కరోనా కుయ్యో మొర్రో

13 Apr, 2020 04:58 IST|Sakshi

ప్రపంచమంతా కరోనా వర్రీలో ఉంది. మహిళా దేశాధినేతలు ఉన్న చోట మాత్రం.. కరోనానే.. కుయ్యో మొర్రో అంటోంది! చాల్లెద్దూ.. మాట వినే రకమా కరోనా? వినే రకం కాకపోవచ్చు. కానీ.. జర్మనీ, న్యూజిలాండ్, ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్, బెల్జియం, డెన్మార్క్‌ దేశాల పాలకులు ఊరుకునే రకం కాదు. కరోనాను ఎలా దారికి తేవాలో ప్రజలకు చెప్పారు. ‘మీ దగ్గరకు కరోనాను రప్పించుకోండి. అప్పుడు కరోనా ఎవరి దగ్గరకూ వెళ్లదు’ అన్నారు. అదే నిజమైంది. ఈ దేశాల్లో కరోనా గ్రాఫ్‌ సాగిలపడుతోంది.

న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌. వయసు 39 ఏళ్లు. నవ్వు ముఖం. బొద్దింకలపై హిట్‌ కొట్టినట్లు ప్రజా సమస్యల్ని పోగొట్టేస్తుంటారు. కొత్త సమస్య.. కరోనా వచ్చింది. యాభై లక్షల జనాభా. కరోనాకు కావలసినంత పాడి. కానీ దగ్గరకు వెళ్లలే కపోయింది! ప్రజలకు ఒకటే మాట చెప్పారు జెసిండా. ‘‘యాక్ట్‌ లైక్‌ యు హ్యావ్‌ కరోనా వైరస్‌’’.  మీకొస్తుందని తలుపు వేసుకోకండి. వచ్చిందని వేసుకోండి. అప్పుడు కరోనా ఎవరి తలుపూ కొట్టదు అని చెప్పారు. బాధ్యతను పెంచడం ఇది. దెబ్బతో కరోనా కంట్రోల్‌ అయింది. మనలాగే మార్చి 25 న లాక్‌డౌన్‌ విధించారు జెసిండా. విదేశాల నుంచి విమానం దిగిన వారిని వెనువెంటనే ఐసోలేషన్‌కి పంపిన తొలి దేశాలలో న్యూజిలాండ్‌ ఒకటి.

ఏంజెలా మెర్కిల్‌ సీనియర్‌ లీడర్‌. 65 ఏళ్లు. పద్నాలుగేళ్గుగా జర్మనీ చాన్స్‌లర్‌. 8 కోట్ల 50 లక్షల జనాభా. మార్చి 11న ‘ఒకరికొకరు దూరంగా ఉండండి’ అనే ప్రకటన చేశారు. ‘దూరంగా ఉండకపోతే ముగ్గురిలో ఒకరి వచ్చినా ఆశ్చర్యం లేదు’ అని మర్నాడే హెచ్చరిక. ప్రస్తుతం కేసులూ ఉంటున్నాయి. రికవరీలూ ఉంటున్నాయి. మూసివేసిన కేసుల్లో 95 శాతం రికవరీలు, 5 శాతం మరణాలు.  వారానికి జర్మనీ ఇప్పుడు 5 లక్షల కరోనా పరీక్షలు చేస్తోంది. మిగతా ఐరోపా దేశాల్లో జరుగుతున్న పరీక్షల కంటే ఎక్కువ. ఐ.సి.యు. బెడ్‌లు, వెంటిలేటర్‌లకు కొరత లేకుండా చూసుకున్నారు.

లాక్‌డౌన్‌లో ఎకానమీ డౌన్‌ అవకుండా ముందే లక్ష కోట్ల యూరోలతో ప్లాన్‌ సిద్ధం చేసుకున్నారు. ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఏంజెలాను.. చలించని ధీమంతురాలు అని కీర్తించింది. ‘‘ఆర్థిక సంక్షోభాలలో పొదుపు ఖాతాల జోలికి వెళ్లని ఏంజెలా, పది లక్షల మంది వలస కార్మికుల్ని దేశంలోకి ఆహ్వానించిన ఏంజెలా.. ఇప్పుడీ కరోనా గడ్డుకాలం నుంచి ప్రజల్ని తేలిగ్గా గట్టెక్కించగలరని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజలూ ఆమె చెప్పినట్లే చేస్తున్నారు’’ అని రాసింది. జెసిండా తన ప్రజలకు చెప్పినట్లే ఏంజెలా కూడా.. ‘కరోనా మనకొస్తుందేమో అని కాకుండా.. మనం రప్పిస్తామేమో అన్నంత జాగ్రత్తగా ఉండాలి’ అని విజ్ఞప్తి చేశారు. 

బెల్జియం ప్రధానమంత్రి సోఫీ విల్మేస్‌. వయసు 45. మృతుల సంఖ్య 10 కి చేరుకోగానే దేశంలో లాక్‌డౌన్‌ విధించారు. బెల్జియం జనాభా కోటీ 20 లక్షలు. లాక్‌డౌన్‌కి ముందు దేశాన్ని ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగం చాలా స్పష్టంగా, ప్రజల్ని ఒప్పించేలా ఉంది. ‘‘లాక్‌డౌన్‌ అవసరం లేదు. లాక్‌డౌన్‌ అవసరం కలగకూడదనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాకండి. అత్యవసరం అయినా విదేశీయానం చేయకండి’’. రెండే మాటలు. బలంగా పనిచేశాయి. కరోనా మరణాలను సోఫీ అతి తక్కువ సమయంలోనే అదుపు చేయగలిగారు. 

ఫిన్‌లాండ్‌లో ఏప్రిల్‌ 6 నుంచి కరోనా మరణాల సంఖ్య తగ్గడం మొదలైంది. ఫిన్‌లాండ్‌ జనాభా 56 లక్షలు. ఇప్పటివరకు ఆ దేశంలో నమోదైన మరణాలు 49. ఫిన్‌లాండ్‌ ప్రధానమంత్రి సనా మారిన్‌ లాక్‌డౌన్‌ని మే 13 వరకు పొడిగిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటన చేశారు. ప్రపంచంలోని అతి చిన్న వయసు మహిళా ప్రధాని అయిన సనా (34) కూడా న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండాలా ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తారు. ‘‘ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు సహకరిస్తే చాలు’’ అని సనా తన కరోనా ప్రసంగంలో కోరారు.

మహిళా ప్రధానులు ఉన్న ఐస్‌లాండ్, డెన్మార్క్‌ దేశాలలో కూడా కరోనా కేసులు తక్కువగా ఉండటమో, తక్కువ మరణాలు నమోదవడమో, కోలుకుంటున్నవాళ్లు ఎక్కువగా ఉండటమో కనిపిస్తోంది. ఐస్‌లాండ్‌ జనాభా మూడున్నర లక్షలు. డెన్మార్క్‌ జనాభా 50 లక్షల 80 వేలు. ఐస్‌లాండ్‌ ప్రధాని కత్రిన్‌ జాకబ్‌డోటిర్‌ (44).. దూరాన్ని పాటించాలని ప్రజలకు చెబుతూనే, ఆర్థిక భారాలను పెరగన్వికుండా జాగ్రత్తపడ్డారు. కరోనా ప్రభావాన్ని తట్టుకునేందుకు 23,000 కోట్ల ‘క్రోనా’ల (వంద కోట్ల ఆరవై లక్షల డాలర్లు) అత్యవసర ఆర్థిక నిల్వల్ని పోగేశారు. ఇక డెన్మార్క్‌ ప్రధాని మ్యాటీ ఫ్రెడ్రిక్‌సన్‌ (42) ఈ నెల 15 నుంచి డే కేర్‌ సెంటర్‌లను, పాఠశాలలను తిరిగి తెరవబోతున్నారు!

గత మూడు వారాలుగా ఆ దేశం లాక్‌డౌన్‌లో ఉంది. ఐస్‌లాండ్‌ ప్రధాని కత్రిన్‌లా.. లాక్‌డౌన్‌ లాక్‌డౌనే, ఎకానమీ ఎకానమీనే అన్నట్లు మ్యాటీ కూడా ఒకదాని ప్రభావం ఇంకోదానిపై పడకుండా చర్యలు తీసుకున్నారు. ఎంత కష్టంలోనూ దేశంలోని ప్రైవేటు కంపెనీల సిబ్బంది జీతాలలో 25 శాతానికి మించి కోత విధించడానికి వీల్లేదని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ఆరుగురు దేశాధినేతలు మహిళలు కాబట్టి సమర్థంగా పని చేస్తున్నారని, మహిళలు అయినప్పటికీ కరోనాను ఎదుర్కోగలుగుతున్నారని చెప్పడం కాదిది. ప్రపంచ దేశాలకు పనికొచ్చే కష్టకాలపు పాఠాలు వీళ్ల దగ్గర ఉన్నాయని చెప్పుకోవడం.

మరిన్ని వార్తలు