.. కేవలం ఐదు నిమిషాల్లోనే తేనెతుట్టె ఆకారంతో కూడిన పలుచటి పొరను తయారు చేయడంలో విజయం సాధించింది.

ఒక రకమైన ప్లాస్టిక్‌తో తయారైన ఈ పొరను కాలుష్యాన్ని పీల్చేసేందుకు వాడుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సుజానా నూన్స్‌ తెలిపారు. రంధ్రాలతో కూడి ఉండటం.. నిలకడ కలిగి ఉండటంతో పాటు విస్తృతమైన ఉపరితల వైశాల్యం కారణంగా ఈ రకమైన పొరలను కావలసిన కాలుష్య కణాలను ఫిల్టర్‌ చేసేలా డిజైన్‌ చేసుకోవచ్చునని, కణాలతోపాటు వైరస్‌లను కూడా తొలగించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. అంతేకాకుండా ఈ పొరలను కొన్ని రకాల చికిత్సల్లోనూ వాడుకునేందుకు అవకాశముందని చెప్పారు. 

 

మరిన్ని వార్తలు