ఆమెను పొడిచాడు... కాని తప్పించుకున్నాడు...

12 Jun, 2018 00:10 IST|Sakshi

న్యాయపోరాటం

ఫొటోలో కనిపిస్తున్నది 23 ఏళ్ల ఖాదిజా సిద్దిఖీ. పాకిస్తాన్‌లో ఇప్పుడు ఈ అమ్మాయి వార్తల్లో ఉంది.ఆమెకు న్యాయం అందుతుందా లేదా అని దేశం అంతా ఎదురు చూస్తూ ఉంది.  సాక్షాత్తూ ఆ దేశ సుప్రీం కోర్టే రంగంలో దిగి మరీ కేసును పరిశీలిస్తోంది. ఇంతకూ ఏమైంది?

23 కత్తిపోట్లు
2016. మే 3. లా స్టూడెంట్‌ అయిన ఖాదిజా తన కారు డ్రైవర్‌తో కలిసి లాహోర్‌లోని సిమ్లాహిల్‌ ప్రాంతంలోని స్కూల్‌ నుంచి తన చెల్లెలిని ఇంటికి తీసుకురావడానికి వెళ్లింది. చెల్లెలిని తీసుకుని కారులో కూచుంటూ ఉండగా హెల్మెట్‌ ధరించిన ఒక వ్యక్తి వచ్చి ఆమె మీద విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. వెన్ను మీద 23సార్లు పొడిచి పారిపోయాడు. ఇది తన క్లాస్‌మేట్‌ షా హుసేన్‌ పనే అని ఖాదిజా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ట్రయల్‌ కోర్టు ఈ విషయాన్ని నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇది చాలదని ఖాదిజా భావించి సెషన్స్‌ కోర్టుకు వెళ్లింది. అసలు ఈ పని చేసింది తాను కాదని షా హుసేన్‌ కూడా సెషన్‌ కోర్టుకు వెళ్లాడు. సెషన్‌ కోర్టు అతడికి కొన్ని పెనాల్టీలు విధించి శిక్షను ఐదేళ్లకు తగ్గించింది. అది కూడా అన్యాయమే అని షా హుసేన్‌ లాహోర్‌ హైకోర్టుకు అప్పీల్‌ చేశాడు. జైలు నుంచే న్యాయం కోసం పోరాడాడు. కేసును పరిశీలించిన హైకోర్టు షా హుసేన్‌ నిర్దోషి అని గత వారం తీర్పు ఇచ్చింది. ఈ విషయమై ఆ దేశపు సోషల్‌ మీడియాలో పెద్ద గగ్గోలు రేగింది. వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించాలని ఆ దేశపు చీఫ్‌ జస్టిస్‌ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఆదేశించారు. ఇప్పుడు తిరిగి కేసు తెరవాలా వద్దా అనేది తేలనుంది.

కేసు ఎందుకు కొట్టేశారు....
‘పెళ్లి చేసుకోమని కోరాడు. నేను నిరాకరించడం వల్లే దాడి’ అనేది ఈ దాడి తర్వాత ఖాదిజా చేసిన అభియోగం. అయితే ప్రాసిక్యూషన్‌గాని, ఇన్వెస్టిగేషన్‌ అధికారులుగాని దాడిని నిర్ధారణ చేసే విషయాలను బలంగా కోర్టు ముందుకు తెచ్చే ప్రయత్నం చేయలేదు. ‘పెళ్లికి నేను అంగీకరిస్తున్నాను’ అని ఖాదిజా ఇచ్చినట్టుగా చెబుతున్న ఒక ఉత్తరాన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. అది ఆమె ఇచ్చినదో కాదో ఒకవేళ ఇచ్చి ఉంటే ఏ పరిస్థితుల్లో ఇచ్చిందో తేల్చలేదు. నిందితుడి ఒంటి మీద రక్తపు మరకలు గానీ హెల్మెట్‌ మీద మరకలు కాని ఫోరెన్సిక్‌ ద్వారా తేల్చే ప్రయత్నం చేయలేదు. ఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత ఒక పార్కులో దాడికి కారణమైన కత్తి దొరికింది. దాని మీద ఒక్క చుక్క రక్తం లేదు. నిందితుడు హెల్మెట్‌లో ఉండటం వల్ల అది షా హుసేనే కావలసిన అవసరం లేదని డిఫెన్స్‌ వాదించింది. కాలేజీలో అతని మీద దాడి ముందు వరకు ఆమె ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం కూడా డిఫెన్స్‌కు లాభించింది. అన్నింటి కంటే ముఖ్యం షా హుసేన్‌ తండ్రి పేరు మోసిన లాయరు కావడం అతడు తన కుమారుడి తరఫున డిఫెన్స్‌ అంతా పకడ్బందీగా ఉండేలా చూసుకోవడం కూడా కేసు కొట్టివేతకు ఒక కారణం కావచ్చు.

ఎంతో ధైర్యస్తురాలు
ఖాదిజా ఎంతో ధైర్యస్తురాలు. తన మీద అంత పెద్ద దాడి జరిగినా ధైర్యంగా తనను తాను కూడగట్టుకోగలిగింది. స్వస్థత పొందగలిగింది. అంతే కాదు అప్పట్లో రాయకుండా వదిలిపెట్టిన పరీక్షలను ఇప్పుడు రాసి తన చదువును ముగించబోతోంది. న్యాయం కోసం పోరాడుతాను అని ఆమె అంటోంది. సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తోంది. న్యాయస్థానంలో ఆమెకు దొరకబోయే న్యాయం ఎలా ఉన్నా సోషల్‌ మీడియాలో ఆమె భారీ స్థాయి స్పందన వచ్చి నిందితునికి సోషల్‌ మీడియానే పెద్ద శిక్ష వేసినంత పని చేసింది. షా హుసేన్‌ను నిరసిస్తూ ఖాదిజాకు మద్దతిస్తూ ఎందరో పోస్టింగులు పెట్టారు.

మరిన్ని వార్తలు