పీడియాట్రీ కౌన్సెలింగ్

29 May, 2015 22:39 IST|Sakshi

మా బాబు వయసు ఏడాదిన్నర. దగ్గు ఎక్కువగా వస్తుంటే డాక్టర్‌కి చూపించాం. ఛాతీలో నెమ్ము ఉందని చెప్పారు. యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ చేశారు. ఈ నెమ్ము సమస్య ఎందుకు వస్తుంది? మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.
 - సంతోషి, కమలాపురం


మీ బాబుకు ఉన్న కండిషన్‌ను వైద్యపరిభాషలో నిమోనియా అంటారు. పిల్లల్లో అత్యంత ప్రమాదకరంగా మారేందుకు కారణమయ్యే వ్యాధుల్లో నిమోనియా ఒకటి.  డయేరియా తర్వాత పిల్లల్లో ప్రమాదకరంగా పరిణమించే వ్యాధుల్లో ఇది రెండోదని చెప్పవచ్చు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నిమోనియాకు అత్యంత ప్రధాన కారణాలు. కొన్ని సందర్భాల్లో  కొన్ని శరీర నిర్మాణపరమైన లోపాల  వల్ల, రోగనిరోధక శక్తి లోపాల వల్ల కూడా నిమోనియా కనిపించవచ్చు. ఒక ఏడాది వ్యవధిలోనే రెండు మూడు సార్లు నిమోనియా వస్తే అలాంటి పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగని మొదటిసారి వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించడం సరికాదు. నిమోనియా వచ్చినప్పుడు వారం నుంచి పది రోజుల పాటు యాంటీబయాటిక్స్‌తో పిల్లలకు సరైన వైద్యచికిత్స అందించడం ఎంతైనా ముఖ్యం.

 తీసుకోవాల్సిన జాగ్రత్తలు:  ఇలాంటి పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగానే పరిగణించవచ్చు. అయితే గుంపులు గుంపులుగా జనం ఉన్న చోట్లకు నిమోనియాతో బాధపడే పిల్లలను పంపకూడదు  ఇంట్లో చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడే రోగులు ఉంటే వారి నుంచి కూడా ఈ పిల్లలను దూరంగా ఉంచాలి  పిల్లలందరికీ టీకాలు వేయించడం ప్రధానం. హెచ్‌ఐబీ, నిమోకోకల్ వ్యాక్సిన్లు, ఫ్లూ వైరస్ వ్యాక్సిన్‌లతో నిమోనియాను చాలా వరకు నివారించవచ్చు.
 
 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
 సీనియర్ పీడియాట్రీషియన్
 స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
 

మరిన్ని వార్తలు