నురగ కాసిన పత్తి

17 Feb, 2016 00:13 IST|Sakshi
నురగ కాసిన పత్తి

పత్తి.. ప్రతిక్షణం ఆమె వెన్నంటే ఉంది! కాపురానికి వచ్చిన నాటి నుంచీ... ‘మంచిరోజులు రాకపోతాయా’ అని... కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఆమె చూసింది. భర్త కళ్లల్లో అంధత్వమై పూసిన పత్తి పూలను చూసి కుమిలిపోయింది. అప్పు చేసి పత్తి వేస్తే.. పొలం ఎండు పువ్వై ఆమెను ఏడిపించింది. పని చేయలేని భర్త.. పస్తులుంటున్న పిల్లలు.. పీకల దాకా వడ్డీలు.. కలిసిరాని కాలం... కనుచూపు మేరలో కనిపించని పరిష్కారం... ఆమె పురుగుల మందు తాగింది!! అప్పుడు కాసింది పత్తి... విరగ్గాసింది. ఆమె నోట్లో నురగై కాసింది. ఆ తర్వాత కూడా... తల వెనుక దీపమై పత్తి ఆమెను వెంటాడేదే..! అదృష్టం.. అలా జరగలేదు! దురదృష్టం.. ఇప్పుడు జరుగుబాటు లేదు!

ఏడవడానికి కన్నీళ్లు కూడా కరువైన ఈ తల్లి కళ్లల్లో ‘ఎందుకు బతికాన్రా  దేవుడా’ అన్న బాధే కనిపిస్తోంది.

 
ఆమె పేరు రమ. ఊరు.. శంకరపట్నం మండలం ముత్తారం గ్రామం. నూనె ఐలుమల్లు, లింగమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు. వాళ్లలో పెద్దబిడ్డ రమ. 2000 సంవత్సరంలో ఉన్నకొద్దిపాటి పొలం అమ్మేసి రమ పెళ్లి చేశారు. అట్లా పదహారేళ్లకే  వివాహబంధంలో బందీ అయింది రమ. ఆమె భర్త పేరు రవి. చేపలు పట్టే కులవృత్తే వాళ్ల కుటుంబానికి జీవనాధారం. దానితో సరిపడా ఆదాయం రాకపోయినా ఉన్నంతలోనే రవి, రమా సర్దుకుపోయేవారు.
   
కాలం గడుస్తోంది. పిల్లాడు (అంజి) పుట్టాడు. ఆదాయం మాత్రం పెరగట్లేదు.  రమ ఆందోళనంతా అదే. పెరిగిన సంసారానికి సరిపడా సంపాదన లేకపోతే ఇల్లు ఎట్లా గడవాలే? పిల్లాడెట్టా పెరగాలే? వాడినెలా చదివించాలె? ఇదే రంది ఆమెకు. ఎట్లయినా చేసి భర్త సంపాదనకు చేదోవాదోడుగా మారాలి. ఈ ఆలోచనతోనే పగలురేయి గడిచిపోతున్నాయి. ఉన్నట్టుండి 2004లో.. రవి.. ఒక కంటి చూపు మందగించడం మొదలైంది.

వైద్యం తీసుకుంటూ, చూపు కనిపించినంత మేరా పనిచేసుకుంటూ నెట్టుకొస్తున్నాడు. నాలుగేళ్లు గడిచాయి. 2008లో కూతురు అమూల్య పుట్టింది. ఆ సంతోషంలో ఉండగానే రవి రెండో కంటి చూపూ మందగించసాగింది. రెండు కళ్లూ కనిపించడం లేదు! వైద్యం కోసం కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌ల చుట్టూ తిరిగాడు. చూపు మాత్రం రాలేదు కానీ 40 వేల అప్పు మిగిలింది ఆ దంపతులకు.  
 
పిప్పి చేసిన పత్తి
రవి పూర్తిగా చూపు కోల్పోయి, కాలకృత్యాలకూ రమ మీదే ఆధారపడే పరిస్థితి వచ్చింది. అనివార్యంగా కుటుంబ పోషణభారం ఆమె మీదే పడింది. కష్టాలన్నీ కుమ్మక్కయి ఒక్కసారిగా చుట్టుముట్టే సరికి పోరాడే దారి తెలియలేదు. పిల్లలను సర్కారు బడిలో చేర్పించి అప్పుల ఊబి నుంచి తప్పించుకోవడానికి కూలీగా మారింది. రెక్కలు ముక్కలు చేసుకోసాగింది. కానీ రోజూవారి కూలీతో అప్పులు తీరడం అటుంచి కుటుంబం గడవడమే గగనం అయింది.

అప్పుడు ఆమె పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులో సర్కారు ఇచ్చిన 20 గుంటల భూమిని సాగు చేయడం మొదలుపెట్టింది. తొలి రెండేళ్లు రూపాయి కూడా గిట్టుబాటు కాలేదు. ఈ ఇరవై గుంటల భూమి మీదే ఆధారపడితే లాభంలేదనుకొని మరో 20 గుంటల భూమిని కౌలుకి తీసుకుంది. లక్షన్నర అప్పు చేసి మరీ పత్తి వేసింది. ఇక్కడా నిరాశే. పత్తివిత్తనాలు నాటిన నాటినుంచి ఒక్క చినుకూ రాలక పత్తి సాగులో గునుగుపువ్వు పూసింది తప్ప పత్తిపువ్వు విప్పలేదు.

కళ్లముందే ఎండి పోయింది. అప్పట్నుంచి రమ మనోవేదనకు గురవసాగింది. చుట్టుముట్టిన కష్టాలన్నీ వికటాట్టహాసం చేస్తున్నట్టనిపించింది.  కలిసిరాని కాలాన్ని ఎదిరించలేననుకుంది. కళ్లు లేని భర్తను, పెరిగి పెద్దవుతున్న  పిల్లలను పోషించడం భారమని తలచింది. చావొక్కటే మార్గమని భావించింది. ఈనెల 3న మధ్యాహ్నం ఇంట్లోనే భర్త ఎదుటే పురుగుల మందు తాగింది. భర్తకు కళ్లు కన్పించక పోవడంతో ఏం జరుగుతుందో తెలియలేదు. నురుగలు కక్కుతున్న రమను ఇరుగుపొరుగు చూసి హుటాహుటిన  జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.  
 
డాక్టర్ దేవుడు
రమ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన సర్కార్ వైద్యులు ఆమె బతడం కష్టమని తేల్చేశారు. హుజూరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. రమ, రవి దంపతుల పిల్లలిద్దరు ఆసుపత్రిలో కనిపించిన ప్రతి డాక్టర్ దగ్గరకు వెళ్లి ‘మా అమ్మను బతికించండి’ అంటూ కాళ్లావేళ్లా పడసాగారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన శ్రీ విజయసాయి ఆసుపత్రి డాక్టర్ సురంజన్ ఆమె పరిస్థితిని  గమనించారు. తల్లిని బతికించమని బతిమాలుకుంటున్న ఆ ఇద్దరు పిల్లలను చూసి చలించిపోయారు.

అంధుడిగా రవి నిస్సహాయతకు కదిలిపోయారు. హుటాహుటిన రమను తన ఆస్పత్రికి తీసుకెళ్లి అత్యవసర వైద్యం మొదలుపెట్టారు. ఇంజక్షన్లు, మందులు, ఆపరేషన్ల కోసం పెద్దమొత్తంలోనే సొంతడబ్బు ఖర్చు చేశారు. గత రెండు వారాలుగా చికిత్స అందిస్తూనే ఉన్నారు. వారంకిందట  రమకు గొంతు దగ్గర ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆమె మాట్లాడే పరిస్థితిలో లేనప్పటికీ మృత్యువును మాత్రం జయించింది.
 
ఆరోగ్యం పర్వాలేదు.. కానీ బతుకు దెరువు?

చావు గుప్పిట్లోనుంచి రమ బయటపడింది కానీ ఆమె కుటుంబం గడిచేదెట్లా? పిల్లలను పెంచేదెట్లా? అంధుడైన  భర్త బాధ్యతను మోసెదెట్లా? పూరిగుడిసె తప్ప ఏ ఆధారమూ లేని తాను చేసిన అప్పులు తీర్చేదెట్లా? అంటూ మథనపడుతోంది రమ. ఏడవడానికి కన్నీళ్లు కూడా కరువైన ఆ తల్లి కళ్లల్లో ‘ఎందుకు బతికాన్రా  దేవుడా’ అన్న బాధే కనిపిస్తోంది.
 - పసునూరు మధు, సాక్షి ప్రతినిధి, కరీంనగర్  
గన్ను శ్రీనివాస్, జమ్మికుంట విలేకరి
 
ఉపాధి చూపిస్తే బతుకుతం
మా అదృష్టం బాగుంది.  మా పిల్లలను, నన్ను చూసి అ భగవంతుడు పెద్దపెద్దోళ్ల సాయంతో నా భార్యను బతికించిండు. నా భార్య ప్రాణాలు కాపాడిన డాక్టర్‌కు రెండు చేతుల దండం పెడుతున్నం. రమ బతికినందుకు సంతోషంగా ఉన్నా...రేపటి నుంచి ఎట్ల బతకాలో తలుచుకుంటేనే భయమేస్తుంది.  దయగల మారాజులు మమ్ముల్ని ఆదుకోవాలి.  సర్కారోళ్లు ఇంటికాడ దుకాణం పెట్టుకునేందుకు సాయం చేస్తే అది నడుపుకుంటూ నన్ను నా పిల్లలను సాదుకుంటది నా భార్య. మీ అందరికి రెండు చేతులా మొక్కుతున్న. దయ చూపించాలే.
- రమ భర్త రవి
 
చదువుకోవాలని ఉంది... అన్నం లేక పస్తులుంటున్నం
నాకు, చెల్లికి చదువుకోవాలని ఉంది. బడిలో పెట్టిన అన్నం తింటున్నం. బడి బందున్న రోజు పస్తే.  చాలాసార్లు రాత్రి అన్నం లేక ఉపవాసాలు ఉంటున్నం. చదువుకోవడానికి పెద్దసార్ల సహాయం కోరుతున్నం.    
- అంజి
 
కోలుకుంటోంది
రమ కుటుంబ పరిస్థితి నన్ను కదిలించింది. దాతల సహకారంతో వైద్యాన్ని అందించా! ఇప్పుడు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది.  గొంతు దగ్గర ఆపరేషన్ చేయడంతో ప్రస్తుతం  మాట్లాలేక పోతుంది. ఈ రోజు (బుధవారం) మరోసారి గొంతు వద్ద చిన్న ఆపరేషన్ చేసి ట్యూబ్ వేయాలి. ఇప్పటి వరకు రూ. రెండున్నర లక్షల వరకు ఖర్చయింది. మరో రూ.50 వేల వరకుఖర్చవుతుంది. రమ కుటుంబం దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఆ కుటుంబాన్ని ఆదుకోకపోతే భవిష్యత్తులోనూ వారికి ఇబ్బందే.
- డాక్టర్ సురంజన్
 
ఆ తల్లికి, ఆ కుటుంబానికి ఆర్ధికంగా చేయూత ఇవ్వాలనుకుంటే: రమ తండ్రి ఐలమల్లు మొబైల్ నెంబర్: 8008631247

మరిన్ని వార్తలు