రోజూ తలస్నానం మంచిదేనా?

29 Aug, 2019 08:11 IST|Sakshi

నేను ఒక క్రీడాకారుణ్ణి. నాకు మాడుపైన విపరీతంగా చెమట పడుతుంటుంది. దాంతో నేను రోజూ తలస్నానం చేస్తుంటాను. ఇలా రోజూ తలస్నానం చేయడం మంచిదేనా? అలా చేస్తే జుట్టు ఎక్కువగా రాలుతుందా?– వినయ్, మెదక్‌
మాడుపై చెమట పట్టినప్పుడు తలస్నానం చేయడం మంచిదే. అలా చేయకపోతేనే సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు బాగా చెమట పట్టినా తలస్నానం చేయనందువల్ల మాడుపై దురద, చుండ్రు (డాండ్రఫ్‌), జుట్టురాలడం వంటి సమస్యలు వస్తాయి. అయితే మీరిలా రోజూ తలస్నానం చేసే సమయంలో వాడే షాంపూలాంటి ఉత్పాదనల్లో కఠినమైన రసాయనాలు (హార్ష్‌ కెమికల్స్‌) ఉంటే కూడా కొన్ని సమస్యలు రావచ్చు. ఇక మీరు రోజూ తలస్నానం చేసేందుకు ఉప్పునీరు వాడుతున్నా కూడా జుట్టు రాలే సమస్య ఉత్పన్నం కావచ్చు. కాబట్టి మీరొకసారి డాక్టర్‌ను కలిసి, మీకు అనువైన షాంపూ ఎంపిక లాంటి జాగ్రత్తలను తెలుసుకోండి.

పాప పెదవులపై దురద...ఎందుకిలా?
మా పాప వయసు ఎనిమిదేళ్లు. ఆమె పెదవుల మీద, ఆ చుట్టూర ఉన్న భాగమంతా బాగా దురదగా ఉంటోందని చెబుతోంది. తన పెదవులు తరచూ పగిలినట్లుగా కనిపిస్తుంటాయి. మా పాపకు ఉన్న సమస్య ఏమిటి?– అమృత, వరంగల్‌
మీ పాపకు పెదవుల దగ్గర అలర్జీ రావడం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. ఈ పరిణామానికి అనేక అంశాలు కారణమవుతాయి. ముఖ్యంగా మీ పాపకు తరచూ పెదవులను నాలుకతో తడి చేసుకునే అలవాటు ఉంటే వెంటనే దాన్ని మాన్పించాల్సి ఉంటుంది. అంతేకాదు... కొన్నిసార్లు పెదవులపై వాడే ఉత్పాదనలు కూడా అలర్జీకి కారణమవుతాయి. ఉదాహరణకు లిప్‌బామ్, పేస్ట్‌ లాంటివి. మీరు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, పాపకు అలా జరగడానికి నిర్దిష్టమైన కారణం ఏమిటో తెలుసుకోవాలి. కారణాన్ని బట్టి చికిత్స ఇవ్వవచ్చు.డాక్టర్‌ సుభాషిణి జయం,కన్సల్టెంట్‌ మెడికల్‌ కాస్మటాలజిస్ట్,ఎన్‌ఛాంట్‌ మెడికల్‌ కాస్మటాలజీ క్లినిక్, శ్రీనగర్‌కాలనీ, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా