ఆకలి 'చేప'

4 Apr, 2020 08:15 IST|Sakshi

కరోనా కథ

మెడికల్‌ షాప్‌ ముందు జనం నలుగురైదుగురు ఉన్నారు. అందరి మధ్యలో పన్నెండేళ్ళ కుర్రాడు దోషిలా నిలబడ్డాడు. వాడి చేతిలో ఓ కవరుంది. ఆక్కడ జనం అప్పటికే వాడ్ని కొట్టినట్లున్నారు. వాడు ఏడుస్తూ చొక్కా చివరతో కళ్ళూ, ముక్కు తుడుచుకుంటున్నాడు.

‘‘వీడు చూడండి. వేలెడంతలేడు. అప్పుడే దొంగతనాలు చేస్తున్నాడు. రేపు పెద్ద క్రిమినల్‌ అయిపోతాడు’’ షాపు ఓనర్‌ ఆ కుర్రాడి జబ్బ పట్టుకుని చెపుతున్నాడు.
‘‘నేను దొంగోణ్ణి కాదు బాబు. మా అమ్మ సందుల్లో తిరిగి కూరలు ఆమ్ముతాది. ఆమెకు ఒక మాస్క్‌ ఇద్దామని.. ఈ రెండు అట్టుకుని లగెత్తుదామనుకున్నా. అంతే! సార్‌ పట్టేశారు’’ వెక్కుతున్నాడు కుర్రాడు.
‘‘ఇలాటోణ్ణి వదిలేయకూడదు. పోలీసులకు పట్టించాలి’’ అన్నాడింకో మనిషి.

ఇంతలో పోలీస్‌ వాన్‌ వచ్చింది. పోలీస్‌ దిగాడు. వెక్కుతున్న కుర్రాడ్ని కాలర్‌ పట్టుకుని తీసుకెళ్లి వాన్‌ ఎక్కించాడు. షాప్‌ ఓనర్‌ గజదొంగని చట్టానికి అప్పచెప్పినట్లు ఫోజ్‌ ఇస్తూ షాప్‌ లోపలికెళ్ళాడు.
‘‘బ్రేకింగ్‌ న్యూస్‌! ముంబైలో నాలుగు కోట్లు విలువైన మాస్కులు బ్లాక్‌ మార్కెట్‌ చేసిన వ్యాపారి... ’’అని టీవీలో ఓ ఛానల్‌ లో స్క్రోలింగ్‌ పదే పదే మొత్తుకుంటోంది. ప్రపంచం తెలియని చిన్నచేప వలలో చిక్కింది. తిమింగలం బయటపడింది. ఈ విషయాలేమి పట్టనట్లు తన వ్యాపారం తాను చేసుకుంటున్నాడు షాప్‌ ఓనర్‌. –పెమ్మరాజు విజయ రామచంద్ర
 

మరిన్ని వార్తలు