బటన్‌ మాస్క్‌

21 May, 2020 09:22 IST|Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఫేస్‌ మాస్క్‌లు ధరించడం అత్యవసరం అయినప్పటికీ ఎక్కువసేపు ధరించడం వల్ల ముఖ్యంగా చెవులు నొప్పి పెడతాయి. చెవిపైన మచ్చలు ఏర్పడే అవకాశమూ ఉంది. ఎలాస్టిక్‌ లూప్స్, కాటన్‌ లూప్స్‌ వల్ల చర్మం బాగా రాపిడికి లోనై ఇలా చెవి నొప్పి వచ్చే అవకాశం ఉంది. దీంతో మాస్క్‌ ధరించడానికి ఇష్టపడరు. మాస్క్‌ సౌకర్యవంతంగా ఉండటానికి చాలా మంది సరళమైన మార్పులు చేస్తున్నారు. వాటిలో సౌలభ్యంగా ఉన్నది ఈ బటన్‌ మాస్క్‌. 

ఎలాస్టిక్‌ లూప్స్‌ లేదా ఇతర లూప్స్‌ వల్ల చెవులకు దురద ఇతర ఇరిటేషన్‌ సమస్య రాకుండా ఉండటానికి చెన్నైకి చెందిన రతీష్‌ ఈ బటన్‌ మోడల్‌ మాస్క్‌ను ఆవిష్కరించారు. ప్రకృతి ప్రొడక్ట్స్‌ను తయారు చేసే సంస్థ వ్యవస్థాపకుడు రతీష్‌. ‘నేను గంటల పాటు మాస్క్‌ను ధరించినప్పుడు ఆ నొప్పిని అనుభవించాను. అలాంటప్పుడు ఫ్రంట్‌లైన్‌ కార్మికుల బాధ ఎంత ధారుణంగా ఉంటుందో ఊహించాను. దీంతో ఇంటర్నెట్‌ అంతా జల్లెడ పడితే చాలా రకాల మోడల్స్‌ కనిపించాయి. 

కానీ, పర్యావరణ అనుకూలమైనవి అందించాలనుకున్నాను. దీంతో ఈ ఆలోచన చేశాను. కాటన్‌ బెల్ట్‌లాంటిది ఏర్పాటు చేసి, రెండు బటన్స్‌ కుట్టించాను. రెండు లూప్స్‌ చెవులకు బదులు ఇలా ఈ బటన్స్‌కి తగిలిస్తే చెవులకు అసౌకర్యంగా ఉండదు. పనిలోనూ సౌలభ్యంగా ఉంటుంది. వీటిని ఉతికి తిరిగి వాడుకోవచ్చు’ అని దీని ఉపయోగం వివరించాడు రతీష్‌. 

మరిన్ని వార్తలు