స్త్రీయేటివిటీ!

13 Aug, 2018 00:35 IST|Sakshi

స్త్రీలకు సంబంధం లేని వాటికి కూడా స్త్రీలనే పెట్టి పబ్లిసిటీని క్రియేట్‌ చెయ్యడం అన్నది భూమి మీద మగవాళ్లు ఉన్నప్పట్నుంచీ ఉంది. ఇప్పుడూ ఉంది. అయితే ఇప్పుడు తక్కువగా ఉంది. తక్కువవుతూ ఉంది. ఈ టైమ్‌లో మళ్లీ ఇప్పుడొక అలజడి.. ‘విల్నస్‌’ టూరిజం యాడ్‌!!

ఈశాన్య ఐరోపాలోని లిథువేనియా రాజధాని ‘విల్నస్‌’ ప్రత్యేకతలు ఏమిటో ఎవరికీ తెలియదు. ఎవరికైనా తెలుసేమో కానీ, లిథువేనియా పర్యాటక శాఖ తెలియదనే అనుకుంది. మరి తెలియని ప్రదేశం గురించి పరదేశీ టూరిస్టులకు తెలియజేసి, వారిని రప్పించడం ఎలా? పబ్లిసిటీ ఇవ్వాలి. అయితే ఊరికే.. ‘ఈ ప్లేస్‌ అద్భుతంగా ఉంటుంది.. వచ్చి చూడండి’ అని పబ్లిసిటీ ఇస్తే, ఆ ప్లేస్‌ను చూడటం అటుంచి ముందసలు పబ్లిసిటీ పోస్టర్‌ పైపే చూడరు. ఎలా మరి! క్రియేటివ్‌గా ఆలోచించి యాడ్‌ క్రియేట్‌ చెయ్యాలి. సోషల్‌ మీడియా వచ్చాక ఎవరికీ తక్కువ క్రియేటివిటీ లేదని తేలిపోయింది. అందుకని యాడ్‌ పోస్టర్‌ ‘హైలీ క్రియేటివ్‌’ గా ఉండాలి. అప్పుడే చూపు పడుతుంది. ఆసక్తి కలుగుతుంది.

లిథువేనియా టూరిజం వాళ్లు గత గురువారం ఇటువంటిదే ఒక హైలీ క్రియేటివ్‌ యాడ్‌ని విడుదల చేశారు. ఐరోపా మ్యాప్‌ మీద ఒక స్త్రీ వెల్లకిలా పడుకుని ఉంటుంది. అనుభూతి చెందుతున్న స్థితిలో ఆమె తన గుప్పెటతో మ్యాపులో విల్నస్‌ పట్టణం ఉన్నచోట దుప్పటి లాంటి ఆ మ్యాపును బిగించి పట్టుకుని ఉంటుంది. బిగిసిన నుదురు, విరిసిన జుట్టు, దగ్గరకు చేరిన కనుబొమలు.. అంతవరకే ఆ స్త్రీ ముఖం కనిపిస్తుంది. పైన ‘విల్నస్, ది జి–స్పాట్‌ ఆఫ్‌ యూరప్‌’ అని రాసి ఉంటుంది. ఆ పైన ‘నోబడీ నోస్‌ వేర్‌ ఇట్‌ ఈజ్, బట్‌ వెన్‌ యు ఫైండ్‌ ఇట్‌.. ఇటీజ్‌ అమేజింగ్‌’ అని ఉంటుంది. ‘అదెక్కడుందో ఎవరికీ తెలీదు. అయితే దానిని కనిపెడితే మాత్రం మహాద్భుతంగా ఉంటుంది’ అని భావం.

ఈ పోస్టర్‌ విడుదలయీ అవగానే లిథువేనియాలోని క్యాథలిక్కుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. విల్నస్‌లోని క్యాథలిక్‌ చర్చి ఈ దిక్కుమాలిన క్రియేటివిటీ మీద విరుచుకుపడింది. సెప్టెంబర్‌ 22 నుంచి 25 వరకు బాల్టిక్‌ దేశాల పర్యటనలో భాగంగా పోప్‌ ఫ్రాన్సిస్‌ విల్నస్‌కి కూడా వస్తున్నారు. చర్చి అధికారుల అసహనానికి అది కూడా ఒక కారణం. సరిగ్గా పోప్‌ వచ్చే ముందు ఈ దరిద్రం ఏమిటని వారు ప్రధానికి దృష్టికి  తీసుకెళ్లారు. ‘పోస్టర్‌లో హద్దులు మీరినతనమేమీ లేదు కానీ, పోస్టర్‌ని విడుదల చేసిన సమయమే.. అనుకోకుండా అనుచితం అయిందని నవ్వేశారు ఆయన. అంతే తప్ప పోస్టర్‌ని కాన్సిల్‌ చెయ్యమని అనలేదు. ముందుముందు అంటారేమో తెలీదు.

స్త్రీలకు సంబంధం లేని వాటికి కూడా స్త్రీలనే పెట్టి పబ్లిసిటీని క్రియేట్‌ చెయ్యడం అన్నది భూమి మీద మగవాళ్లు ఉన్నప్పట్నుంచీ ఉంది. ఇప్పుడూ ఉంది. అయితే ఇప్పుడు తక్కువగా ఉంది. తక్కువవుతూ ఉంది. క్రమంగా.. స్త్రీలకు సంబంధించినవని మనం అనుకుంటున్న గృహోపకరణాలు వగైరాలకు కూడా ఇప్పుడు మగవాళ్లను మోడల్‌గా పెట్టి యాడ్‌ పోస్టర్లు, కమర్షియల్‌ వీడియోలు క్రియేట్‌ చేస్తున్నారు. దాదాపుగా ‘జెండర్‌ న్యూట్రల్‌’ దశ చేరువలోకి వచ్చేసింది లోకం. ఈ టైమ్‌లో ఇప్పుడీ మాలోకం.. జి–స్పాట్‌ పోస్టర్‌!!

మరో ఐరోపా దేశం ఫ్రాన్స్‌లో ఇప్పుడు లైంగిక హింసను ప్రేరేపించే క్రియేటివిటీకి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. స్త్రీలను అశ్లీలంగా చూపే సృజనాత్మకత ఎక్కడున్నా.. అక్కడికి పిడికిళ్లు బిగించి వెళ్లిపోతున్నారు మహిళలు. ఫ్రాన్స్‌ సముద్ర తీర ప్రాంతంలోని రిసార్ట్‌లు ఎంత రమణీయంగా ఉంటాయో చెప్పడానికి.. బికినీలు ధరించి తీరం వెంబడి నడుస్తున్న యువతుల ఫొటోలను టూరిజం కార్డుల మీద ‘రిస్కే’గా (లైంగిక భావనలు కలిగించేలా) ముద్రించడంపై కొద్ది రోజులుగా అక్కడి స్త్రీవాద సంస్థ ‘ఫెమ్‌ సోల్జర్స్‌’ అభ్యంతరం చెబుతోంది. న్యూస్‌ స్టాండ్‌లు, టూరిజం స్టాల్స్, సావనీర్‌ షాపులలోని రిస్కే కార్డులను ఖాళీ చేయిస్తోంది. అలా ఖాళీ చేయించడం పురుషులకు నచ్చడం లేదు.

‘‘ఏళ్లుగా ఉన్నదే కదా. స్త్రీలు లేకుండా అందం, వినోదం ఉంటుందా’’ అని మగాళ్లు అంటుంటే.. ‘‘ఇలాంటి పురుషానందాల వల్లనే కదా స్త్రీలపై ఇంత లైంగిక హింస జరుగుతోంది’’ అని ఫెమ్‌ సోల్జర్స్‌ అరోపిస్తున్నారు. తక్షణం ఆకట్టుకోవడానికి సృజనాత్మకంగా చెప్పడం అవసరమే. అయితే  మైండ్‌కి టచ్‌ అవడం, హార్ట్‌కి టచ్‌ అవడం అని రెండు ఉంటాయి. సృజనాత్మకత మనసును తాకితే ఆహ్లాదంగా ఉంటుంది. మైండ్‌ను తాకితే అలజడిగా ఉంటుంది. స్త్రీ అంశతో యాడ్స్‌ చేసేటప్పుడు మనసూ, మైండ్‌ రెండూ కూడా ఆహ్లాదకరంగా లేకుంటే అది క్రియేటివిటీ అవదు. స్త్రీయేటివిటీ అవుతుంది. అది ఎక్కువ కాలం ఉండదు. మైండ్‌కి తప్ప హార్ట్‌కు టచ్‌ అవదు కాబట్టి.

విల్నస్‌ టూరిజం శాఖ వివాదాస్పద పబ్లిసిటీ పోస్టర్‌ఈ పోస్టర్‌ విడుదలయీ అవగానే లిథువేనియాలోని క్యాథలిక్కుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. విల్నస్‌లోని క్యాథలిక్‌ చర్చి ఈ దిక్కుమాలిన క్రియేటివిటీ మీద విరుచుకుపడింది.

- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు