చేతులు కడుక్కోని వారూ ఉన్నారు!

19 Apr, 2020 09:27 IST|Sakshi

తరచూ చేతులు కడుక్కుంటున్నారా? సబ్బు పెట్టి కనీసం 20 సెకన్లయినా శుభ్రం చేసుకుంటున్నారా? లేదంటే కరోనా బూచి మిమ్మల్ని పట్టేసుకుంటుంది. ఇదే కదా కొన్ని నెలలుగా వింటున్నాం. వాస్తవం కూడా ఇదే. సాంక్రమిక వ్యాధుల్లో కనీసం 80 శాతం అపరిశుభ్రమైన చేతుల ద్వారానే ఇతరులకు వ్యాపిస్తాయని సైన్స్‌ చెబుతోంది. ఓ ఏడాదిపాటు చేతులు కడుక్కోకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా? అంతకంటే ముందు మనలో చేతులు ఎందరు కడుక్కుంటారో చూద్దాం. 

అమెరికాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) అధ్యయనం ప్రకారం 69 శాతం పురుషులు, 35 శాతం మహిళలు పబ్లిక్‌ బాత్రూమ్‌లు వాడిన తరువాత చేతులు కడుక్కోరట. దగ్గినా లేదా తుమ్మిన తరువాత చేతులు కడుక్కోని వారు నూటికి 93 మంది! ఇప్పుడు ఒక ఏడాదిపాటు మీరు సబ్బు లేదా శానిటైజర్‌ వాడకపోతే ఏమవుతుందో చూద్దాం. వర్షంలో తడవడం, ఈత కొట్టడం, సబ్బు లేకుండా స్నానం చేయడం వంటి వాటి ద్వారా కొంతమేరకు బ్యాక్టీరియా/వైరస్‌ తొలగిపోవచ్చుగానీ సబ్బు, శానిటైజర్లు వాడటం ఆపేసిన కొంత కాలానికే మీరు జబ్బు పడటం మాత్రం గ్యారంటీ. 

ఎంతకాలంలో అన్నది మీరు ఎంత మందిని కలుస్తున్నారు? ఎక్కడెక్కడ తిరిగారు? వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని రోజుల తరువాత చేతులు మురికిగా అనిపిస్తాయి. మట్టి, మడ్డిలతోపాటు బోలెడంత బ్యాక్టీరియా ఇప్పటికే చేతిపై తిష్టవేసి ఉంటుంది. మీ గురించి తెలిసిన వారు మీ దగ్గరికి వచ్చినా షేక్‌హ్యాండ్‌ మాత్రం ఇవ్వరు. కొలరాడో యూనివర్సిటీ చేసిన ఒక పరిశోధనను బట్టి చూస్తే మన చేతులపై కనీసం 150 జాతులకు చెందిన 3,200 బ్యాక్టీరియా ఉంటాయి. మలమూత్రాలకు వెళ్లిన ప్రతిసారీ వేలి మొనలపై ఉండే బ్యాక్టీరియా సంతతి రెట్టింపు అవుతుంది. 

బాత్రూమ్‌ ఫ్లష్‌ను ఒక్కసారి వాడితే బ్యాక్టీరియా/వైరస్‌లు దాదాపు 6 అడుగుల దూరం వరకూ వ్యాపిస్తాయి. వాటివల్ల అతిసారం వంటివి తరచూ బాధిస్తాయి. జలుబు లాంటివి ఎక్కువవుతాయి. డాక్టర్లు ఇచ్చే యాంటీబయాటిక్‌లు వాడటం.. కొంత కాలానికి బ్యాక్టీరియా/వైరస్‌లు ఈ మందులకు అలవాటు పడిపోవడం జరిగిపోతుంది. కొంత సమయం తరువాత మీ చుట్టూ ఉన్న వారూ జబ్బు పడిపోతారు. ఇవన్నీ ఎందుకు అనుకుంటే.. ఎంచక్కా రోజులో కనీసం నాలుగైదు సార్లు 20 సెకన్లపాటు చేతులు శుభ్రం చేసుకోండి.

మరిన్ని వార్తలు