ప్రతి అనుభవమూ ఆణిముత్యమే!

28 Nov, 2015 22:59 IST|Sakshi
ప్రతి అనుభవమూ ఆణిముత్యమే!

చార్లిస్ ఫ్రాన్సిస్ ఆడమ్స్ 19వ శతాబ్దపు మహా మేధావి. ఆయన కొడుకు బ్రూక్ ఆడమ్స్ కూడా గొప్ప మేధావి. తండ్రి చార్లెస్ తన డైరీలో ఒక రోజు ‘మా అబ్బాయి బ్రూక్‌తో చేపల వేటకు వెళ్లాను. దినమంతా వృధా అయింది’ అని రాసుకున్నాడు. ఆ రోజు గురించే బ్రూక్ తన డైరీలో ‘నాన్న నాతో చేపల వేటకు రావడం మహదానందకరం. మరువలేని రోజు ఇది’ అని రాసుకున్నాడు.ముందు మన జీవితం విలువ తెలిస్తే ఆయా అనుభవాల అంతరార్థం తెలుస్తుంది. అయితే మనకంటూ జీవితోద్దేశ్యం కూడా ఒకటుండాలి. ఫిలిప్పీ పట్టణంలో సువార్త ప్రకటించిన పౌలును, అతని అనుచరులను అక్కడివారు ఎదిరించి తీవ్రంగా కొట్టి జైలులో వేశారు.
 
 పౌలు, ఆయన బృందం జైలులో పాటలు, ప్రార్థనలతో గడిపారు. దేవుని సంకల్పంతో ఆ రాత్రి భూకంపం వచ్చి చెరసాల తలుపులు తెచుకున్నాయి. ఖైదీల సంకెళ్లు విడిపోయాయి. అయినా ఒక్క ఖైదీ కూడా పారిపోకపోవడం నాటి రాత్రి జరిగిన అద్భుతం! పౌలు పాటలు, ప్రార్థనలు, మాటలు వారిని జైలులో అంతగా కట్టివేశాయి. చివరకు ఖైదీలు, జైలరు అతని కుటుంబం కూడా ఆ రాత్రి రక్షణ పొందారు (అపొ.కా. 16:16-40). నైరాశ్యం, నిట్టూర్పులు, రోదనలతో నిండిన జైలు ఆ రాత్రి గొప్ప సువార్త సభకు, ఆత్మల సంపాదనకు వేదిక అయింది. అలా అత్యంత ప్రతికూలతలో, అర్ధరాత్రివేళ అపురూపమైన ఫిలిప్పీ చర్చి ఆవిర్భవించింది. అప్పుడు డైరీలుంటే ‘దెబ్బలు తిని జైలు పాలైన కాళరాత్రి’ అని రాసుకునే బదులు ‘కరడు కట్టిన ఖైదీలను, కఠినాత్ముడైన జైలరును దేవుడు రక్షించిన శుభరాత్రి’ అని పౌలు రాసుకొని ఉండేవాడు.
 
 మనిషికి ప్రధాన శత్రువు, మిత్రుడు కూడా అతని దృక్పథమే. దేవుని ప్రేమ మనకర్థం కాకపోతే మన జీవితం విలువ మనకు అర్థంకాదు. ప్రాణమిచ్చేందుకు కూడా సిద్ధపడి ప్రసవంలో బిడ్డను కంటుంది కాబట్టే తల్లి తన బిడ్డను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తుంది. దేవుని త్రాసులో ఒకవైపు తన పరలోక భూలోక వైభవాన్నంతటినీ, మరోవైపు ‘పాపిని’ పెడితే, పాపి ముందు అదంతా తేలిపోయింది కాబట్టే యేసుక్రీస్తు అదంతా వదిలేసి, రిక్తుడిగా, దాసుడుగా, సాత్వికుడుగా ఈ లోకానికి పాపిని రక్షించేందుకు వేంచేశాడు. చివరకు రక్షకుడుగా సిలువలో ప్రాణమిచ్చి మరీ పాపిని గెలుచుకున్నాడు. ఏది వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న దాన్ని బట్టే మనం పొందాలనుకుంటున్నది ఎంత విలువైనదో అర్థమౌతుంది.
 
  కోటీశ్వరులకు, ప్రతిభావంతులకు, పాలకులకు, ఉన్నత వర్గాల వారికి ఈలోకం పెద్ద పీట వేస్తుంది. కానీ సర్వశక్తిమంతుడు, సర్వైశ్వర్యమంతుడూ అయిన దేవుడు మాత్రం పేదలు, పాపులు, దాసులు, బలహీనుల కోసమే తాపత్రయపడ్తాడు. ఒక వ్యక్తికి అనుకోకుండా ధనమో, పదవో, మరేదైనా లాభమో కలిసొస్తే లోకం చప్పట్లు కొడుతుంది. కానీ ఒక పాపి పరివర్తన చెందిన ప్రతిసారీ పరలోకం ఆనందసంబరాలతో మారుమోగుతుందని యేసుక్రీస్తే ప్రకటించాడు (లూకా 15:7). పడిపోయిన వారిని పునరుద్ధరించడమే ఇతివృత్తంగా ‘దేవుని ప్రేమ కథ’ ఇప్పటికీ కొనసాగుతోంది.
 
 ఆ ఆనందాన్ని అర్థం చేసుకునే ఆదిమ విశ్వాసులు, భక్తులు, స్వచ్ఛందంగా ఉరికంబాలెక్కారు. పులులకు ఆహారంగా వేయబడ్డారు. సజీవంగా దహనమయ్యారు. వారి ప్రాణత్యాగ సాక్ష్యాలే సజీవ విత్తనాలై సువార్తోద్యమానికి అంకురార్పణ చేసేశాయి. రుమేనియా జైలులో విశ్వాసియైన ఖైదీని ఒక అధికారి చితకబాదుతూ ‘నిన్ను కొట్టకుండా ఆపే శక్తినీ దేవునికి, నీకూ ఉందా?’ అని విర్రవీగాడు. ‘‘నువ్వెంత కొట్టినా నిన్ను ప్రేమించకుండా నన్ను ఆపే శక్తి నీకుందా?’ అని సవాలుతో కూడిన జవాబిచ్చాడు మహాభక్తుడైన రిచర్డ్ వర్మ్‌బ్రాండ్ అనే ఆ ఖైదీ.’’
 - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్
 prabhukiran123@rediffmail.com

 

మరిన్ని వార్తలు