కరోనా... చర్మంపై ప్రభావం!

16 Jul, 2020 06:29 IST|Sakshi

మనం ఏ పూలచెట్టు దగ్గరికో పోతాం. అక్కడ పుప్పొడి లేదా చెట్టుతీగలు గానీ చర్మానికి తగిలినప్పుడు మేను కందిపోయినట్లు అవుతుంది. ఎర్రటి దద్దుర్లో, ర్యాషో వస్తుంది. అచ్చం అలాంటి ర్యాష్‌లు, దద్దుర్లు, చిన్న పగుళ్లలాంటి గాయాలు, గుల్లలు, మచ్చలు, చర్మం ఎర్రబారడాలు వంటివన్నీ కోవిడ్‌–19 తాలూకు అసలు లక్షణాలు బయటపడటానికి కాస్త ముందుగా కనిపిస్తాయని పరిశోధకుల అధ్యయనాల్లో, వైద్యనిపుణుల పరిశీలనల్లో తేలింది. అయితే పైన పేర్కొన్న చర్మ సంబంధిత లక్షణాలు కేవలం 20% మంది కోవిడ్‌–19 రోగుల్లో కనిపిస్తాయి కాబట్టి ప్రతి చర్మపు మచ్చలనూ, గుల్లలనూ, ర్యాష్‌నూ, పొడలనూ అనుమానిస్తూ, దిగులుపడకుండా అవగాహన కోసం ఈ కథనం.  

మార్బిల్లిఫామ్‌ ర్యాష్‌: ఇది చర్మం ఎర్రబారినట్లుగా కనిపించే పొడ. దీన్ని వైద్యపరిభాషలో ఎరిథమెటోస్‌ / మార్బిల్లిఫామ్‌ ర్యాష్‌ లేదా ఎరప్షన్‌గా చెబుతారు. ఇటలీ వాసుల్లో దాదాపు 70 శాతం మందికి ఇలా కనిపిస్తుంది. ఇటలీ దేశస్థుల్లోనే కాకుండా... చాలామంది స్పానిష్‌ రోగుల్లోనూ ఇది కనిపించడం విశేషం. చిన్నచిన్న స్పాట్స్‌గా, గుంపులు గుంపులుగా వచ్చే దగ్గరి దగ్గరి మచ్చల (పర్పురా) రూపంలో ఉన్న ఈ మచ్చలన్నీ కలిసిపోయి... ఎర్రటి పొడలా కనిపిస్తుంటాయి.

అర్టికేరియా: సాధారణంగా మనకు సరిపడని పౌడర్లు, పుప్పొడి వంటివి చర్మంపై పడ్డప్పుడు చిన్న చిన్న దద్దుర్లు వచ్చి... వాటంతట అవే తగ్గిపోతుండటాన్ని చూస్తుంటాం. ఇలాంటి దద్దుర్లనే వైద్యపరిభాషలో అర్టికేరియా అంటారు. ఇవి కూడా ఎర్రటి ర్యాష్‌లా కనిపిస్తుంటాయి. ఇటలీలోని రోగుల్లో జరిగిన అధ్యయనం ప్రకారం ప్రతి 18 మంది రోగుల్లో ముగ్గురికి ఈ లక్షణాలు కనిపించాయి. స్పెయిన్‌ డాక్టర్ల పరిశీలన ప్రకారం అక్కడి 32 ఏళ్ల మహిళకూ, అలాగే ఫ్రాన్స్‌కు చెందిన 27 ఏళ్ల మహిళకూ ఇవే లక్షణాలు కనిపించినప్పుడు... కోవిడ్‌–19 తాలూకు మిగతా లక్షణాలకు ఇచ్చే సింప్టమాటిక్‌ చికిత్సలాగే... ఈ అర్టికేరియాకు కూడా యాంటీహిస్టమైన్స్‌ ఇచ్చి చికిత్స చేశారు. కాబట్టి వీటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇలాంటివేవైనా కనిపించిన తర్వాత... కోవిడ్‌–19 లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు లాంటివేవైనా కనిపిస్తాయేమో కనిపెట్టుకుని ఉండాలి. ఇలాంటి ర్యాష్‌ ఫ్రాన్స్, ఫిన్‌ల్యాండ్, కెనడా, యూఎస్‌కు చెందిన అనేక రోగుల్లో కనిపించడం రిపోర్ట్‌ అయ్యింది.

వెసిక్యులార్‌ ఎరప్షన్స్‌: ఈ గుల్లలు అచ్చం చికెన్‌పాక్స్‌లో కనిపించే గుల్లల్లాగే ఉంటాయి. వారిసెల్లా ఇన్ఫెక్షన్‌లో కనిపించేలాంటి ఈ గుల్లలు ఇటలీలోని కొందరు కోవిడ్‌–19 రోగుల్లో కనిపించడం వైద్యనిపుణులు గమనించారు. ఇలాంటి గుల్లలు కనిపించిన మూడు రోజుల తర్వాత కోవిడ్‌–19 తాలూకు అసలు లక్షణాలైన జ్వరం, దగ్గు వంటివి కనిపించడాన్ని వైద్యనిపుణులు గమనించారు. అయితే చర్మంపై కనిపించిన వాటి తీవ్రతకూ, కోవిడ్‌–19 తాలూకు వ్యాధి తీవ్రతకూ ఎలాంటి సంబంధం లేకపోవడంతో బయాప్సీ వంటి పరీక్షలు నిర్వహించి వీటిని మరింత జాగ్రత్తగా పరిశీలించి చూశారు. చాలా సందర్భాల్లో వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ వచ్చిన రోగుల్లో ఇలాంటి గుల్లలే వస్తుంటాయనీ, అలాగే ఈ వైరల్‌ ఇన్ఫెక్షన్‌లోనూ కనిపించినట్లు పరిశీలనలో వెల్లడయ్యింది.

కోవిడ్‌ టోస్‌: కొందరు కోవిడ్‌–19 రోగుల్లో కాళ్ల వేలి చివర్లు ఎర్రగా కనిపించడాన్ని నిపుణులు గమనించారు. ముఖ్యంగా స్పానిష్‌ రోగుల పరిశీలనలో మహిళల మడమల మీద అవి రావడాన్ని చూశారు. ఇలా కోవిడ్‌–19 రోగుల కాలివేళ్ల చివర కనిపిస్తాయి కాబట్టి వీటిని ‘కోవిడ్‌ టోస్‌’ అని కూడా నిపుణులు పిలుస్తున్నారు. కువైట్‌కు చెందిన కొంతమంది రోగుల్లోనూ ఇవి కనిపించడం విశేషం.

లివిడాయిడ్‌ ఎరప్షన్స్‌ / లివిడో రెటిక్యులారిస్‌:ఇవి యూఎస్‌కు చెందిన చాలామంది రోగుల చర్మం పైన కనిపించాయి. కొందరిలో చర్మం కింద రక్తనాళాలు  స్పష్టంగా కనిపిస్తుంటాయి. సాధారణంగా చర్మం పారదర్శకంగా ఉండే వారిలో ఇలా రక్తనాళాలు స్పష్టంగా కనిపించడం చూస్తుంటాం. కోవిడ్‌–19 వచ్చిన కొందరు రోగుల్లో ఈ రక్తనాళాలు ఎర్రగా... ఒకదాని తో మరొకటి అల్లుకుపోయిన వల మాదిరిగా కనిపించడం వల్లే వాటిని ‘లివిడో రెటిక్యులారిస్‌’ అంటారు.

పెటీకియల్‌ మచ్చలు:డెంగీ రోగుల్లో అంతర్గత రక్తస్రావం కావడం ఒక లక్షణం. ఇలాంటి లక్షణాలతో వ్యక్తమయ్యే డెంగీ వ్యాధిని ‘డెంగీ హేమరేజిక్‌ ఫీవర్‌’ అని కూడా అంటారు. ఇలాంటి లక్షణాలతో డెంగీ ఫీవర్‌ కనిపించనప్పుడు సాధారణంగా చర్మం కింద పూస పూసలుగా రక్తపు మచ్చలు పక్కపక్కనే కనిపిస్తుండటం చూస్తుంటాం. ఇలా మనం బయటి నుంచి చూసినప్పుడు చర్మం కింద కనిపించే ఈ రక్తపు పూసలను వైద్యపరిభాషలో ‘పెటికీ’ అని అంటుంటారు. డెంగీలాగే... కోవిడ్‌–19 కూడా ఓ వైరల్‌ జ్వరమే కావడం వల్ల అచ్చం ఇలాంటి లక్షణాలే కోవిడ్‌–19 వచ్చిన కొందరు రోగుల్లో కనిపించడాన్ని నిపుణులు గమనించారు. ముఖ్యంగా ఈ తరహా మచ్చలు యూఎస్‌లోని కరోనా రోగుల్లో గమనించారు.

ఇతరత్రా సమస్యలు: నిర్దిష్టంగా పైన పేర్కొన్న మచ్చలే గాకుండా కొందరిలో పొడిచర్మంపైన కాలిమడమలపై పగుళ్లు (ఎరప్షన్స్‌) వచ్చిన రీతిలోనే కొందరు రోగుల్లో కనిపించడం కూడా వైద్యనిపుణులు గమనించారు. అయితే కోవిడ్‌–19 రోగులందరినీ తీసుకుంటే గరిష్టంగా 20% రోగుల్లో మాత్రమే చర్మానికి సంబంధించిన పైన పేర్కొన్న లక్షణాలు రావడాన్ని పరిశోధకులు, అధ్యయనవేత్తలు చూశారు. కాకపోతే... ప్రధాన లక్షణాలు కనిపించడానికి కాస్తంత ముందుగా చర్మానికి సంబంధించిన లక్షణాలు కనిపించడం ఓ విశేషం. అందుకే చర్మంపై ఎలాంటి మచ్చలు వచ్చినా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లోకి వెళ్లండి. ఐదురోజుల తర్వాత జ్వరమూ, దగ్గు, జలుబు వంటి లక్షణాలు లేకపోతే మీరు నిశ్చింతగా ఉండవచ్చు. మీ పరిశీలన కోసం రెండు ముఖ్య లక్షణాలను గమనంలో పెట్టుకోండి. అవి... కరోనా రోగుల్లో చాలామందిలో కనిపించే నిర్దిష్ట లక్షణం జ్వరం, దగ్గుతో పాటు వాసనలు , రుచులు తెలియకపోవడం. అందుకే పై లక్షణాలన్నింటితో పాటు వాసనలూ, రుచులూ తెలియనప్పుడు వెంటనే వైద్యపరీక్షల కోసం వెళ్లండి.అయితే నిశ్చింతగా, ఆహ్లాదంగా ఉంటూ పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ, తగినంత వ్యాయామం చేస్తూ ఉండటం వల్ల కోవిడ్‌–19 నుంచి రక్షణ పొందడంతో పాటు చర్మానికి సంబంధించి ఏ సమస్యలూ రాకుండా చూసుకోవచ్చు.-డాక్టర్‌ స్వప్నప్రియ సీనియర్‌డర్మటాలజిస్ట్‌

మరిన్ని వార్తలు